TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

3000 పుస్తకాల పఠనం, 141 ఐక్యూ: ఐదేళ్లకే మెన్సా లో చోటు..భారత సంతతి బాల మేధావి.!

Published on: Sat Oct 24, 2026 10:17AM

సాధారణంగా ఐదేళ్ల వయసులో పిల్లలు.. మెరుపు మెరిస్తే..వాన కురిస్తే..ఆకసమున హరివిల్లు విరిస్తే అవి మాకే అని ఆనందించే మానసిక స్థితిలో ఉంటారు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం.. కష్టం సౌఖ్యం ఏమీ తెలియని పువ్వుల్లా ఉంటారు. మహా అయితే..  అక్షరాలు దిద్దుతూ,  అంకెలను వల్లె వేస్తూ, ఆటపాటలతో సందడిసందడిగా తిరుగుతుంటారు.  అయితే ఈ శైశవ దశలో  కెనడాలో నివసిస్తున్న భారత సంతతి బాలుడు అర్జున్ ప్రజాపతి  అసాధారణమైన మేధస్సుతో ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాడు. కేవలం ఐదేళ్ల వయసులోనే అర్జున్ ప్రజాపతి మూడు వేలకు పైగా పుస్తకాలను చదివి ఆకళింపు చేసుకున్నాడు. ఈ బాలమేధావి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హై-ఐక్యూ సొసైటీలుగా పేరుగాంచిన మెన్సా, ఇంటర్‌టెల్ సంస్థల్లో సభ్యత్వం సంపాదించాడు.  ఈ చిన్నారి ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా  ప్రముఖులు, మేధావులనే విస్మయపరుస్తోంది.  

అర్జున్ తల్లిదండ్రులు ఇండియాలోని  గుజరాత్ రాష్ట్రానికి చెందిన వడోదర ప్రాంతానికి చెందిన వారు. తండ్రి డాక్టర్ విశాల్ వి ప్రజాపతి   వైద్యుడిగా,  క్లినికల్ రీసెర్చర్‌గా సేవలనందిస్తుండగా, తల్లి మహిత   న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కెనడాలో స్థిరపడిన ఈ దంపతుల గారాల పట్టి   అర్జున్, అనితర సాధ్యమైన కాని రీతిలో కేవలం 18 నెలల ప్రాయంలోనే పుస్తకాలు చదవడం ప్రారంభించాడు. అప్పటి నుంచి మొదలైన అతడి  పఠనాసక్తి ఇప్పుడు అతడిని అద్భుతమైన శిఖరాలకు చేర్చింది. ఇప్పటివరకు అర్జున్ గణితం, ఖగోళశాస్త్రం, మానవ శరీరధర్మశాస్త్రం, జన్యుశాస్త్రం, మైక్రోబయాలజీ,  ప్రపంచ చరిత్ర వంటి  క్లిష్టమైన, పెద్దలు సైతం అర్థం చేసుకోవడానికి కష్టపడే అంశాలకు సంబంధించి 3వేలకు పైగా పుస్తకాలను చదివి అర్ధం చేసుకున్నాడు. 

ఇటీవల  స్టాన్‌ఫర్డ్ బినెట్ ఇంటెలిజెన్స్ స్కేల్స్ పరీక్షను నిర్వహించగా, అర్జున్ ఏకంగా 141 ఐక్యూ స్కోర్‌ను నమోదు చేసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఈ అద్భుత  మేధో సంపత్తి కారణంగా ప్రపంచ జనాభాలో కేవలం టాప్ 1 శాతం మేధావులకు మాత్రమే లభించే  మెన్సా ఇంటర్‌టెల్' సొసైటీల్లో అతి పిన్న వయస్కుడిగా ప్రవేశం పొందాడు. చిన్న వయసులోనే శాస్త్ర, ఖగోళ, వైద్య రంగాలపై అపారమైన పట్టు సాధించిన ఈ బాల మేధావి ప్రతిభను  కెనడా ప్రధానితో పాటు ఒంటారియో ప్రీమియర్ ప్రత్యేకంగా అభినందించారు.  


[Five Year Old Genius Arjun Prajapati, mensa society, 141IQ, indian Origin Boy, ChildPprodigy, Telugu One]