కేంద్రంతో ఇబ్బందే....జగన్ కి మరో సంస్థ హెచ్చరికలు....అయినా ఆగుతారా ?

 

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన సోలార్ , విండ్ పవర్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) అవకతవకలు జరిగాయని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. ఎవరెన్ని చెబుతున్నా పీపీఏలను పునః సమీక్షించి తీరాలని పట్టుపట్టుకు కూర్చున్నారు. అలా సమీక్ష చేసేందుకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. పీపీఏలలో ఎటువంటి అవకతవకలు ఉండవని అయినా వాటిని సమీక్షిస్తే దాని ప్రభావం పెట్టుబడులపై ఉంటుందని కేంద్రం హెచ్చరిస్తోన్నా జగన్ సర్కారు మాత్రం వాటిని సమీక్షించి తీరుతామని చెబుతోంది. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ జగన్‌కు లేఖ రాసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదు.

 ఈ విషయం మీద కార్పొరేట్ రేటింగ్ సంస్థ ఫిచ్ కూడా పీపీఏ సమీక్ష విషయమై జగన్ సర్కార్ ని హెచ్చరించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్ష కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఫిచ్ హెచ్చరించింది. సోలార్, విండ్ పవర్ పర్చేజ్ ఒప్పందాలను సమీక్షించేందుకు ఏపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు నగదు ప్రవాహానికి ఇబ్బందులు కలిగిస్తాయని అభిప్రాయపడింది. ఈ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలతోపాటు కేంద్రం నుంచి కూడా తీవ్ర సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఫిచ్ హెచ్చరించింది. పీపీఏలను రద్దు చేయడం, కొత్తగా ఒప్పందాలు చేసుకోవడం లాంటి చర్యల కారణంగా చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేసింది.