TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తప్పక చేయాల్సిన ఆర్థిక ప్లానింగ్ .!

Published on: Wed Sep 23, 2026 9:36AM

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తప్పక చేయాల్సిన ఆర్థిక ప్లానింగ్ .!

ఒక స్త్రీ జీవితంలో తల్లి కావడం అనేది అత్యంత మధురమైన, భావోద్వేగపూరితమైన అనుభూతి. ఇంటికి చిన్నారి రాకతో కుటుంబంలో సంతోషాలు పదింతలు అవుతాయి. అయితే ఈ కొత్త ప్రయాణం కేవలం ఆనందాన్ని మాత్రమే కాదు, అనేక బాధ్యతలను కూడా తీసుకొస్తుంది. బిడ్డ ఆరోగ్య సంరక్షణ, సరైన పెంపకం, నాణ్యమైన విద్య, వారి భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించడం వంటివన్నీ తల్లిదండ్రుల ముందు నిలిచే ప్రధాన బాధ్యతలు. ఈ క్రమంలో ముఖ్యంగా కొత్తగా తల్లి అయినవారు లేదా తల్లి కాబోతున్నవారు సరైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడం చాలా అవసరం. సమయానికి తీసుకునే సరైన  నిర్ణయాలు పిల్లల భవిష్యత్తును బంగారు బాటగా మారుస్తాయి. ప్రతి కొత్త తల్లి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఆర్థిక సూత్రాలు ఏంటో తెలుసుకుంటే..

ఎమర్జెన్సీ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్..

ఆర్థిక ప్రణాళికలో వేసే మొదటి అడుగు ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం. జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించడం కష్టం. వైద్య అత్యవసర పరిస్థితులు వచ్చినా లేదా ఉద్యోగంలో ఊహించని మార్పులు ఎదురైనా కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండటానికి కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా డబ్బును అత్యవసర నిధిగా పక్కన పెట్టాలి. దీనివల్ల ఇతరులపై ఆధారపడే పరిస్థితి రాదు. 

దీంతోపాటు తల్లి, బిడ్డ ఇద్దరికీ తగిన ఆరోగ్య బీమా రక్షణ ఉండటం చాలా కీలకం. ఒకవేళ ఇప్పటికే ఆరోగ్య బీమా పాలసీ ఉంటే, అందులో కొత్తగా పుట్టిన బిడ్డ పేరును వీలైనంత త్వరగా చేర్పించడం మర్చిపోకూడదు.

పొదుపు అలవాటు , పెట్టుబడులు..

సాధారణంగా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా ఖర్చు చేసే అలవాటు ఉంటే, తల్లి అయిన తర్వాత దానిని వెంటనే మార్చుకోవాలి. ఆదాయంలో కనీసం పాతిక శాతాన్ని పొదుపు చేయడం ఉత్తమమైన పద్ధతి. ఈ పొదుపు కేవలం బ్యాంకు ఖాతాలో ఉంచడమే కాకుండా, మంచి అవగాహనతో సరైన మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల చక్రవడ్డీ   లభిస్తుంది. కాలక్రమేణా ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మంచి రాబడి రావడానికి, ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ఈ అలవాటు ఎంతగానో తోడ్పడుతుంది.

ఖర్చుల నిర్వహణ , బడ్జెట్..

పాప లేదా బాబు పుట్టిన తర్వాత ఇంట్లో ఖర్చులు అనుకోకుండా పెరుగుతాయి. అందుకే ప్రతినెలా వచ్చే ఆదాయం, జరిగే ఖర్చులను ఒక క్రమపద్ధతిలో నమోదు చేయడం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు దుస్తులు, బొమ్మలు లేదా ఇతర అనవసర విషయాలపై ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంటే వాటిని గుర్తించి తగ్గించుకోవాలి. ప్రణాళికాబద్ధంగా బడ్జెట్ కేటాయించుకుని అనవసరమైన ఖర్చులను అరికడితే, ఆ డబ్బు పొదుపుగా మారి భవిష్యత్తులో బిడ్డ అవసరాలకు ఉపయోగపడుతుంది.

చిన్న చిన్న టార్గెట్స్..

భవిష్యత్తు అవసరాలను ఒకేసారి పెద్ద భారంగా భావించకుండా ఉండటానికి ఆర్థిక ప్రణాళికను చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకోవాలి. ఉదాహరణకు పిల్లలను స్కూల్ లో చేర్పించడం, సంవత్సరానికి సరిపడా  వైద్య ఖర్చులు, ప్రతి సంవత్సరం చేయాల్సిన పొదుపు వంటి వాటికి వేర్వేరుగా చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రణాళిక స్పష్టంగా ఉంటుంది, మనం ఎంతవరకు చేరుకున్నామో సులభంగా అర్థమవుతుంది. పెద్ద ఖర్చులను చిన్న భాగాలుగా విభజించి ప్రణాళిక వేసుకోవడం వల్ల ఒత్తిడి లేకుండా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు.

జీవిత భాగస్వామితో కలిసి ఆలోచించడం..

ఆర్థిక ప్రణాళిక అనేది ఒక్కరి బాధ్యత మాత్రమే కాదు. తల్లిదండ్రులిద్దరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ప్రతి నెల బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం, పొదుపు చేయడం, పిల్లల చదువుల ఖర్చులు వంటి ప్రతి విషయంపై జీవిత భాగస్వామితో కలిసి చర్చించాలి. దీనివల్ల ఇద్దరికీ కుటుంబ బాధ్యతలపై స్పష్టత వస్తుంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం తేలికవుతుంది. ఇద్దరూ కలిసి పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తే కుటుంబానికి బలమైన ఆర్థిక పునాది ఏర్పడి, బిడ్డ భవిష్యత్తుకు పూర్తి భద్రత లభిస్తుంది.

                      *రూపశ్రీ.