ఆన్‌లైన్ వేధింపులు: ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ బలవన్మరణం.!
Published on: Thu Oct 22, 2026 11:39AM

సోషల్ మీడియాలో ఆర్థిక వేధింపులను తాళలేక.. బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉన్న ఓ యువ ఇన్ ఫ్లుయెన్సర్ బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎదురైన తీవ్రమైన సైబర్ బెదిరింపులు, వ్యక్తిగత వేధింపుల కారణంగా 27 ఏళ్ల హరీష్ చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలలో ఫైనాన్స్ విత్ హరీష్ పేరిట ఆయన నిర్వహించే పేజీకి బోలెడంత మంది ఫాలోవర్లు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్, వివిధ ఆర్థిక ఇన్వెస్ట్ మెంట్లకు సంబంధించిన విషయాలపై హరీష్ వీడియోలు చేసేవాడు. ఆయన పేజీకి 1.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. గత ఐదేళ్లుగా నిలకడగా ఈ కంటెంట్‌ను రూపొందిస్తూ హరీష్ ఫైనాన్స్ ఇన్ ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు పొందారు.

ఈ నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఆయన కెరీర్‌కు సంబంధించి వివాదాలు తెరపైకి వచ్చాయి. ఆయనకు సెబీ నుంచి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకపోయినా ప్రజలకు పెట్టుబడి సలహాలు ఇస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యూట్యూబర్ జేసన్ శామ్యూల్ తదితరులు ఆయనపై బహిరంగంగా ఆరోపణలు చేయడంతో పాటు సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయించేలా ఒత్తిడి తెచ్చారు. సోషల్ మీడియాలో తన ఖాతాలు నిలిచిపోవడం, తదితర పరిణామాలతో తీవ్ర మానసిక వేదనకు గురైన హరీష్ బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఈ మేరకు మృతుడి తండ్రి వినాయగం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మృతికి సైబర్ వేధింపులే కారణమని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు తన కుమారుడు హరీష్ ను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశ పూర్వకంగా ఆన్ లైన్ వేధింపులకు పాల్పడ్డారనీ, ఆ కారణంగానే హరీష్ బలవన్మరణానికి పాల్పడ్డాడనీ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరణించడానికి ముందు హరీష్ రికార్డ్ చేసిన చివరి వీడియోలో ఆరోపణలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని, వాటిని పరిశీలించాలని కోరారు. మరోవైపు ఈ ఆరోపణలను ఖండిస్తూ జేసన్ శామ్యూల్ తాము కేవలం చట్టపరమైన నిబంధనలను, లైసెన్స్ లేని విషయాన్నే ప్రశ్నించామని, ఎలాంటి వ్యక్తిగత వేధింపులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లీకైన డిజిటల్ ఆధారాలు, సోషల్ మీడియా పోస్టులు, ఇరువర్గాల వాదనలను పరిశీలిస్తున్నారు.
[Finance Influencer Harish Sucide, Chennai Suicide, Finance With Harish, Cyberbullying Allegations, Jason Samuel, Telugu One]


