పండుగ షాపింగ్.. ఆన్లైల్ లో బట్టలు, వస్తువులు కొనడం మంచిదేనా.!
Published on: Sun Oct 4, 2026 2:27PM
పండుగ షాపింగ్.. ఆన్లైల్ లో బట్టలు, వస్తువులు కొనడం మంచిదేనా.!

పండుగ అంటే సందడే సందడి.. ముఖ్యంగా సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో ఇళ్లలోనే కాదు.. మార్కెట్లో కూడా చాలా సందడిగా ఉంటుంది. ఇదివరకు రోజుల్లో పండుగ వస్తుందంటే.. ఇంటికి కొత్త వస్తువులు, ఇంటిల్లిపాదికి కొత్త బట్టలు కొనడానికి బట్టల షాపుల దగ్గర జనం ఎక్కువగా ఉండేవారు. కానీ నేటి డిజిటల్ యుగంలో మాత్రం సీన్ పూర్తీగా మారిపోయింది. పండుగలు వస్తున్నాయంటే చాలు.. పండుగ సేల్ పేరుతో డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో దుస్తుల నుండి అన్ని రకాల వస్తువులు చాలా ఆపర్ తో అందుబాటులో ఉన్నాయని ప్రమోషన్ చేస్తుంటారు. అయితే పండుగ సమయాల్లో ఆన్లైట్ ప్లాట్ఫామ్ లలో షాపింగ్ చేయడం మంచిదేనా? ఆన్లైల్ షాపింగ్ గురించి చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు వివరంగా తెలుసుకుంటే..
పండుగ వస్తే చాలు, ఇళ్లకు కావలసిన కొత్త దుస్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులతో మార్కెట్లు కిక్కిరిసిపోతాయి. అయితే, ఇటీవలి కాలంలో రద్దీలో తిరిగే ఓపిక లేక, సమయం కలిసి వస్తుందని చాలామంది ఆన్‌లైన్ షాపింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఆకర్షణీయమైన ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు చూసి మురిసిపోతూ ఇష్టమైన వస్తువులను కార్ట్‌లో వేసి ఆర్డర్ చేసేస్తున్నారు. అయితే, ఆన్‌లైన్ లో కనిపించే ప్రతి ఆఫర్ మనకు లాభం చేకూరుస్తుందా అంటే కచ్చితంగా చెప్పలేం. పండుగ సరదాలో మనం చేసే కొన్ని ఆన్‌లైన్ కొనుగోళ్లు ఒక్కోసారి ఊహించని షాక్‌లు ఇస్తుంటాయి. ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేసే ముందు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని చేదు నిజాలు ఉన్నాయి.
దుస్తులు..
ఆన్‌లైన్ లో దుస్తులు కొనేటప్పుడు ఫోటోల్లో కనిపించే రంగు, మెరుపు, క్వాలిటీ నేరుగా ఇంటికి వచ్చేసరికి సరిపోలకపోవడం చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య. ఫోటోషూట్‌ల కోసం వాడే లైటింగ్, ఎడిటింగ్ వల్ల వస్త్రాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. తీరా ప్యాకెట్ విప్పి చూస్తే క్వాలిటీ తక్కువగా ఉండటం లేదా రంగు మారడం వంటివి జరుగుతుంటాయి. పైగా పండుగ సమయానికి వేసుకోవడానికి సరైన సైజు రాకపోతే, దాన్ని రిటర్న్ చేసి మళ్లీ కొత్తది తెప్పించుకోవడానికి పండుగ రోజులు దాటిపోతాయి. దీని కారణంగా పండుగకు కొత్త దుస్తులు వేసుకోలేరు.
డిస్కౌంట్ మాయాజాలం..
పండుగ సేల్స్ అనగానే యాభై శాతం, డెబ్బై శాతం డిస్కౌంట్ అని పెద్ద అక్షరాలతో ప్రకటనలు కనిపిస్తాయి. కానీ చాలా కంపెనీలు సేల్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే వస్తువుల అసలు ధరలను పెంచేసి, ఆ తర్వాత భారీగా డిస్కౌంట్ ఇస్తున్నట్లు చూపిస్తాయి. దీనివల్ల వినియోగదారులకు నిజమైన ఆదా ఏమీ ఉండదు. నిజానికి సాధారణ రోజుల్లో ఉండే ధరలకే లేదా అంతకంటే కాస్త ఎక్కువ ధరకే పండుగ సేల్‌లో కూడా వస్తువులు అమ్ముడవుతుంటాయి.
ఫేక్ వెబ్సైట్లు..
పండుగ సమయాల్లో ఆన్‌లైన్ లో రద్దీ ఎక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ వెబ్‌సైట్లు, సైబర్ నేరగాళ్లు విజృంభిస్తారు. సోషల్ మీడియాలో వచ్చే కొన్ని ప్రకటనల్లో తక్కువ ధరకే బ్రాండెడ్ దుస్తులు లేదా వస్తువులు ఇస్తామని లింకులు పెడతారు. ఆ ఆఫర్ నిజమేనని నమ్మి డబ్బులు చెల్లిస్తే, వస్తువు రాకపోగా మన బ్యాంక్ ఖాతా వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది.
బ్రౌజింగ్ హిస్టరీ చేదు నిజం..
షాపింగ్ యాప్‌లు మన బ్రౌజింగ్ హిస్టరీని పరిశీలించి, మనకు నచ్చిన వస్తువుల ప్రకటనలను పదే పదే చూపిస్తాయి. దీనివల్ల అవసరం లేకపోయినా, కేవలం ఆఫర్ ఉంది కదా అని అనవసర వస్తువులు కొని డబ్బులు వృథా చేసుకుంటాం. క్రెడిట్ కార్డులు, నో కాస్ట్ ఈఎమ్‌ఐ సౌకర్యాలు ఉన్నాయి కదా అని శక్తికి మించి కొనుగోళ్లు చేసి పండుగ తర్వాత అప్పుల పాలయ్యే అవకాశాలు ఉంటాయి.
సమయానికి రాకపోతే నిరాశే..
పండుగ సీజన్‌లో మిలియన్ల కొద్దీ ఆర్డర్లు రావడం వల్ల డెలివరీ సర్వీసులపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. పండుగ రోజు వేసుకోవడానికి ఆర్డర్ చేసిన డ్రెస్ లేదా పూజ కోసం తెప్పించిన వస్తువు సమయానికి చేరకపోతే పండుగ ఉత్సాహమే పాడవుతుంది. చాలా సందర్భాల్లో డెలివరీలు ఆలస్యం కావడం లేదా ఆర్డర్లు క్యాన్సిల్ కావడం జరుగుతుంటుంది.
జాగ్రత్తలు ముఖ్యం..
ఆన్‌లైన్ షాపింగ్ పూర్తిగా చెడ్డదని చెప్పలేం. అయితే కొనే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ఏ వస్తువైనా ఆర్డర్ చేసే ముందు వేరే ఇతర వెబ్‌సైట్లలో దాని ధరను సరిపోల్చి చూడాలి. గతంలో ఆ వస్తువు కొన్న ఇతర వినియోగదారులు ఇచ్చిన రివ్యూలు, రేటింగ్‌లు తప్పకుండా చదవాలి. అలాగే వస్తువు నచ్చకపోతే తిరిగి పంపడానికి రిటర్న్ పాలసీ ఉందో లేదో సరిచూసుకోవాలి. తెలిసిన, నమ్మకమైన అధికారిక యాప్‌లు లేదా వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే కొనుగోళ్లు చేయడం వల్ల మోసపోకుండా పండుగను సంతోషంగా జరుపుకోవచ్చు.
*రూపశ్రీ.


