ఫేక్ ఐఏఎస్ ల ఘరానా మోసం.!
Published on: Sat Aug 29, 2026 10:19AM

ప్రభుత్వ ఉద్యోగం సాధించి సమాజంలో ఉన్నత స్థాయిలో నిలవాలన్న కల కనడంలో తప్పులేదు. భారత మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం యువత, విద్యార్థులకు కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని పిలుపునిచ్చారు. అయితే అందుకు భిన్నంగా పెద్ద కల కని, దానిని సాకారం చేసుకోవడానికి అడ్డదారి తొక్కి అడ్డంగా బుక్కైన అన్నాచెళ్ళెల్ల ఉదంతమిది. లగ్జరీ కారు, దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే అఫీషియల్ బోర్డుతో ఆ అన్నా చెళ్లెళ్లు అయాయకులను బుట్టలో వేసి లక్షలకు లక్షలు కొల్లగొట్టారు.
తృప్తి సింగ్ రాజ్‌పుత్ అనే మహిళ, ఆమె సోదరుడు సుధాన్షు సింగ్ కలసి తమను తాము కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లుగా పరిచయం చేసుకున్నారు. విలాసవంతమైన వాహనంలో తిరుగుతూ, అధికార దర్పం ప్రదర్శిస్తూ స్థానిక నిరుద్యోగ యువతను బుట్టలో వేశారు.
హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ, మధ్య ప్రదేశ్ టూరిజం శాఖలో ఉన్నత స్థాయి సంబంధాలు ఉన్నాయని నమ్మించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ నమ్మబలికారు. నమ్మించారు. మంచి వేతనంతో కూడిన ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగులకు పెద్ద ఎత్తున వల విసిరారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఇక లైఫ్ సెటిలైపోయినట్లేనన్న ఆశతో పలువురు వీరికి పెద్ద మొత్తంలో సొమ్ము ఇచ్చారు.
ఆ సొమ్ము తీసుకుని ఈ బోగస్ ఐఏఎస్ లిద్దరూ, నకిలీ ఐడీ కార్డులు, నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు సృష్టించి బాధితులకు అందచేశారు. అయితే, ఉద్యోగాల్లో చేరాల్సిన సమయం రావడం, ఇచ్చిన పత్రాలు నకిలీవని తేలడంతో బాధితులకు లబోదిబో మన్నారు. పోలీ సులను ఆశ్రయించారు. దీంతో ఈ ఫేక్ ఐఏఎస్ ల గుట్టు రట్టైంది. పోలీసులు ఈ అన్నాచెళ్లెళ్లిద్దరన్నీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కారు సహా పలు నకిలీ డాక్యుమెంట్లు, ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
{Fake IAS Officers Fraud, Madhya Pradesh, Government Job Scam, Fake Bharat Sarkar Board, HRD Ministry Jobs, Telugu One}


