TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిన‌జీయ‌ర్‌ గుజ‌రాత్‌లో ఏం చేశారో తెలుసా? అమిత్‌షా బాల్యంలో ఏం జ‌రిగిందంటే..

Published on: Wed Feb 9, 2022 10:44AM

ముచ్చింత‌ల్‌లో స‌మతామూర్తి విగ్ర‌హం శోభాయ‌మానంగా వెలుగొందుతోంది. ఆ రామానుజుల ప్ర‌తిమ సాక్షిగా అనేక విష‌యాలు వెలుగుచూస్తున్నాయి. వెయ్యేళ్ల కింద‌టి రామానుజాచార్యుల‌ జీవితం ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో విశిష్టాద్వైత‌ స్పూర్తిని చాటుతూనే ఉంది. అలాంటి, రామానుజాచార్యుల జీవితమే ఓ సందేశం. అందరూ సమానులే అని వెయ్యేళ్ల క్రితమే చాటారు. ఆలయ ప్రవేశంలో అందరికీ సమాన హక్కు ఉందంటూ.. అమలుచేసి చూపించిన‌ మహనీయుడు రామానుజాచార్యులు. ఆయ‌న చూపించిన భ‌క్తి మార్గంలోనే.. చిన‌జీయ‌ర్ స్వామి సైతం ప‌య‌నిస్తున్నారు. స్వామీజీలంటే కేవ‌లం భ‌క్తి, ఆధ్యాత్మిక భావ‌నే కాకుండా.. మాన‌వ సేవే మాధ‌వ సేవగా భావించి, ఆచ‌రించి చూపారు చిన‌జీయ‌ర్‌. తాజాగా, రామానుజుల స‌హ‌స్రాబ్ది స‌మారోహ‌ణంలో పాల్గొన్న అమిత్‌షా.. చిన‌జీయ‌ర్ గొప్ప‌త‌నాన్ని వివ‌రించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

20 ఏళ్ల క్రితం విష‌యం. గుజరాత్‌ను భారీ భూకంపం కుదిపేసింది. వేల‌ల్లో ప్రాణ‌న‌ష్టం.. ల‌క్ష‌ల్లో క్ష‌త‌గాత్రులు. ప‌దుల సంఖ్య‌లో గ్రామాలు నేల‌మ‌ట్టం. భార‌త‌దేశం చూడ‌ని ఘోర విప‌త్తు అది. భూకంపం త‌ర్వాత స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రంగా సాగాయి. దేశ విదేశాలకు చెందిన సోష‌ల్ వ‌ర్క‌ర్స్ త‌ర‌లివ‌చ్చి.. పున‌రావాస కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. కొన్ని రోజులు ఉండి ఆ త‌ర్వాత వెళ్లిపోయారు. కొంద‌రు మాత్ర‌మే పూర్తి పున‌రావాసం కల్పించే వ‌ర‌కూ అక్క‌డే ఉన్నారు. అందులో ఒక‌రు చిన‌జీయ‌ర్ స్వామీ. భూకంపంతో దెబ్బ‌తిన్న ఓ గ్రామంలో చిన‌జీయ‌ర్ స్వామి బృందం స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఆయ‌న త్రిదండి స్వామి అయినా.. ఎలాంటి హంగూ, ఆర్బాటాలు లేకుండా.. ప్ర‌భుత్వ జోక్యం కోర‌కుండా.. త‌న బృందంతో క‌లిసి రోజులు, వారాల‌ త‌ర‌బ‌డి స‌హాయ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఆ గ్రామం పూర్తిగా కోలుకున్నాకే.. అక్క‌డి నుంచి తిరిగెళ్లిపోయారు. ఆ స‌మ‌యంలో.. చిన‌జీయ‌ర్ స్వామీ చేస్తున్న సేవ‌.. అప్పుడు గుజ‌రాత్ మంత్రిగా ఉన్న అమిత్‌షా దృష్టికి వ‌చ్చింది. ఆ విష‌య‌మే.. ఇప్పుడు రామానుజాచార్యుల విగ్ర‌హ సంద‌ర్శ‌న సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు అమిత్‌షా. 

భూకంపం వచ్చినప్పుడు చినజీయర్‌ స్వామితో పరిచయం కలిగిందని అమిత్‌ షా చెప్పారు.
"ఎలాంటి అర్భాటం లేకుండా, ప్రభుత్వ మర్యాదలు పొందకుండా ఒక గ్రామంలో కూర్చుని భూకంప బాధితుల కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాకే ఆయన తిరిగి వెళ్లారు. ఇప్పుడు కూడా సమతామూర్తి విగ్రహ ఏర్పాటును విజయవంతంగా పూర్తిచేశారు. ఆయన చేపట్టిన కార్యం ఏదైనా విజయవంతగా ముగిస్తారు" అంటూ ప్రశంసించారు. చినజీయర్‌ స్వామికి పాదాభివందనం చేశారు. 

ఈ సంద‌ర్భంగా అమిత్‌షా త‌న గురించి సైతం కొన్ని ప‌ర్స‌న‌ల్‌ విష‌యాలూ రివీల్ చేశారు. తాను జన్మతః వైష్ణవుడినని.. తన తల్లి వల్లభాచార్య సిద్ధాంతాలపైనే జీవితాన్ని గడిపారని అమిత్‌ షా చెప్పారు. తాను పుట్టి పెరిగిన గ్రామం అహ్మదాబాద్‌కు 50 కి.మీ. దూరంలో ఉందని, అక్కడ 150 ఏళ్లనాటి గ్రంథాలయంలో రామానుజాచార్యులు రచించిన తొమ్మిది గ్రంథాలు చదివానన్నారు అమిత్‌షా. 

ఇలా గుజ‌రాత్‌తో ముడిప‌డిన చిన‌జీయ‌ర్‌, అమిత్‌షాలకు సంబంధించిన ప‌లు విష‌యాలు ముచ్చింత‌ల్ వేదిక‌గా వెల్ల‌డికావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.