TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బ్యాలెట్ వర్సెస్ ఈవీఎం: భారత ఎన్నికల ప్రస్ధానం.!

Published on: Fri Oct 9, 2026 6:02PM

భారతదేశంలో ఓటింగ్ వ్యవస్థపై గత కొంతకాలంగా జరుగుతున్న చర్చలు, రాజకీయ విమర్శలు,  సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వాదనలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దేశంలో 1990ల మధ్యకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ముప్పై శాతం కంటే తక్కువ ఓటు వాటాను మాత్రమే సాధించడానికి భారతదేశ ఓటింగ్ పద్ధతే ప్రధాన కారణమని, మొదట బ్యాలెట్ పేపర్ స్థానంలో ఈవీఎమ్ లను తీసుకురావడం వల్లే ఈ మార్పు జరిగిందని ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే..  ఈ సోషల్ మీడియా పోస్టులు అధికారిక ఎన్నికల సంఘం గణాంకాలను  ధృవీకరించలేని ఉద్దేశపూర్వక వ్యాఖ్యలతో కలగలిపి ప్రచారం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అసలు ఈ వాదనల వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రవేశానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఎన్నికల రికార్డులు, సుప్రీంకోర్టు తీర్పులు ఈ అంశంపై ఎలాంటి స్పష్టతను ఇస్తున్నాయో  పరిశీలిద్దాం.   

బ్యాలెట్ పేపర్ల వినియోగం నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల   వైపు మారడం అనేది ఒక్కసారిగా జరిగిన పరిణామం కాదు.  చారిత్రక రికార్డుల ప్రకారం 1950ల చివరి నుండి, ముఖ్యంగా 1960లలో దేశంలోని పలు రాష్ట్రాల్లో  బూత్ క్యాప్చరింగ్  అంటే  సాయుధ ముఠాలు పోలింగ్ కేంద్రాలను బలవంతంగా తమ అధీనంలోకి తీసుకుని బ్యాలెట్ బాక్సులను దొంగ ఓట్లతో నింపేయడం వంటి అసాధారణ ఘటనలు ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ అక్రమాలను అరికట్టేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఉండాలనే ఆలోచనను తొలిసారిగా 1977లో అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.ఎల్. శక్ధర్ ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా 1979లో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఒక నమూనాను తయారు చేసి, 1980లో రాజకీయ పార్టీల సమక్షంలో ప్రదర్శించింది.  

మొట్టమొదటిసారిగా 1982 మే 19న కేరళలోని పరావూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 50 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎమ్ లను ప్రయోగాత్మకంగా వినియోగించారు. అయితే ఈ ప్రయోగం న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంది. ఏ.సి. జోస్ వర్సెస్  శివన్ పిళ్లై కేసులో విచారణ జరిపిన సుప్రీంకోర్టు, చట్టపరమైన అనుమతి లేకుండా ఎన్నికల సంఘం నూతన ఓటింగ్ పద్ధతిని అమలు చేయడానికి వీలుపడదని తీర్పునిస్తూ, ఆ నియోజకవర్గంలో మళ్లీ బ్యాలెట్ పేపర్ ద్వారానే పోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్, 1951 చట్టానికి సవరణలు చేసి సెక్షన్ 61Aను చేర్చింది. రాజీవ్ గాంధీ   హయాంలో 1989 మార్చి 15 నుంచి ఇది అమలులోకి రావడంతో  ఈవీఎమ్ లకు  చట్టబద్ధత లభించింది.

ఆ సమయంలో రాజీవ్ గాంధీ ఈ యంత్రాల వినియోగాన్ని సమర్థించినప్పటికీ.. విపక్ష నేతల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ప్రణాళికను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఆ తర్వాత 1998లో దశలవారీగా మళ్లీ వీటిని ప్రవేశపెట్టి, 2004 నాటికి దేశంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో పూర్తిగా అమలు చేశారు.   సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న మరో ప్రధాన వాదన ఏమిటంటే.. బ్యాలెట్ పేపర్లే సమస్య అని రాజీవ్ గాంధీ స్వయంగా అన్నారని  చెబుతుంటారు. అయితే, దీనికి సంబంధించి ఎన్నికల సంఘం రికార్డులలో గానీ, కోర్టు పత్రాలలో గానీ, సమకాలీన వార్తా పత్రికలలో గానీ ఎలాంటి అధికారిక ఆధారాలు లభించలేదు.

 వాస్తవానికి ఆయన ప్రభుత్వ హయాంలోనే ఈవీఎమ్ ల వినియోగానికి చట్టపరమైన ఆమోదం లభించిందనేది చారిత్రక సత్యం. ఇక ఓటరు గుర్తింపు కార్డు అయిన ఈపీఐసీ విషయానికి వస్తే, దీనిని మొదటిసారిగా 1957లోనే ప్రతిపాదించినప్పటికీ కలకత్తాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ విఫలమైంది. చివరకు 1993లో ప్రధాన ఎన్నికల కమిషనర్ టి.ఎన్. శేషన్ హయాంలో ఆగస్టు 28న ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా దేశవ్యాప్తంగా ఇది అందుబాటులోకి వచ్చింది. ఒకరి బదులు మరొకరు నకిలీ ఓట్లు వేయడాన్ని నిరోధించడమే దీని ప్రధాన ఉద్దేశం.   కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్‌సభ ఓటు.. వాటా గణాంకాలను పరిశీలిస్తే, పార్టీ ఎన్నికల చరిత్రలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి.

1951-52లో 44.99 శాతం, 1957లో 47.78 శాతం, 1962లో 44.72 శాతం, 1967లో 40.78 శాతం, 1971లో 43.68 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్, ఆ తర్వాత 1977లో 34.52 శాతానికి పడిపోయింది. తిరిగి 1980లో 42.69 శాతానికి, 1984లో అత్యధికంగా 49.01 శాతానికి చేరుకుంది. అయితే 1989లో 39.53 శాతానికి, 1991లో 35.66 శాతానికి పడిపోయిన ఓటు బ్యాంకు, 1996 నాటికి 28.80 శాతానికి, 1998లో 25.82 శాతానికి క్షీణించింది. ఆ తర్వాత 1999లో 28.30 శాతం, 2004లో 26.53 శాతం, 2009లో 28.55 శాతం ఓట్లను సాధించగా, 2014లో 19.52 శాతానికి, 2019లో 19.75 శాతానికి మరియు 2024లో 21.19 శాతానికి పరిమితమైంది.   

ఈ గణాంకాలను బట్టి చూస్తే, 1991 వరకు ఏడు సార్లు 40 శాతానికి పైగా ఓట్లను సాధించిన కాంగ్రెస్ పార్టీ, 1996 నుంచి ఏ లోక్‌సభ ఎన్నికల్లోనూ 30 శాతం ఓట్లను దాటలేదన్నది వాస్తవమే. కానీ ఈ పతనం అనేది ఓటర్ ఐడీ కార్డు లేదా ఈవీఎమ్ లు పూర్తి స్థాయిలో అమల్లోకి రాకముందే..  అనగా 1989,  1991 మధ్యకాలంలోనే ప్రారంభమైందన్న విషయాన్ని గమనించాలి. అంతేకాకుండా, పూర్తిగా ఈవీఎమ్ ల ఆధారంగా నిర్వహించిన 2004 మరియు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందనేది చారిత్రక సత్యం. ఓటింగ్ విధానంలో మార్పు వచ్చినంత మాత్రాన ఒక పార్టీ ఓటు వాటా పడిపోవడానికి అదే కారణమని చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. 

1996 నుంచి చోటుచేసుకున్న ఈ పతనానికి మండల్ కమిషన్ సిఫార్సులు, రామమందిర ఉద్యమం, ప్రాంతీయ,  కుల ఆధారిత పార్టీల ప్రాబల్యం పెరుగుదల, సంకీర్ణ రాజకీయ యుగం ఆరంభం కావడం, అలాగే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలహీనతలు వంటి అనేక సామాజిక, రాజకీయ పరిణామాలు కారణమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.   ఈవీఎమ్ ల విశ్వసనీయతపై దేశంలోని వివిధ న్యాయస్థానాలు,  సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపి ఈ వ్యవస్థను సమర్థించాయి. 

2001-02 సంవత్సరాల్లోనే సుప్రీంకోర్టు సెక్షన్ 61Aను సమర్థించింది. సుబ్రమణ్య  స్వామి కేసులో 2013లో వెలువడిన తీర్పు ఆధారంగానే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపాట్) విధానం అమలోకి వచ్చింది. ఇక 2024 ఏప్రిల్ 26న సుప్రీంకోర్టు 100 శాతం వీవీసాటక స్లిప్పుల క్రాస్ వెరిఫికేషన్,  బ్యాలెట్ పేపర్లకు తిరిగి వెళ్లాలనే విజ్ఞప్తులను తోసిపుచ్చింది. ఈవీఎమ్ లను తారుమారు చేశారనే ఆరోపణలు ఆధారరహితమని పేర్కొంటూ, ఇప్పటివరకు కోట్లాది వీవీపాట్ స్లిప్పులను లెక్కించినప్పటికీ ఎక్కడా ఎలాంటి తేడాలు రాలేదని కోర్టు స్పష్టం చేసింది. 

అదే సమయంలో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రాండమ్ వీవీపాట్ వెరిఫికేషన్‌ను ఒకటి నుంచి ఐదు ఈవీఎమ్ లకు పెంచుతూ..  ఓడిపోయిన అభ్యర్థులు కోరితే మైక్రో కంట్రోలర్‌ను తనిఖీ చేసుకునే వెసులుబాటు కల్పించింది. 2024 నవంబర్ 26న బ్యాలెట్ పేపర్లపై మరోసారి దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎమ్ లు సక్రమంగా పనిచేస్తాయి, ఓడిపోయినప్పుడే అవి తారుమారయ్యాయని ఆరోపిస్తారు అని కోర్టు వ్యాఖ్యానించింది.   ఈవీఎమ్ ల పట్ల అనుమానాలు వ్యక్తం చేయడం అనేది కేవలం ఒకే పార్టీకి పరిమితం కాలేదు. గతంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ విజయం సాధించిన తర్వాత, బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ సైతం పేపర్ బ్యాలెట్లకు తిరిగి వెళ్లాలని డిమాండ్ చేశారు. 

ఆ తర్వాత 2017,  2018 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత మాయావతి, అఖిలేష్ యాదవ్, ఆప్ నేతలు కూడా యంత్రాలపై ఆరోపణలు గుప్పించారు. 2013లో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ డమ్మీ ఈవీఎమ్ తో ప్రదర్శనలు చేశారు. ఇక 2024 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఈవీఎమ్ లను బ్లాక్ బాక్స్‌గా అభివర్ణించగా, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా బ్యాలెట్ పేపర్లు కావాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి లాంటి నేతలు సైతంఈవీఎమ్ ల పనితీరును ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయి. 

ఈ రకమైన ధోరణి ఓటమి తర్వాత ప్రతీ రాజకీయ పార్టీలోనూ కనిపిస్తున్నదని న్యాయస్థానాలు సైతం గుర్తించాయి.   అయితే విమర్శకులు లేవనెత్తుతున్న వాదనలను పూర్తిగా కొట్టివేయలేమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యంత్రాల రూపకల్పన మరియు తయారీ విధానం బయటి వ్యక్తులకు అపారదర్శకంగా ఉండటం, ఎన్నికల సంఘం  బహిరంగ పరిశీలనకు అవకాశం ఇవ్వకపోవడం వంటి అంశాలపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీవీపాట్  స్లిప్పుల లెక్కింపును మరింత పెంచితే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని మాజీ అధికారులు సూచిస్తున్నారు. 

కేంద్ర ఎన్నికల సంఘం మాజీ  ప్రధాన కమిషనర్ ఎస్.వై. ఖురేషీ మాట్లాడుతూ.. ఈవీఎమ్ లను   ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని తాము బలంగా నమ్ముతున్నప్పటికీ, ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించడానికి  వీవీపాట్  స్లిప్పులను పెద్దఎత్తున లెక్కించడం మంచిదన్నారు.  అయితే ఎన్నికల్లో నిజమైన అక్రమాలు యంత్రాల ద్వారా కాకుండా, ఓటరు జాబితాల రూపకల్పనలో,  ధన బలం వినియోగంలో ఎన్నికలకు ముందే జరుగుతుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.   ఈ మొత్తం చర్చ,  పరిణామాల కారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థపై, ముఖ్యంగా ఎన్నికలు నిర్వహించే సంస్థలపై ప్రజల్లో నమ్మకం నెమ్మదిగా సన్నగిల్లే ప్రమాదం ఉంది. 

ఇది అన్ని రాజకీయ పార్టీలు ఎదుర్కొంటున్న ఉమ్మడి నష్టం. ఇప్పటివరకు లభిస్తున్న ఆధారాల ప్రకారంఈవీఎమ్ లు తారుమారు అవుతున్నాయనే వాదనకు ఎటువంటి రుజువులు లేవు. అదే విధంగా, ఒక రాజకీయ పార్టీ ఓటు బ్యాంకు క్షీణించడాన్ని కేవలం ఓటింగ్ యంత్రాల మీద నెట్టడం కూడా శాస్త్రీయంగా సరైనది కాదు, ఎందుకంటే ఆ పతనం యంత్రాలు వచ్చే ముందే ప్రారంభమైంది. అంతేకాకుండా అదే యంత్రాలు సదరు పార్టీకి గతంలో విజయాలనూ అందించాయి.   అంతిమంగా, సోషల్ మీడియాలో వస్తున్న సందేహాలు,  ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలు సహేతుకమైనవే అయినప్పటికీ, వాస్తవ రికార్డులు మాత్రం భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయి. ఎన్నికల సంఘం గణాంకాలు అందరికీ అందుబాటులో ఉండటం, కోర్టులు పదేపదే ఈ అంశంపై స్పష్టమైన తీర్పులు వెలువరించడం గమనార్హం. ఒక పార్టీ ఓటు వాటాలో ఏర్పడిన తగ్గుదల అనేది బ్యాలెట్ బాక్సుల కాలానికి చాలా ముందే, రాజకీయ,  సామాజిక మార్పుల కారణంగా ఏర్పడిన పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    

-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   


[EVMS vs  Ballot Papers,  History  Congress Vote Share, Election Commission Data, Supreme Court Rulings  EVMS, EPI, Electoral Reforms, Telugu One]