TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అందరూ ఇష్టంగా తినే ప్యాకింగ్ ఆహారాల గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసా.!

Published on: Sun Oct 11, 2026 3:50PM

నేటి ఆధునిక జీవనశైలిలో మనిషి అలవాట్ల నుండి ఆహారం వరకు అన్నీ మారిపోయాయి.  ఉదయాన్నే ఆఫీసులకు పరిగెత్తే హడావుడిలోనో లేదా సాయంత్రం వేళల్లో కాస్త  ఆకలి వేసినా సరే.. ఇంట్లో వండుకోవడం లేదా బయట వండినవి తినడానికి బదులుగా..   ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపైన డిపెండ్ అవుతున్నారు. సూపర్ మార్కెట్ షెల్ఫుల్లో ఆకర్షణీయమైన రంగురంగుల ప్యాకెట్లలో మెరిసిపోయే చిప్స్, ఇన్స్టెంట్ నూడుల్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, రెడీ టూ ఈట్ వంటకాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరి జీవితాల్లోనూ భాగమైపోయాయి. వీటిని ప్యాకెట్ విప్పడం, వెంటనే తినేయడం చాలా సులభం. రుచి కూడా నాలుకను బాగా ఆకట్టుకుంటుంది. అయితే, ఈ సౌకర్యం వెనుక మన ఆరోగ్యాన్ని క్షీణింపజేసే పెను ప్రమాదం దాగి ఉందన్న విషయం  చాలామంది గమనించడం లేదు. ఆరోగ్య నిపుణులు, వైద్య ప్రపంచం ఇప్పుడు ఈ ఆహారాల పట్ల చాలా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ ప్యాకింగ్ ఆహారాలు  శరీరంలోకి వెళ్లిన తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు చూపుతాయో వివరంగా తెలుసుకుంటే..

ప్యాక్ ఫుడ్ లేదా ప్రాసేస్ ఫుడ్..

ప్యాక్ చేసిన లేదా ఫ్యాక్టరీలలో ప్రాసెస్ చేసిన ఆహారాలను  ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని పిలుస్తారు. వీటిని తయారుచేసే విధానంలో రుచి, రంగు, వాసన ఎక్కువ కాలం నిలిచి ఉండటానికి అనేక రకాల రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు , అడిటివ్‌లను కలుపుతారు. ఈ తరహా ఆహారాలలో కేలరీలు, ఉప్పు, చక్కెర, హానికరమైన క్రొవ్వు పదార్థాలు చాలా అధిక పరిమాణంలో ఉంటాయి. విచారకరమైన విషయమేమిటంటే, శరీరానికి అత్యంత అవసరమైన పీచు పదార్థం , విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు వీటిలో దాదాపు శూన్యం. తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలు శరీరంలోకి చేరడం వల్ల జీర్ణవ్యవస్థపై విపరీతమైన భారం పడుతుంది. పోషకాలు లేని ఈ ఖాళీ కేలరీలు అనారోగ్యానికి మూలకారకాలుగా మారుతాయి.

ప్యాకేజ్ లేదా ప్రాసెస్ ఫుడ్స్ తినడం వల్ల జరిగేది ఏంటి ?

ఈ ప్రాసెస్డ్ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎదురయ్యే ప్రధాన సమస్య విపరీతమైన బరువు పెరగడం. చిన్న వయస్సులోనే పిల్లలు, యవ్వనంలో ఉన్నవారు ఊబకాయం బారిన పడటానికి ఈ అలవాటే ప్రధాన కారణమని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి శరీరంలోకి చేరిన తర్వాత తొందరగా  కొవ్వుగా మారి పేరుకుపోతాయి. అలాగే, వీటిలో ఉండే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెంచేస్తాయి. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి, కాలక్రమేణా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఇక్కడితోనే ఆగకుండా, ప్యాకెట్ ఆహారాలలో అధికంగా ఉండే సోడియం అంటే ఉప్పు , సంతృప్త కొవ్వుల వల్ల రక్తపోటు హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలకు, కొలెస్ట్రాల్ పెరగడానికి దారితీస్తుంది.

జీర్ణవ్యవస్థ..

జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, పేగుల్లో మంచి బాక్టీరియా వృద్ధి చెందడానికి పీచు పదార్థం చాలా ముఖ్యం. కానీ ప్యాక్ చేసిన ఆహారాలలో ఈ ఫైబర్ కంటెంట్ బొత్తిగా ఉండదు. ఫలితంగా దీర్ఘకాలిక మలబద్ధకం, పేగుల వ్యాధులు , జీర్ణక్రియ లోపాలు ఎదురవుతాయి. తీవ్రమైన సందర్భాల్లో ఇటువంటి ఆహార అలవాట్లు వివిధ రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా పెంచుతాయని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ప్యాకెట్లపై కనిపించే ఆకర్షణీయమైన అడ్వర్టైజ్మెంట్లు ప్రజలను   బలహీనులను చేస్తాయి. అందుకే వాటి వైపు చాలా ఆకర్షితులు అవుతారు.

ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?

మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవడానికి కొంత ముందస్తు జాగ్రత్త వహించడం తప్పనిసరి. ఏదైనా ప్యాక్ చేసిన ఆహారాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఆ ప్యాకెట్ వెనుక ఉన్న న్యూట్రిషన్ లేబుల్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. అందులో ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వుల పరిమాణం ఎంత ఉందో తెలుసుకోవాలి. ఎప్పుడూ  బయట దొరికే ప్రాసెస్డ్ స్నాక్స్ స్థానంలో తాజా పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్  వంటి సహజమైన ఆహారాన్ని మన దినచర్యలో భాగం చేసుకోవాలి. మన శరీరం మనం తినే ఆహారంతోనే నిర్మితమవుతుంది కాబట్టి, నోటికి ఇచ్చే తాత్కాలిక రుచి కంటే శరీరానికి ఇచ్చే శాశ్వత ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వడం శ్రేయస్కరం.
                                                                                                                                                                                                                                                                                                           *రూపశ్రీ.