TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

 ఎమోషనల్ చీటింగ్.. తామే తప్పు చేసి, భాగస్వామిని మోసం చేసే వ్యక్తుల తెలివైన  మార్గమిది..!

Published on: Thu Oct 22, 2026 5:25PM

 ఎమోషనల్ చీటింగ్.. తామే తప్పు చేసి, భాగస్వామిని మోసం చేసే వ్యక్తుల తెలివైన  మార్గమిది..!

ఒక ఆరోగ్యకరమైన సంబంధానికి పునాది పరస్పర నమ్మకం, గౌరవం , నిజాయితీ. రెండు మనస్సులు కలిసి ప్రయాణించేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు, అభిప్రాయ భేదాలు రావడం చాలా సహజం. అయితే, కొన్ని సంబంధాలలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. తప్పు ఒకరు చేస్తే, ఆ నిందను మరొకరిపైకి నెట్టేసి, ఎదుటివారిని తప్పుగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతుంటాయి. దీనినే మానసిక నిపుణులు ఎమోషనల్ మానిప్యులేషన్ లేదా ఎమోషనల్ చీటింగ్  అని పిలుస్తారు. భాగస్వామి తన స్వార్థం కోసం లేదా తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారి ఎమోషన్స్ తో  ఆడుకుంటున్నప్పుడు, అది మీ మనశాంతిని, ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇలాంటి ప్రవర్తనను ప్రేమ అనుకుని పొరబడటం వల్ల చాలామంది మానసికంగా నలిగిపోతున్నారు. భాగస్వామి చేసే తప్పులకు మిమ్మల్ని బాధ్యులను చేస్తూ, మిమ్మల్ని మానసిక గందరగోళంలోకి నెట్టే మోసగాళ్ల మార్గాలు , వారు ఉపయోగించే ప్రమాదకరమైన పద్దతులు ఉన్నాయి. వాటి  గురించి వివరంగా తెలుసుకుంటే..

విషయాన్ని పక్కదారి పట్టించడం..

ఎప్పుడైనా భాగస్వామి చేసిన పొరపాటును మీరు ఎత్తిచూపినప్పుడు, వారు ఆ పొరపాటు  గురించి సమాధానం చెప్పడానికి నిరాకరిస్తారు. నిజమైన విషయాన్ని పక్కన పెట్టి, సంభాషణను పూర్తిగా వేరే వైపు తిప్పుతారు. చివరకు అసలు సమస్య ఏంటో మర్చిపోయి, వారు బాధితుల్లా నటించడం మొదలుపెడతారు. మీరు లేవనెత్తిన తప్పును వదిలేసి, మీరు మాట్లాడే తీరును లేదా ఇతర చిన్న విషయాలను పెద్దది చేసి, మీరే వారిని వేధిస్తున్నట్లు క్రియేట్ చేస్తారు.

నిందను ఎదుటివారిపైకి నెట్టడం , గిల్ట్ ఫీలింగ్ కలిగించడం..

ఎమోషనల్ మానిప్యులేటర్లు తమ తప్పును ఎప్పటికీ ఒప్పుకోరు. క్షమాపణలు చెప్పడానికి బదులుగా, మీకే మానసిక అసౌకర్యం లేదా తప్పు చేశాం అనే ఫీలింగ్  కలిగేలా ప్రవర్తిస్తారు. ఉదాహరణకు, మీ వల్ల వారు ఎంత బాధపడుతున్నారో, వారి మానసిక ప్రశాంతత ఎలా పాడైందో చెబుతూ మిమ్మల్ని గిల్ట్ త్రిప్‌లోకి నెడతారు. వారు చేసే తప్పులన్నింటికీ మీ ప్రవర్తనే కారణమని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. దీంతో మీరు అసలు తప్పును వదిలేసి, వారిని సముదాయించే పనిలో పడిపోతారు.

మీ ఆలోచనలనే అనుమానించేలా చేయడం..

దీనినే గ్యాస్‌లైటింగ్ అని అంటారు. వీరు తమ తప్పుల నుంచి తప్పించుకోవడానికి మీ జ్ఞాపకశక్తిని లేదా మీ అర్థం చేసుకునే సామర్థ్యాన్నే ప్రశ్నిస్తారు. అలాంటిదేమీ జరగలేదని, మీరు ఊహించుకుంటున్నారని, లేదా మీకు సరిగ్గా గుర్తులేదని పదే పదే చెబుతారు. దీంతో మీపై మీకే అనుమానం మొదలవుతుంది. నేను ఆలోచిస్తున్నది నిజమేనా లేదా నేను పొరబడుతున్నానా అనే గందరగోళంలోకి మీరు వెళ్ళిపోతారు. ఇది ఎదుటి వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా తన అదుపులోకి తీసుకోవడానికి వాడే అత్యంత ప్రమాదకరమైన మార్గం.

పాత విషయాలను మధ్యలోకి తీసుకురావడం..

ప్రస్తుతం జరుగుతున్న వివాదంలో తమ తప్పు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, వీరు వెంటనే గతాన్ని తవ్వుతారు. మీరు ఎప్పుడో గతంలో చేసిన చిన్న తప్పులను లేదా పొరపాట్లను గుర్తుచేస్తూ, నువ్వు కూడా ఆ రోజు ఇలాగే చేశావు కదా అని ఎదురుదాడి చేస్తారు. పాత విషయాలను మధ్యలోకి తీసుకురావడం వల్ల మీరు డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్తారు. దీనివల్ల ప్రస్తుత తప్పు గురించి మాట్లాడటం ఆగిపోయి, పాత విషయాలపై చర్చ మొదలవుతుంది.

 నకిలీ క్షమాపణలు..

ఒకవేళ వారు క్షమాపణలు చెప్పాల్సి వచ్చినా, అది ఎంతో నాటకీయంగా ఉంటుంది. మనస్ఫూర్తిగా తమ తప్పును అంగీకరించి  క్షమాపణ చెప్పరు.  గొడవను తొందరగా ముగించడానికో లేక మిమ్మల్ని నోరు మూయించడానికో నకిలీ క్షమాపణలు చెబుతారు. సారీ చెప్పేటప్పుడు కూడా, నీకు అంతగా అనిపిస్తే సారీ లేదా నేను చేసిన ప్రతిదీ తప్పేలే అనే వ్యాఖ్యలు జోడిస్తారు. ఇందులో నిజమైన పశ్చాత్తాపం ఉండదు. పైగా దెప్పిపొడుపు ఉంటుంది.

మానసిక ఆరోగ్యానికే ప్రమాదం..

ఇలాంటి పరిస్థితులు సంబంధంలో ఎప్పుడూ  కొనసాగుతూ ఉంటే , అది మీ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. క్రమంగా మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ప్రతి చిన్న విషయానికి మీరే బాధ్యులమనే భయం  స్థిరపడిపోతుంది. భాగస్వామి ప్రవర్తనలో ఈ ప్రమాదకరమైన సంకేతాలు కనిపిస్తే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. సరిహద్దులను నిర్ణయించుకోవడం, స్పష్టంగా మాట్లాడటం , అవసరమైతే సంబంధం గురించి బాగా ఆలోచించుకోవడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

                                          *రూపశ్రీ.