స్టార్ లింగ్ ఇండియా ఎంట్రీ: మస్క్ ప్రధాని అంబానీ సెటైర్లు.. ఒత్తిడి వ్యూహం ఫలిస్తుందా.?
Published on: Sun Oct 11, 2026 8:27AM

ఇంటర్నెట్ రంగంలో పోటీనా? వ్యాపార ప్రయోజనాల కోసం ఒత్తిడా? లేక ప్రభుత్వ అనుమతుల విషయంలో నిబంధనల ప్రక్రియా? భారత శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్ విస్తరణ విషయంలో ఇప్పుడు సర్వత్రా తలెత్తుతున్న ప్రశ్నలివే. ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదం మరింత ముదిరేలా చేశాయి. స్టార్‌లింక్‌కు భారత్‌లో వాణిజ్య సేవలు ప్రారంభించేందుకు ఇంకా తుది అనుమతులు రాకపోవడంపై సహజంగానే తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్న ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా.. ప్రియమైన ప్రధాని అంబానీ అంటూ షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది. భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు. భారత ప్రజలపై గుత్తాధిపత్య ధోరణితో ప్రయోజనాలు పొందాలని అంబానీ కోరుకుంటున్నారని అందుకే స్టార్ లింక్ ఇండియా ఎంట్రీకి అడ్డంకులు ఎదురౌతున్నాయనీ మస్క్ అన్యాపదేశంగా పేర్కొన్నారు.
.webp)
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేదని, దీనివల్ల పిల్లలకు విద్యావకాశాలు, చిన్న వ్యాపారులకు ప్రపంచ మార్కెట్లను చేరుకునే అవకాశాలు పరిమితమవుతున్నాయని ఇండియా విధానాలపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇండియా ఇంటర్నెట్ సమస్యలన్నిటికీ స్టార్‌లింక్ సేవలు మాత్రమే పరిష్కారం చూపుతాయంటూ.. స్టార్ లింక్ ను సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ గా చెప్పుకున్నారు. అయితే స్టార్ లింగ్ ఇండియా ఎంట్రీకి ముఖేష్ అంబానీ అడ్డుపడుతున్నారనీ, తన పలుకుబడిని ఉపయోగించి.. ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారన్న ధోరణిలో ఆయన విమర్శలు గుప్పించారు.
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ స్టార్‌లింక్ ద్వారా ఉపగ్రహాల ఆధారంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌లు లేదా ఫైబర్ కనెక్షన్లు చేరుకోలేని మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్ సేవలు అందించడం ఈ సాంకేతికత ప్రత్యేకత. భారత్‌లోనూ ఈ సేవలను ప్రారంభించేందుకు మస్క్ గత కొంత కాలంగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ముఖేష్ అంబానీ రిలయెన్స జియో.. ఇప్పటికే దేశీయ టెలికాం మార్కెట్‌లో కీలక సంస్థగా ఉంది. జియో కూడా ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవల రంగంలోకి రావడానికి రెడీ అవుతోంది. ఎయిర్‌టెల్ మద్దతున్న యూటెల్‌శాట్ వన్‌వెబ్ కూడా ఈ రంగంలో పోటీ పడుతోంది. దీంతో భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్ భవిష్యత్తులో పెద్ద వ్యాపార పోటీకి వేదికగా మారబోతోంది.
అయితే స్టార్‌లింక్‌కు అనుమతుల ఆలస్యం వెనుక అంబానీ ఒత్తిడి ఉందంటూ తాజాగా ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు, సంధించిన వ్యంగ్యాస్త్రాలపై కేంద్రం చాలా సీరియస్ గా స్పందించింది. టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. దేశంలో ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహించే విధానం లేదని పేర్కొన్నారు. స్టార్‌లింక్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, యూటెల్‌శాట్ వన్‌వెబ్ సంస్థల అనుమతుల విషయంలో దాదాపు ఒకే దశలో ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు.
ఈ సంస్థలకు అవసరమైన అనుమతులు, భద్రతా ప్రమాణాల పరిశీలన, స్పెక్ట్రమ్ కేటాయింపు వంటి ప్రక్రియలు పూర్తయ్యాకే వాణిజ్య సేవల ప్రారంభానికి అనుమతులు లభిస్తాయన్నారు. ఇక్కడ స్టార్ లింక్ ఇండియా ఎంట్రీకి ముఖేష్ అంబానీ అడ్డుపడుతున్నారనడం శుద్ధ అబద్ధమని జ్యోతిరాదిత్య సింధియా కుండబద్దలు కొట్టారు.
ఇక ఇప్పుడు అనుమతుల విషయంలో దేశ భద్రత, డేటా భద్రత వంటివి అత్యంత ముఖ్యం. ఉపగ్రహ ఇంటర్నెట్ అనేది కేవలం వ్యాపార సేవ మాత్రమే కాదు. దేశ భద్రత, వినియోగదారుల డేటా, చట్టబద్ధమైన నిఘా అవసరాలు, అత్యవసర పరిస్థితుల్లో సేవలను నియంత్రించే సామర్థ్యం వంటి అంశాలతోనూ ముడిపడి ఉంటుంది. అందువల్ల భారత్‌లో సేవలు ప్రారంభించే సంస్థలు సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.
స్టార్‌లింక్ ఇప్పటికే కొన్ని కీలక లైసెన్సులు, అనుమతులు పొందినప్పటికీ, వాణిజ్య సేవల ప్రారంభానికి అవసరమైన అన్ని తుది ప్రక్రియలు పూర్తికాలేదు. ఒక్క స్టార్ లింక్ కే కాదు.. రిలయెన్స్ జియోకు కూడా పూర్తి అనుమతులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మస్క్ వ్యాఖ్యలు కేంద్రంపై ఒత్తిడి పెంచి, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసుకోవడంలో భాగంగా పరిశీలకులు చెబుతున్నారు. , అనుమతుల ఆలస్యాన్ని కేవలం వ్యాపార ప్రత్యర్థుల చర్యగా ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.
స్టార్‌లింక్ ఇండియాలో సేవలు ప్రారంభిస్తే మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు, దీవులు, సాధారణ నెట్‌వర్క్ సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రత్యామ్నాయ ఇంటర్నెట్ అందే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఆన్‌లైన్ విద్యను పొందడం, చిన్న వ్యాపారులు డిజిటల్ మార్కెట్లను చేరుకోవడం, అత్యవసర పరిస్థితుల్లో కమ్యూనికేషన్ కొనసాగించడం వంటి ప్రయోజనాలు ఉండవచ్చు. అంత మాత్రాన భద్రతా ప్రమాణాల విషయంలో ఇండియన్ గవర్నమెంట్ రాజీ పడుతుందని భావించడం సరికాదు. మస్క్ చేసిన ప్రధాని అంబానీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించి.. ప్రమాణాల విషయంలో కేంద్రపై ఒత్తిడి తీసుకురావాలన్న మస్క్ ప్రయత్నాలు ఫలిస్తాయని భావంచజాలం. మస్క్ వ్యాఖ్యలు, ఆరోపణలు, వ్యంగ్యాస్త్రాల వెనుక ఉన్నది ఒత్తిడి వ్యూహమేనని పరిశీలకులు అంటున్నారు.
[Elon Musk PM Mukesh Ambani Comments, Starlink India, Starlink India launch, Elon Musk Ambani, Jio Satellite internet, Indian Telecom, satellite internet approvals, Telugu One]


