TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సర్ సాఫ్ట్ వేర్ వివరాల వెల్లడికి ఈసీ నో: ఆర్టీఐ పరిధిలోకి రావంటూ నిరాకరణ.!

Published on: Mon Oct 26, 2026 4:16PM

కేంద్ర ఎన్నికల సంఘం  చేపడుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఈర్) ప్రక్రియ విశ్వసనీయత మరో సారి  ప్రశ్నార్థకంగా మారి తీవ్ర చర్చనీయాంశమైంది. అదెలా అంటే.. ఎస్ఐఆర్ లో భాగంగా ఓటర్ల జాబితాలోని తప్పులు,  లోపాలను గుర్తించడానికి అధికారులు వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్  వెర్షన్,  ఉపయోగించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన  వివరాలను వెల్లడించడానికి ఈసీ నిరాకరించింది. ఈ నిరాకరణ  రాజకీయ,  సామాజిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

ఎస్ఐఆర్ కు సంబంధించి  పూర్తి వివరాలు కోరుతూ  తెలంగాణలోని కరీంనగర్కు  ఎం.ఏ. ముజీబ్ ఆయుబ్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఎన్నికల సంఘానికి  దరఖాస్తును సమర్పించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాల్లోని తప్పులను ఏఐ ప్లాట్‌ఫామ్‌లు, సాఫ్ట్‌వేర్ ఏ విధంగా గుర్తిస్తాయి, ఆటోమేటిక్‌గా దిద్దుబాట్లు లేదా తొలగింపులు సూచించే విధానం ఏమిటో తెలియజేయాలని ఆయన ఆ దరఖాస్తులో కోరారు. 

అదే విధంగా ఈ మొత్తం డిజిటల్ ప్రక్రియలో ఏఐ మెషిన్ లెర్నింగ్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్,  ఆటోమేటిక్ డిసిషన్ సపోర్ట్ టూల్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ఏ మేరకు వినియోగిస్తున్నారన్న సమాచారాన్ని కూడా కోరారు. ముఖ్యంగా, నిజమైన ఓటర్ల పేర్లు పొరపాటున కూడా తొలగించకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం తీసుకున్న  చర్యలేమిటని ప్రశ్నించారు.  

అయితే  ముజీబ్ ఆయుబ్ అడిగిన  ఈ ప్రశ్నలకు బదులివ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించింది. ఆయన కోరిన వివరాలు ఆర్టీఐ చట్టం  పరిధిలోకి రావని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అలాగే.. ఆర్టీఐ చట్టం నిర్దేశించిన మినహాయింపుల కిందకు ఆయన అడిగిన వివరాలు వస్తాయని వివరణ ఇచ్చింది.  సాఫ్ట్‌వేర్ యొక్క టెక్నికల్ వివరాలు, వెర్షన్లు,  అంతర్గత విధివిధానాలను బహిర్గతం చేయడం కుదరదని స్పష్టం చేసింది. ఈసీ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఓటర్ల జాబితా రూపకల్పనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పట్ల పారదర్శకత ఉండాలని, నిజమైన ఓటర్ల హక్కులను కాపాడటానికి ఈ వివరాలు బహిర్గతం చేయాలని నిపుణులు సైతం అంటున్నారు.  సాఫ్ట్‌వేర్ వివరాలను గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

[Election Commission SIR Software, RTI Application,  Election commission, Voter List Software Details, MA Mujeeb Ayub RTI, Telugu One]