ఎన్నికల సంఘంలో ముసలం
Published on: Thu Sep 24, 2026 10:57AM
.webp)
కేంద్ర ఎన్నికల సంఘంలో(ఈసీఐ)లో ముసలం పుట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ణానేశ్వర్ నిర్ణయాలను మిగిలిన ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకిస్తున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) కొన్ని తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై తోటి ఎన్నికల కమిషనర్లు ఇద్దరూ అభ్యంతరాలు వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరుపై గత కొంత కాలంగా వెల్లువెత్తుతున్న ఆరోపణలకు ఈ పరిస్థితి బలం చేకూరుస్తోంది.
గత కొద్ది నెలల వ్యవధిలో ఎన్నికల సంఘం తీసుకున్న పలు నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పద్నాలుగు సార్లు తమ అసమ్మతిని అధికారికంగా నమోదు చేశారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ, కొత్త ఓటరు నమోదు కోసం ఉపయోగించే ఫారమ్ 6 మార్పులు వంటి కీలక అంశాలపై సీఈసీతో మిగిలిన ఇద్దరు కమిషనర్లు విభేదించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, తమతో సంప్రదించకుండానే సీఈసీ జ్ణానేశ్వర్ కీలక విధానపరమైన నిర్ణయాలను ఏకపక్షంగా అమలు చేశారని కమిషనర్లు ఆరోపిస్తున్నారు.ఈ అంతర్గత వివాదంలో డిజిటల్ ఓటరు డేటాబేస్ నిర్వహణ, సాఫ్ట్‌వేర్ కేంద్రీకరణ వంటి అంశాలు ఉన్నాయి.
క్షేత్రస్థాయిలో ఉండే రిజిస్ట్రేషన్ అధికారుల అధికారాలను పక్కనపెట్టి, కేంద్ర స్థాయి ఐటీ విభాగాల ద్వారా సాఫ్ట్‌వేర్ నియంత్రణను జ్ణానేశ్వర్ చేతుల్లోకి తీసుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సాంకేతిక మార్పుల వల్ల అర్హులైన ఓటర్లు సైతం జాబితా నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని, ఇది సంప్రదాయ వికేంద్రీకరణ భద్రతను బలహీనపరుస్తుందని జ్ణానేశ్వర్ తో విభేదిస్తున్న కమిషనర్లు ఇద్దరూ చెబుతున్నారు.
.webp)
.బహుళ సభ్యులు ఉన్న ఎన్నికల సంఘంలో సమష్టి నిర్ణయాలు తీసుకోవాలనే నిబంధనలకు విరుద్ధంగా జ్ణానేశ్వర్ కుమార్ వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజ్యాంగబద్ధమైన స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలో ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు చోటుచేసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల సంఘం ఉన్నత స్థాయిలోనే ఇటువంటి విభేదాలు రికార్డుకెక్కడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Election Commission of India, Internal Rift, CEC Gyanesh Kumar controversy, Special Intensive Revision, SIR, Election Commissioners dissent, voter list database centralization, Telugu One


