కేంద్ర ఎన్నికల సంఘంలో అసలు జరిగిందేంటి: సీఈసీ జ్ణానేశ్వర్ కుమార్ ఏం చేశారు.?
Published on: Sat Sep 26, 2026 12:05PM

కొద్ది నెలలుగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియపై విపక్షాలు, పౌర సమాజం నుంచి వస్తున్న ప్రశ్నలు ఒకెత్తయితే, తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. సర్ ప్రక్రియ తీరుతెన్నులపై ఏకంగా ఎన్నికల సంఘంలోనే తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమైన విషయం వెల్లడైంది. ఇది సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి లు.. ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, పునరుద్ధరణ, ఓటరు నమోదు ప్రక్రియలో మార్పులు, ఎన్నికల డేటా కేంద్రీకరణ వంటి కీలక నిర్ణయాలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీసుకున్న చర్యలను గట్టిగా వ్యతిరేకించారు.
పది నెలల వ్యవధిలో వారు కనీసం 14 సార్లు లిఖితపూర్వక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ అభ్యంతరాలు, విభేదాలూ ఏదో ఆషామాషీ వ్యవహారం కాదు. పది నెలల కాలంలో ఏకంగా 14 సార్లు ఒకే రోజు ఏకంగా నాలుగు సార్లు ఇద్దరు కమిషనర్లు రికార్డుల్లో తమ అభ్యంతరాలను నమోదు చేశారు.

తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఓటర్ల చేర్పులు, తొలగింపుల ప్రక్రియ పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారమ్-6 మార్పుల విషయంలోనూ ఇదే వివాదం తలెత్తింది. 2000వ దశకం ప్రారంభంలో జరిగిన ఎస్ఐఆర్ నాటి ఓటరు జాబితాతో దరఖాస్తుదారుడికి లేదా వారి తల్లిదండ్రులు, తాతామామలకు ఉన్న సంబంధాన్ని నిరూపించాలని సవరించిన ఫారమ్‌లో కొత్త నిబంధన చేర్చారు. ఈ మార్పు చట్టవిరుద్ధమని, అనధికారికమని తేల్చేసిన ఇద్దరు కమిషనర్లు.. వెంటనే దీనిని తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే, వారి అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఆ మార్పులు అలాగే కొనసాగడం గమనార్హం.
ఈ పరిణామాలు పెను సంచలనానికి తెరలేపాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేయగా, ఆయనను పదవి నుంచి తొలగించేందుకు విపక్షాలు పార్లమెంటరీ తీర్మానానికి సన్నాహాలు చేస్తున్నాయి. మరోవైపు, ఇలాంటి అంతర్గత అభ్యంతరాలు ఉన్నంత మాత్రాన తుది నిర్ణయాలు ఏకాభిప్రాయం లేకుండా జరిగాయని అనలేమని, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి రిగ్గింగ్ జరగలేదని భారతీయ జనతా పార్టీ సమర్థించే ప్రయత్నం చేస్తోంది. మరో వైపు కాక్రోచ్ జనతా పార్టీ జ్ణానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో వచ్చే నెల 2 నుంచి దేశ వ్యాప్తం ఉద్యమానికి పిలుపునిచ్చింది.
[Election Commission Controversy, ECI Internal Disputes, Special Intensive Revision SIR, Gyanesh Kumar Resignation DemanD, Telugu One]


