డిసెంబర్ లోనే వడగాల్పులు: ఎల్ నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విపత్కర పరిస్థితులు.!
Published on: Mon Oct 12, 2026 12:08PM

తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావం తీవ్రరూపం దాలుస్తోంది. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. సాధారణంగా చలికాలంలో ఉండాల్సిన ఆహ్లాదకరమైన వాతావరణం కనుమరుగై, పగటిపూట ఉష్ణోగ్రతలు 37 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ప్రజారోగ్యంపై కూడా ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితి దుష్ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది. రానున్న రోజులలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సాధారణంగా శీతాకాలంలో చలికి వణకాల్సిన జనం.. వడగాల్పుల కారణంగా వడదెబ్బలకు గురయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ సారి శీతాకాలం ఉండదు సరే.. ఎల్ నినో ప్రభావంతో నవంబర్ చివరి వారం నుంచే వేసవి ప్రవేశించే అవకాశం ఉందనీ, డిసెంబర్ లోనే రోళ్లు పగిలే ఎండలు జనాలను బెంబేలెత్తిస్తాయనీ అంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నెలలోనే వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలూ దాదాపు ఎనిమిది నెలల పాటు వేసవి వేడిని అనుభవించాల్సిన పరిస్థితులు దాపురించనున్నాయన్న మాట.
ఇప్పటికే పగటి వేళల్లో విపరీతమైన వేడి వాతావరణం నెలకొనడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు తమ దైనందిన కార్యక్రమాల కోసం బయటికి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, కార్యాలయాలకు వెళ్లేవారికి ఈ అసాధారణ వాతావరణం అసౌకర్యాన్ని కలిగిస్తోంది. రాత్రి సమయాల్లో కూడా ఎలాంటి చల్లదనం లభించకపోగా, ఉక్కబోత రోజు రోజుకూ పెరుగుతోంది. వర్షాకాలం ముగిసి శరదృతువు ప్రవేశించినప్పటికీ, చలి జాడఇసుమంతైనా కనిపించడం లేదు.
తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మామూలుగా కంటే రాత్రులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎల్ నినో ప్రభావం వల్ల చలికాలం అనేదే లేకుండా పోయింది. ఇక బెజవాడ, అక్టోబర్ నెలలోనే బ్లేజ్ వాడ అన్నట్లుగా మారిపోయింది. ఎల్ నినో పుణ్యమా అని వేసవి ఏకంగా ఎనిమిది నెలల పాటు కొనసాగే పరిస్థితి ఏర్పడింది. డిసెంబర్ నెలలోనే అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా వేడి పెరిగి వృద్ధుల మరణాలకు కూడా దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఆవర్తనంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్లే డిసెంబర్‌లోనే వడగాల్పులు వీచే పరిస్థితి ఏర్పడుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ ఎల్ నినో ప్రభావం కొనసాగే అవకాశం ఉందంటున్న వాతావరణ నిపుణులు.. ఫిబ్రవరి తరువాత వచ్చేది మళ్లీ వేసవే కావడంతో వాతావరణం 2026 టు 2027 ఏడాది మొత్తం వేసవే అన్నట్లుగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఏడాది వర్షపాతం 34 శాతం లోటుగా నమోదు అయిన సంగతి తెలిసిందే. నైరుతి దారుణంగా దెబ్బతినడంతో ఈ ఏడాది వానా కాలం కూడా వేసవినే తలపించింది.
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితి కారణంగా వ్యవసాయ రంగం కుదేలౌతోంది. సెప్టెంబర్‌లో కురిసిన నామమాత్రపు వర్షాలతో కృష్ణా నదికి నీరు వచ్చిందని రైతులు సంతోషించే లోపే మళ్లీ వేడి వాతావరణం ఆ సంతోషాన్ని ఆవిరి చేసింది. ఉత్తరరాయలసీమలో వర్షాభావం పరిస్థితులు, అకాలంలో కురిసిన భారీ వర్షాలు కారణంగా వ్యవసాయం దెబ్బతింది. అయితే పట్టిసీమ పుణ్యమా అని పంటలు పూర్తిగా ఎండిపోలేదు. అయితే మెట్ట ప్రాంతాల పరిస్థితి దారుణంగా, దయనీయంగా మారింది.
అనంతపురం, చిత్తూరు వంటి జిల్లాల్లో మెట్ట పంటలు వేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎండలకు పంటలు పూర్తిగా ఎండిపోతుండటంతో రైతుల కన్నీరు కూడా ఆవిరైపోతోంది. ఈ ఏడాది వరి, ఇతర పంటల ఉత్పత్తి దాదాపు 30 నుంచి 40 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, సాగునీరు, తాగునీటి కొరతతో పాటు వాతావరణ మార్పులు తీవ్ర రూపం దాలుస్తాయనీ హెచ్చరిస్తున్నారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొన్న తరహాలోనే.. ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. ఎల్ నినోను కూడా కరోన లాగే పెను విపత్తుగా భావించి ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికను పాటించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
[El Nino impact Telugu states, December heatwaves AP Telangana, weather news Telugu agriculture, El Nino effect on crops, Telugu One]


