TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చినుకు కినుకు: రైతన్న వణుకు.. ఎల్ నినోతో వ్యవసాయం కుదేలు

Published on: Thu Oct 15, 2026 1:00PM

ఈ పరిస్థితికి కారణమేంటి?
ఎదుర్కోనేందుకు చేయాల్సిందేంటి?
అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసం.!
మావనాళి మడుగడ ప్రశ్నార్థకం.!

రుతుపవనాలపై ఆధారపడి సాగే భారత వ్యవసాయంలో చినుకు జాడ కనిపించకపోతే రైతన్న గుండెల్లో గుబులు మొదలవుతుంది. వర్షాలు ఆలస్యమైతే విత్తనాలు మొలకెత్తుతాయో లేదోనన్న ఆందోళన.. మధ్యలో వానలు ముఖం చాటేస్తే పంట చేతికొస్తుందో లేదోనన్న బెంగ.. ఇక దిగుబడులు తగ్గితే అప్పులు ఎలా తీర్చాలన్న ఆవేదన! ఇలా ప్రతి చినుకూ కీలకమైన వ్యవసాయ భారతంలో   ఎల్‌నినో ప్రభావం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. 

ఎల్‌నినోకు కారకులెవరు? ప్రకృతి వైపరీత్యాలకు మనిషి చేస్తున్న తప్పులే కారణమా? అభివృద్ధి పేరిట అడవులను మాయం చేసి కాంక్రీట్ జంగిల్స్ నిర్మించడం,  పారిశ్రామిక కాలుష్యం, విచ్చలవిడిగా  ఇంధన వినియోగం, నీటి వనరుల విధ్వంసం.. ఇవన్నీ వాతావరణ మార్పులకు దోహదం చేస్తున్నాయి. అయితే, ఎల్‌నినో అనేది ప్రధానంగా పసిఫిక్‌ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ  మార్పులతో ఏర్పడుతుంది.  

మరికొన్ని ప్రాంతాల్లో భా​భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్‌ మహాసముద్రం మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కినప్పుడు ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడతాయి. ఈ మార్పులు గాలుల దిశ, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కరవు పరిస్థితులు ఏర్పడితే.. రీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశాలుంటాయి.

భారత్‌లో నైరుతి రుతుపవనాల బలహీనతకు ఎల్‌నినో ఒక ముఖ్యమైన కారణం.  ఎల్ నినో ప్రభావంతో  2026లో  నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణ స్థాయితో పోలిస్తే సుమారు 12.6 శాతం తక్కువగా నమోదైంది.  అక్టోబర్‌లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. ఈ పరిస్థితులు వ్యవసాయం, భూగర్భ జలాలు, సాగునీటి నిల్వలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. 

 పారిశ్రామికీకరణ, పట్టణీకరణతో అభివృద్ధి వేగం పెరిగింది. అదే సమయంలో ప్రకృతి విధ్వంసం కూడా అదే వేగంతో జరుగుతోంది.  అడవుల నరికివేత, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు కనుమరుగవడం, భూగర్భ జలాల అధిక వినియోగం, ఇంధన దహనం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు పర్యావరణ సమతుల్యతను దారుణాతి దారుణంగా దెబ్బతీస్తున్నాయి.

గృహాల్లో ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్ల వినియోగం పెరగడం ఒక్కటే సమస్య కాదు. వాటికి అవసరమైన విద్యుత్తు ఎరవాణా, పరిశ్రమలు ఎంత ఇంధనాన్ని వినియోగిస్తున్నాయి? అడవులను సంరక్షణపై కొరవడిన శ్రద్ధ? వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి తగ్గిపోవడం వంటి అంశాలన్నీ ఎల్ నినో ఏర్పడటానికి దోహదం చేసిన, చేస్తున్న అంశాలే.  

వ్యవసాయంలోనూ పంటల వైవిధ్యం తగ్గడం, కొన్ని ప్రాంతాల్లో నీటిని అధికంగా వినియోగించే పంటలనే పదేపదే సాగు చేయడం, నేల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సమస్యలను పెంచవచ్చు. వరి సాగు నుంచి పశుపోషణ వరకు వివిధ వ్యవసాయ కార్యకలాపాల ద్వారా మీథేన్‌ వంటి గ్రీన్‌హౌస్‌ వాయువులు వెలువడతాయి. వీటి ప్రభావం తగ్గించేందుకు శాస్త్రీయ సాగు పద్ధతులు, నీటి సమర్థ వినియోగం, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం అవసరం. 

వర్షాభావంపై ఆందోళన ఉన్నప్పటికీ ఇండియాలో ఆహారధాన్యాల ఉత్పత్తి విషయంలో పురోగతి సాధించింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన  అంచనాల ప్రకారం దేశంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి 357.73 మిలియన్‌ టన్నులకు చేరింది. ఇందులో వరి, గోధుమల ఉత్పత్తి రికార్డు స్థాయిలో నమోదైంది. ముఖ్యంగా 2024-25 సంవత్సరంలో  ఇడయా  సుమారు 150.18 మిలియన్‌ టన్నుల వరి ఉత్పత్తిని సాధించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. అధిక దిగుబడినిచ్చే వంగడాలు, సాగు పద్ధతుల్లో మార్పులు, రైతుల శ్రమ ఈ ఫలితానికి దోహదం చేశాయి.

ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ వరి ఉత్పత్తిలో కీలక రాష్ట్రాలుగా నిలిచాయి. దేశంలో వరి ఉత్పత్తి భారీ స్థాయిలో ఉన్నప్పటికీ, ప్రతి రాష్ట్రంలోనూ ధాన్యం లభ్యత ఒకేలా ఉండదు. రవాణా, నిల్వలు, కొనుగోలు విధానాలు, ప్రాంతాలవారీగా సాగు పరిస్థితులూ ఆహార సరఫరాపై ప్రభావం చూపుతాయి.

అలాగే 2024–25లో భారత్‌ సుమారు 117.94 మిలియన్‌ టన్నుల గోధుమలను ఉత్పత్తి చేసింది. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా ప్రధాన గోధుమ ఉత్పత్తి రాష్ట్రాలు. గోధుమల ఉత్పత్తి పెరగడం, ప్రభుత్వ సేకరణ, నిల్వల నిర్వహణ ఆహార భద్రతకు దోహదం చేస్తాయి. 

అయితే గత ఏడాది సాధించిన రికార్డు ఉత్పత్తిని బట్టి భవిష్యత్తులోనూ ఎలాంటి కొరత ఉండదని ముందుగానే నిర్ణయించలేం. వరుసగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే తదుపరి సాగు సీజన్లలో నేలలో తేమ, సాగునీటి లభ్యత, దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఆహార నిల్వలతోపాటు నీటి నిర్వహణకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.

వరి, గోధుమల వంటి ప్రధాన ఆహారధాన్యాలతో పోలిస్తే పండ్ల తోటలు, కూరగాయల సాగులో నీటి కొరత ప్రభావం తీవ్రాతి తీవ్రంగా ఉంది. ముఖ్యంగా మామిడి, అరటి, బత్తాయి, ద్రాక్ష, దానిమ్మ, జామ, సపోటా, కొబ్బరి, పామాయిల్‌ వంటి పంటల్లో నీటి లభ్యత తగ్గితే పూత, కాయల అభివృద్ధి, దిగుబడి, నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇప్పుడు అదే పరిస్ఖితి ఏర్పడింది.  

అధిక ఉష్ణోగ్రతల వల్ల పూలు రాలడం, పండ్లు ఆశించిన పరిమాణంలో పెరగకపోవడం, నాణ్యత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. శాశ్వత పంటల్లో దీర్ఘకాలంగా నీటి కొరత కొనసాగితే చెట్ల పెరుగుదల, తదుపరి సీజన్‌ దిగుబడులపైనా ప్రభావం పడుతుంది. అలాగే.. టమాట, పచ్చిమిర్చి, వంకాయ, ఉల్లి, క్యాబేజీ, బంగాళాదుంప వంటి కూరగాయలకు నీటి లభ్యత కీలకం. పూత, కాయ ఏర్పడే దశల్లో అధిక వేడి, తేమ కొరత ఏర్పడితే దిగుబడులు తగ్గుతాయి.   ఉల్లి, బంగాళాదుంప వంటి పంటల్లో పరిమాణం, నిల్వ సామర్థ్యం, నాణ్యత కూడా ప్రభావితమవుతాయి. దిగుబడులు తగ్గి మార్కెట్‌కు వచ్చే సరకు పరిమాణం తగ్గితే  సహజంగానే ధరలు పెరుగుతాయి.    

కందులు, పెసలు, మినుములు, శనగలు, అలసందలు వంటి పప్పుధాన్యాలు వర్షాధార రైతులకు కీలకమైన పంటలు. వీటికి వరి కంటే తక్కువ నీరు అవసరమయ్యే సందర్భాలున్నా.. విత్తనం మొలకెత్తే సమయంలో, పూత దశలో, కాయలు ఏర్పడే సమయంలో తేమ కొరత వస్తే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. అదే విధంగా వేరుశనగ, సోయాబీన్‌, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల పంటల్లోనూ కీలక దశల్లో నీటి కొరత సాగును దెబ్బతీస్తుంది. వేరుశనగలో కాయలు ఏర్పడే సమయంలో నేలలో తేమ తగ్గితే దిగుబడిపై ప్రభావం పడుతుంది. సోయాబీన్‌లో పూత, గింజలు నిండే దశల్లో అధిక ఉష్ణోగ్రతలు ప్రతికూల పరిణామాలకు దారితీస్తాయి.


ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వర్షాధారంగా సాగు చేసే మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశనగ, సోయాబీన్‌ వంటి పంటలపై వర్షాభావ పరిస్థితి ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ర  నీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో జొన్న, సజ్జ, రాగి, కొర్ర, సామలు వంటి చిరుధాన్యాలు, తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, అనువైన నూనెగింజల పంటలను పరిశీలించవచ్చు. అయితే ప్రతి పంట ప్రతి ప్రాంతానికి సరిపోదు. నేల స్వభావం, మార్కెట్‌ డిమాండ్‌, విత్తనాల లభ్యత, స్థానిక వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

మహారాష్ట్ర, కర్ణాటకల్లో సోయాబీన్‌, వేరుశనగ, పప్పుధాన్యాలు, ద్రాక్ష, దానిమ్మ వంటి పంటలకు నీటి కొరత సమస్యగా మారవచ్చు. రాజస్థాన్‌, గుజరాత్‌లలో వర్షాధార పంటలు వర్షాల సమయంపై ఎక్కువగా ఆధారపడతాయి. మధ్యప్రదేశ్‌లో సోయాబీన్‌, పప్పుధాన్యాల దిగుబడులపై వర్షపాతం ప్రభావం చూపవచ్చు.  రాష్ట్ర స్థాయి అంచనాలతోపాటు జిల్లా, మండల స్థాయి వాతావరణ సమాచారం ఆధారంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవడం ద్వారా ఏదో ఒక మేరకు నష్టాలు, కష్టాల నుంచి రైతన్న గట్టేక్కే అవకాశం ఉంటుంది.  

ఎల్‌నినో ప్రభావాన్ని పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాకపోయినా, ముందస్తు ప్రణాళికల ద్వారా నష్టాలను తగ్గించవచ్చు. వివిధ దేశాలు తమ అవసరాలకు అనుగుణంగా నీటి నిల్వలు, సాగునీటి వ్యవస్థలు, పంటల వైవిధ్యం, రైతులకు ఆర్థిక సహాయం, విపత్తుల నిర్వహణపై దృష్టి పెడుతున్నాయి.

ఫిలిప్పీన్స్‌లో వరి సాగుకు ప్రాధాన్యం ఎక్కువ. ఆ కారణంగా ఫలిప్పీన్స్ దేశంలో నీటి వినియోగాన్ని మెరుగుపరచడం, సాగు సమయాన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్చడం, రైతులకు అవసరమైన సహాయం అందించడం వంటి చర్యలు చేపట్టింది. తక్కువ నీటితో పండే పంటల వైపు మళ్లడం, వ్యవసాయ ఉత్పాదకాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం వంటి చర్యలకు ఉపక్రమించింది. ఇండోనీసియా నీటి నిల్వలు, సాగునీటి మౌలిక సదుపాయాలు, అడవులు, పీట్‌ భూముల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రాధాన్యం ఇస్తోంది. ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు కార్చిచ్చు రేగకుండా పర్యవేక్షణ,   నీటి వనరులను సమర్థంగా వినియోగంపై ప్రధానంగా దృష్టి సారించింది. 

అదే విధంగా బ్రెజిల్  ప్రాంతాలవారీగా వాతావరణ ప్రతికూలతను అంచనా వేసి, సమర్ధ నీటి యాజమాన్యం ద్వారా రైతులు నష్టాల పాలు కాకుండా చర్యలు చేపట్టింది.   వ్యవసాయ నష్టాలను తగ్గించే పద్ధతులను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. 

ఇక పోతే పెరూలోనికొన్ని ప్రాంతాల్లో ఎల్‌నినో కారణంగా భారీ వర్షాలు, వరదల ముప్పు ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో నీటి కొరత తలెత్తే  పరిస్థితులు నెలకొన్నాయి  నదీ కాల్వలు, డ్రైనేజీ వ్యవస్థల నిర్వహణ, ప్రమాద ప్రాంతాల గుర్తింపు, ప్రజలకు ముందస్తు హెచ్చరికలు, పశువుల సంరక్షణ వంటి చర్యలు చేపట్టింది.

మొత్తంగా ఎల్ నినో ప్రభావంపై చేతులెత్తేయడం కంటే..  ముందుగానే నష్టాన్ని అంచనా వేసి, దానిని సాధ్యమైనంత తగ్గించేలా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉంది.   

ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆహార కార్యక్రమం  వంటి అంతర్జాతీయ సంస్థలు వాతావరణ ప్రతికూలతలను ముందే గుర్తించి వాటికి అనుగుణంగా సలహాలూ, సూచనలూ, హెచ్చరికలు చేస్తాయి. ఆయా సంస్థల సూచఃనల మేరకు ఎల్ నినో ప్రభావంతో  ఏర్పడిన  , కరవను తట్టుకునే పంటలను ప్రోత్సహించడం, నీటి వనరులను మెరుగ్గా నిర్వహించడం, ఆహార కొరతకు గురయ్యే కుటుంబాలకు సకాలంలో సహాయం అందించడం వంటి చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి. 

రైతులకు వాతావరణ హెచ్చరికలు అందించడం, పంటల నష్టాన్ని తగ్గించే పద్ధతులపై శిక్షణ ఇవ్వడం, పశువులకు మేత, నీటి లభ్యతను నిర్ధారించడం, ఆహార సరఫరా వ్యవస్థలను ముందుగానే సిద్ధం చేసుకోవడం ఎల్ నినో ప్రభావం నుంచి సాధ్యమైనంత తక్కువ నష్టంతో బయటపడేందుకు చేపట్టల్సిన కీలక చర్యలు.  
ఎల్‌నినో ప్రభావాన్ని జీరో చేసే దిశగా చర్యల తీసుకోవాల్సి ఉంది.   ముందుగా రాష్ట్రాలు, జిల్లాలవారీగా నీటి లభ్యత, పంటల పరిస్థితి, భూగర్భ జలాల స్థాయిని అంచనా వేయాలి. ఆ వివరాల ఆధారంగా వ్యవసాయ ప్రణాళికలను రూపొందించాలి.

 చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, చెక్‌డ్యామ్‌లను పునరుద్ధరించాలి. వర్షపు నీటిని సాధ్యమైనంతవరకు స్థానికంగానే నిల్వ చేయాలి. గ్రామాలు, పట్టణాల్లో వర్షపు నీరు వృథాగా పారిపోకుండా భూగర్భంలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలి. రహదారులు, భవనాల నిర్మాణంలోనూ వర్షపు నీటి నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి. నేల, వాతావరణం, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, తక్కువ నీరు అవసరమయ్యే పంటలను ప్రోత్సహించాలి.

ఉద్యాన పంటల్లో డ్రిప్‌ ఇరిగేషన్‌, నేలపై మల్చింగ్‌ వంటి పద్ధతులతో నీటి వినియోగాన్ని తగ్గించాలి.  వర్షపాతం, ఉష్ణోగ్రతలు, విత్తే సమయం, పంటల కీలక దశలపై రైతులకు స్థానిక భాషలో సకాలంలో సూచనలు అందించాలి. అర్హులైన రైతులకు పంటల బీమా పథకాలపై అవగాహన కల్పించి, నష్టం సంభవించినప్పుడు నిబంధనల ప్రకారం పరిహారం అందేలా చూడాలి.  ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసిన రైతులకు మార్కెట్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. 

గతంలో ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన నీటి సంరక్షణ, శ్రమదానం వంటి కార్యక్రమాలకు కొత్త ఊపునివ్వాలి. గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల వరకు స్థానిక సంస్థలు నీటి బడ్జెట్‌ రూపొందించి, వర్షపు నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలి.

ఎల్‌నినో ఉందని కూరగాయలు, పప్పులు, వంటనూనెల ధరలు పెరుగుతాయి. మార్కెట్‌లో సరఫరా తగ్గితే ధరలు పెరగడం సహజం.   ప్రభుత్వ నిల్వలు, దిగుమతులు, ఇతర రాష్ట్రాల నుంచి సరకు రాక, రవాణా ఖర్చులు, డిమాండ్‌ వంటి అంశాలు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి. అందుకే ధరలపై భయాందోళనలకు లోనుకాకుండా ప్రభుత్వాలు సరఫరా పరిస్థితులను పర్యవేక్షించాలి. అవసరమైన చోట నిల్వలను విడుదల చేయడం, మార్కెట్‌ సమాచారాన్ని పారదర్శకంగా అందించడం, రైతులకు సరైన ధర లభించేలా చూడడం ముఖ్యం.

ఇప్పటి వరకూ మనం చెప్పుకున్నదంతా ఎల్ నినో.. దాని ప్రభావం, దుష్ఫ్రభావాన్ని తగ్గించడం అన్న విషయాలు మాత్రమే. ఎందుకంటే ఎల్‌నినో అనేది మనిషి ఆదేశాలతో ఆగిపోయే ప్రక్రియ కాదు. కానీ దాని ప్రభావాలను ఎదుర్కొనే సన్నద్ధత విషయంలో సంసిద్ధత అవసరం.  దేశానికి ఆహారధాన్యాల ఉత్పత్తిలో ఉన్న బలం భరోసానిస్తున్నప్పటికీ, వర్షాధార రైతులు, ఉద్యాన పంటల సాగుదారులు, చిన్న సన్నకారు రైతుల సమస్యలను విస్మరించకూడదు. ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, స్థానిక సంస్థలు, రైతులు సమన్వయంతో ముందుకెళ్లాలి.

చినుకు పడితేనే పంట.. చినుకు నిలిస్తేనే భవిష్యత్ అన్న విషయాన్ని గుర్తెరిగి.. వర్షపు నీటిని ఒడిసిపట్టడం నుంచి పంటల ఎంపిక వరకు ప్రతి నిర్ణయంలో పర్యావరణ పరిరక్షణకు చోటివ్వాలి. ప్రకృతిని కాపాడుకోవడం కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు.. ప్రతి పౌరుడి కర్తవ్యం కూడా. అదే రైతన్నకు అండ.. భవితకు భరోసా!

[El Nino Impact Agriculture, Monsoon Failure agriculture, TeluguOne, Crop, Drought]