TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ఫారిన్ టూర్ కు బ్రేక్: ఈడీ పిటిషనే కారణమా.?

Published on: Tue Oct 13, 2026 4:48PM

వైసీపీ అధినేత జగన్ రెడ్డి విదేశీ టూర్ కు బ్రేక్ పడిందా?  ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం జగన్ వచ్చే నెలలో సతీసమేతంా యూరప్ లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటన కోసం ఆయన కోర్టు నుంచి అనుమతి కూడా పొందారు. అంతా సిద్ధమైందనుకున్న తరువాత అనివార్యంగా ఆయన విదేశీ పర్యటన డోలాయమానంలో పడింది.  

ఇందుకు   వ్యక్తిగత, రాజకీయ కారణాలు కావు. న్యాయపరమైన చిక్కుల కారణంగానే జగన్ విదేశీ పర్యటన రద్దయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలని ఈడీ నిర్ణయించడమే జగన్ విదేశీ పర్యటనకు బ్రేకులు పడటానికి కారణమంటున్నారు. అధికారికంగా ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ, ఈడీ తెలంగాణలోని ప్రత్యేక న్యాయస్థానంలో  వేసిన పిటిషన్ జగన్ విదేశీ పర్యటనపై నీలి నీడలు కమ్ముకునేలా చేసింది. 

జగన్  అక్రమ ఆస్తుల కేసుల విచారణను మరింత వేగవంతం చేయాలని, ఇకపై రోజువారీ ప్రాతిపదికన  విచారణ చేపట్టాలని ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  అంతే కాకుండా,   ఈ విచారణకు జగన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని కూడా ఈడీ ఈ పిటషన్ లో కోరింది.  

దేశవ్యాప్తంగా ఆర్థిక నేరాల కేసులు,  పెండింగ్‌లో ఉన్న బహుళ కోర్టు కేసులను సత్వరమే పరిష్కరించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన నేపథ్యంలో, ఈడీ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతం చేయాలని నిర్ణయించింది.  ఈడీ పిటిషన్ పై కోర్టు తీసుకునే నిర్ణయంపైనే జగన్ విదేశీ పర్యటన ఆధారపడి ఉంది.

ఒక వేళ సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరించి జగన్ అక్రమాస్తల కేసు విచారణ వేగవంతం చేయాలన్న ఈడీ పిటిషన్ ను కోర్టు అనుమతించి  రోజువారీ విచారణను ప్రారంభించాలని తీర్పు ఇస్తే.. జగన్ తన విదేశీ ప్రయాణాన్ని రద్దు చేసుకుని కోర్టు విచారణకు హాజరుకాక తప్పదు. అయితే ఈ పరిణామాలపై ఇప్పటివరకు పార్టీ అధినాయకత్వం తరఫున కానీ, వ్యక్తిగతంగా జగన్ తరఫున కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.  

గతంలోనూ పలుమార్లు విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో న్యాయస్థానాలు ఆయనకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈడీ తాజాగా వేసిన పిటిషన్ తో పరిస్థితులు మునుపటిలా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని న్యాయనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  


[ED Break To Jagan Foreign Tour, ED Petition CBI Court, YCP Chief Jagan Cases, Telangana Special Court ED, Jagan Europe Trip, Telugu One]