ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీ.. హైకోర్టులో పిటిషన్‌

 

ఏపీలో ముగ్గురు సీనియర్‌ పోలీసు అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం.. వీరు ముగ్గురూ ఎలాంటి ఎన్నికల బాధ్యతలు నిర్వహించకూడదని ఆదేశిస్తూ, హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేసింది. ఇంటెలిజెన్స్‌లో తదుపరి సీనియర్‌ అధికారి ఆ విభాగం బాధ్యతలు చేపట్టాలని సూచించింది.

ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న వెంకటేశ్వరరావు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ ఫోన్లను కూడా ట్యాప్‌ చేయిస్తున్నారని వైసీపీ నేతలు ఇటీవల పదేపదే ఈసీకి ఫిర్యాదు చేశారు. నిబంధనలను అతిక్రమించి వెంకటేశ్వరరావును డీజీగా ప్రమోట్‌ చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. అలాగే, కేడర్‌ అధికారులు ఉన్నప్పటికీ నాన్‌ కేడర్‌ అధికారి అయిన వెంకటరత్నంను శ్రీకాకుళం ఎస్పీగా నియమించడం పట్ల కూడా వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఆయన ద్వారా టీడీపీ నేతలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. టీడీపీ నేతలు ఎన్నికల్లో డబ్బును తరలిస్తూ పట్టుబడితే వారిని ఆయన తప్పించారని ఆరోపించారు. వీటిపై స్పందించిన ఈసీ బదిలీల నిర్ణయం తీసుకుంది. ఇక జగన్‌ బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్‌ చేస్తున్న దర్యాప్తు సరిగా లేదని ఆయన కుమార్తె సునీతారెడ్డి, వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. దీంతో కడప ఎస్పీగా ఉన్న రాహుల్‌ దేవ్‌ శర్మను బదిలీ చేసినట్లు సమాచారం. అయితే వైసీపీ చేసిన ఫిర్యాదులపై అధికారుల నుంచి వివరణ కూడా తీసుకోకుండా ఈసీ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది.

అధికారుల బదిలీపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కోరితే మోదీ, షాలు రాష్ట్ర అధికారులను బదిలీ చేయించడమేమిటని మండిపడ్డారు. ఎన్నికలకు సంబంధం లేని వ్యవస్థ ఇంటెలిజెన్స్ అని, తన భద్రతను పర్యవేక్షించే అధికారిని కూడా బదిలీ చేయడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఏ కారణంతో ఇద్దరు ఎస్పీలను బదిలీ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ కుట్రలో ఈసీ భాగస్వామ్యం కావడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. నిబంధనలను పట్టించుకోకుండా బదిలీ చేయడం సరికాదని చంద్రబాబు తప్పుపట్టారు. ఇదే విషయంపై ఎన్నికల సంఘానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు.

మరోవైపు ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. వారి బదిలీని సవాల్‌ చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఎన్నికల విధులకు సంబంధం లేని అధికారులను బదిలీ చేయడం అభ్యంతరకరమని పిటిషన్‌లో  పేర్కొంది. దీనిపై బుధవారం మధ్యాహ్నం విచారణ జరగనుంది. పిటిషన్‌పై వాదనలు వినిపించాల్సిందిగా ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.