TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇదిగో ఈ ఆహారాలు తింటే గట్ హెల్త్ సేఫ్ గా ఉంటుంది..!

Published on: Fri Nov 20, 2026 8:37AM

మన శరీర ఆరోగ్యానికి జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడం ఎంతైనా అవసరం. పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే రోగనిరోధక శక్తి పెరిగి శరీరం ఉత్సాహంగా ఉంటుంది. మన జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఫైబర్ లేదా పీచు పదార్థం ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో సరైన పీచు పదార్థాలు తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యలు దూరమవడంతోపాటు పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా డవలప్ అవ్వడానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి  వివరంగా తెలుసుకుంటే..

జామ..

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక మధ్యస్థ పరిమాణంలో ఉండే జామకాయ ద్వారా సుమారు ఐదు నుంచి ఆరు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో కరిగే మరియు కరగని.. రెండు  రకాల పీచు పదార్థాలు  సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియ సజావుగా సాగేలా సహాయపడటంతోపాటు కడుపు నిండుగా ఉండే భావనను కలిగిస్తుంది.



రాస్స్ బెర్రీస్..

రాస్స్ బెర్రీస్ పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఒక కప్పు రాస్స్ బెర్రీస్ లో దాదాపు ఎనిమిది గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే కరగని పీచు పదార్థం పేగుల్లోని మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే ఇవి కొంచెం ఖరీదైనవి అయినప్పటికీ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ.

ఇది కూడా చదవండి   కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే!​

చియా గింజలు..

చియా గింజలలో పీచు పదార్థం చాలా మెరుగ్గా ఉంటుంది. కేవలం రెండు టీస్పూన్ల చియా గింజల ద్వారా సుమారు పది గ్రాముల పీచు లభిస్తుంది. ఇవి కడుపులోకి వెళ్లిన తర్వాత ఒక జెల్ లాంటి రూపంలో తయారవుతాయి. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిని పెరుగుతో కలిపి తీసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది.

నల్ల మినప్పప్పు..

మన దేశంలో సులభంగా లభించే పొట్టుతో కూడిన మినుములు లేదా నల్ల మినపప్పు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఉడికించిన ఒక కప్పు మినపప్పులో దాదాపు పదహారు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో కూడా కరిగే , కరగని పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండటం వల్ల పేగుల కదలికలు సజావుగా సాగి జీర్ణశక్తి మెరుగవుతుంది.

వేయించిన శనగలు..

వేయించిన శనగలు పీచు పదార్థాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాయి. ప్రతి వంద గ్రాముల వేయించిన శనగలలో సుమారు పదిహేడు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో పీచుతో పాటు ప్రొటీన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

                                                                                                                                           *రూపశ్రీ

మీకు నచ్చవచ్చు   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది..

                                 విటమిన్-డి లోపం ఉంటే పిల్లలు పుట్టడం కష్టమా..ఈ నిజాలు తెలుసుకోండి..!