TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డబ్బు ముఖ్యం.. కానీ ఎలా సంపాదిస్తున్నామన్నదే ముఖ్యం!

Published on: Tue Sep 22, 2026 9:46AM

డబ్బు ముఖ్యం.. కానీ ఎలా సంపాదిస్తున్నామన్నదే ముఖ్యం!

డబ్బు సంపాదించడం జీవితంలో ఒక భాగమే కావచ్చు, కానీ అదే జీవితం కాదు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ డబ్బు అవసరం ఉన్నప్పటికీ, ఆ డబ్బును మనం ఏ మార్గంలో సంపాదిస్తున్నాం అనేదే మన భవిష్యత్తును, సమాజంలో మన గౌరవాన్ని, మన వ్యక్తిగత ఎదుగుదలను నిర్ణయిస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి  సంపాదించే వారు కొందరైతే, తమ తెలివితేటలతో తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించే వారు మరికొందరు. అలాగే ఎలాంటి కష్టం లేకుండా తొందరగా  సొమ్ము చేసుకోవాలని చూసేవారు కూడా మన మధ్య ఉన్నారు. అయితే ఈ మార్గాల్లో ఏది మనల్ని నిజమైన అభివృద్ధి వైపు నడిపిస్తుంది? ఏ రకమైన సంపాదన మనకు ఎక్కువకాలం  మనశ్శాంతిని, స్థిరత్వాన్ని ఇస్తుంది? సంపాదన వెనుక ఉన్న అసలైన నిజాలు, అంతరార్థం తెలుసుకుంటే..

శ్రమతో కూడిన సంపాదన..

చాలామంది జీవితాలు హార్డ్ వర్క్ తోనే మొదలవుతాయి. శరీర కష్టాన్ని, సుదీర్ఘ సమయాన్ని వెచ్చించి సంపాదించడాన్ని హార్డ్ వర్క్ అంటారు. రోజువారీ కూలీల నుంచి ఒక ఆఫీసులో గంటల తరబడి శ్రమించే ఉద్యోగుల వరకు అందరూ ఈ వర్గంలోకి వస్తారు. ఈ మార్గంలో సంపాదన అనేది మన శ్రమ, సమయం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది.  ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే అంత  ఆదాయం వస్తుంది.

హార్డ్ వర్క్ వల్ల క్రమశిక్షణ, పని పట్ల అంకితభావం పెరుగుతాయి. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. మనిషికి ఉండే శారీరక శక్తి, రోజులోని 24 గంటల సమయం పరిమితమైనవి. అందుకే కేవలం హార్డ్ వర్క్ మీద మాత్రమే ఆధారపడితే ఆర్థిక ఎదుగుదల ఒక స్థాయి వద్ద ఆగిపోతుంది. జీవితంలో ప్రాథమిక అవసరాలు తీరడానికి హార్డ్ వర్క్ తో కూడిన సంపాదన పునాదిగా ఉపయోగపడుతుంది కానీ, ఉన్నతమైన స్థానాలకు చేరుకోవడానికి ఇది మాత్రమే సరిపోదు.

తెలివిగా సంపాదించడం..

హార్డ్ వర్క్ కు తెలివిని జోడిస్తే..వచ్చేదే   స్మార్ట్ వర్క్. ఇక్కడ కేవలం శారీరక కష్టానికే కాకుండా ఆలోచనకు, నైపుణ్యాలకు, సమయ నిర్వహణకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని సాధించడమే స్మార్ట్ వర్క్ మూలసూత్రం. సాంకేతికతను ఉపయోగించుకోవడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, సంపాదించిన డబ్బును సరైన చోట పెట్టుబడి పెట్టడం అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం వంటివి స్మార్ట్ వర్క్ కిందకు వస్తాయి.

స్మార్ట్ వర్క్ చేసేవారు తమ సమయాన్ని కాకుండా, తమ నైపుణ్యాన్ని , వారు తయారుచేసిన వ్యవస్థను విక్రయిస్తారు. ఉదాహరణకు ఒక వ్యాపారాన్ని నెలకొల్పి, అందులో ఇతరులకు ఉపాధి కల్పించడం ద్వారా ఆదాయం పొందడం, తెలివి తేటలు ఉపయోగించి డబ్బుతో డబ్బును సృష్టించడం, టెక్నాలజీ ను ఉపయోగించి ఎక్కువ సమయంలో చేసే పనిని తక్కువ సమయంలో చేయడం మొదలైనవి  స్మార్ట్ వర్క్. ఇలాంటి మార్గాల్లో సంపాదనకు పరిమితులు ఉండవు. ముఖ్యంగా వ్యాపారాలు నెలకొల్పితే  మీరు నిద్రపోతున్నా కూడా మీ తరఫున సిస్టమ్ పనిచేసి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. జీవితంలో నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం, గొప్ప ఎదుగుదల సాధించాలంటే హార్డ్ వర్క్ నుంచి స్మార్ట్ వర్క్ వైపు అడుగులు వేయడం చాలా అవసరం.

సులభమైన సంపాదన..

తక్కువ సమయంలో, ఎటువంటి శ్రమ లేదా జ్ఞానం అవసరం లేకుండా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచననే ఈజీ మనీ అంటారు. బెట్టింగులు, లాటరీలు, రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేస్తామని చెప్పే మోసపూరిత పథకాలు, అక్రమ మార్గాలు ఈ వర్గం పరిధిలోకి వస్తాయి. ఈజీ మనీ అనేది పైకి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది కానీ, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.

అడ్డదారిలో లేదా కష్టం లేకుండా వచ్చిన డబ్బు ఎక్కువ కాలం నిలవదు. దీనివల్ల మనిషికి శ్రమించే తత్వం నశిస్తుంది, అనవసరమైన భయాలు, మానసిక అశాంతి పెరుగుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ మార్గాలు మనిషి గౌరవాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తాయి. ఈజీ మనీ వెనుక పరిగెత్తే వారు తాత్కాలికంగా డబ్బు చూసినప్పటికీ, సుదీర్ఘకాలంలో జీవితంలో స్థిరమైన ఎదుగుదలను సాధించలేరు.

నిజమైన ఎదుగుదల దేనిలో ఉంది?

జీవితంలో నిజమైన ఎదుగుదల అనేది కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం మాత్రమే కాదు. మన వ్యక్తిత్వం, మన నైపుణ్యాలు, సమాజంలో మనకు లభించే గౌరవం కూడా ఆ ఎదుగుదలలో భాగమే.

మొదట్లో హార్డ్ వర్క్ చేస్తూ పని మీద పట్టు సాధించాలి. ఆ తర్వాత ఆ అనుభవంతో స్మార్ట్ వర్క్ వైపు మారి, ఆదాయ మార్గాలను పెంచుకోవాలి. ఈ క్రమంలో ఈజీ మనీ మోజులో పడకుండా జాగ్రత్తపడాలి. న్యాయమైన మార్గంలో, మన నైపుణ్యాలను నమ్ముకుని చేసే సంపాదన మాత్రమే మనకు శాశ్వతమైన ఎదుగుదలను, సమాజంలో గౌరవాన్ని , మనశ్శాంతిని ఇస్తుంది. సరైన మార్గంలో సంపాదించే ప్రతి రూపాయి మీ జీవితాన్ని మరొక మెట్టు పైకి తీసుకెళ్తుంది.

 

                          *రూపశ్రీ.