మనం ఏమి చేయకపోయినా సరే.. ఆదాయం తెచ్చిపెట్టే సంపాదనా మార్గాలు ఇవి..!
Published on: Fri Sep 25, 2026 9:57AM
మనం ఏమి చేయకపోయినా సరే.. ఆదాయం తెచ్చిపెట్టే సంపాదనా మార్గాలు ఇవి..!
.webp)
ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తేనే డబ్బులు వస్తాయి అనేది పాత మాట. కానీ ఎలాంటి శారీరక శ్రమ లేకుండా, రోజూ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా సరే మన ఖాతాలోకి డబ్బులు వచ్చే మార్గాలు కూడా ఉన్నాయి. దాన్నే నిష్క్రియాత్మక ఆదాయం లేదా ప్యాసివ్ ఇన్‌కమ్ అని అంటారు. మనం నిద్రపోతున్నా, వేరే పనుల్లో బిజీగా ఉన్నా లేదా కుటుంబంతో గడుపుతున్నా ఈ మార్గాలు మనకు నిరంతరం ఆదాయాన్ని తెచ్చిపెడతాయి.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో కేవలం ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడటం అంత క్షేమకరం కాదు. అందుకే ప్రత్యామ్నాయ సంపాదన మార్గాలను అన్వేషించడం చాలా అవసరం. సరైన ప్రణాళిక, చిన్నపాటి పెట్టుబడి లేదా నైపుణ్యంతో కొన్ని ప్యాసివ్ ఇన్‌కమ్ మార్గాలు ప్రారంభించవచ్చు. వీటి వల్ల భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుంది. మనం ప్రత్యక్షంగా పనిచేయకపోయినా ఆదాయం తెచ్చిపెట్టే కొన్ని ముఖ్యమైన ఆదాయ మార్గాల గురించి వివరంగా తెలుసుకుంటే..
రియల్ ఎస్టేట్ రెంట్ లేదా అద్దె ద్వారా ఆదాయం..
సొంతంగా ఇల్లు, వాణిజ్య సముదాయాలు లేదా ఖాళీ స్థలాలు ఉంటే వాటిని అద్దెకు ఇవ్వడం ద్వారా ప్రతినెల స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ప్రాపర్టీని ఒక్కసారి సిద్ధం చేసి అద్దెకు ఇస్తే చాలు, ప్రతి నెల ఆటోమేటిక్‌గా అద్దె రూపంలో డబ్బులు వస్తాయి.
డివిడెండ్ స్టాక్స్ , మ్యూచువల్ ఫండ్స్..
మంచి పనితీరు కనబరిచే కంపెనీల షేర్లలో లేదా డివిడెండ్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను పొందవచ్చు. ఈ కంపెనీలు తమకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని వాటాదారులకు డివిడెండ్ రూపంలో క్రమం తప్పకుండా అందిస్తాయి.
డిజిటల్ ప్రోడక్ట్స్, ఈ-బుక్స్..
ఏదైనా ప్రత్యేకమైన నైపుణ్యం లేదా పరిజ్ఞానం ఉంటే దానిపై పుస్తకాలు రాయడం లేదా కోర్సులు తయారు చేయడం చేయవచ్చు. ఈ-బుక్స్, ఆన్‌లైన్ గైడ్స్ లేదా వీడియో కోర్సులను ఒక్కసారి క్రియేట్ చేసి ఇంటర్నెట్‌లో విక్రయానికి పెడితే, ఎన్నిసార్లు అమ్మడుపోతే అన్నిసార్లు రాయల్టీ లేదా ఆదాయం వస్తుంది.
యూట్యూబ్ ఛానెల్ , బ్లాగింగ్..
ఆసక్తి ఉన్న అంశాలపై వీడియోలు చేయడం లేదా వెబ్‌సైట్‌లో ఆర్టికల్స్ రాయడం ద్వారా కూడా మంచి ఆదాయం పొందవచ్చు. ఒక్కసారి కంటెంట్ తయారు చేసి అప్‌లోడ్ చేసిన తర్వాత, ఆ వీడియోలు లేదా వ్యాసాలను జనాలు చూస్తున్నంత కాలం యాడ్స్ ద్వారా లేదా ప్రమోషన్ల ద్వారా ఆదాయం వస్తూనే ఉంటుంది.
అఫిలియేట్ మార్కెటింగ్..
ఇతర కంపెనీల ఉత్పత్తులు లేదా సేవలను సోషల్ మీడియా అకౌంట్స్ , వెబ్‌సైట్ లేదా యూట్యూబ్ ద్వారా ప్రమోషన్ చేయడం దీని ప్రత్యేకత. మీ లింక్ ద్వారా ఎవరైనా ఆ వస్తువులను కొనుగోలు చేస్తే మీకు నిర్దిష్ట శాతం కమిషన్ లభిస్తుంది.
బ్యాంక్ డిపాజిట్లు , ప్రభుత్వ బాండ్లు..
ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితమైన ఆదాయం కోరుకునే వారికి ఇది మంచి మార్గం. ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ప్రభుత్వ బాండ్లలో డబ్బు జమ చేయడం ద్వారా ప్రతి నెల లేదా ఏడాదికి ఒకసారి క్రమం తప్పకుండా వడ్డీ రూపంలో ఆదాయం పొందే వీలుంది.
మొదట్లో ఈ మార్గాలను ఏర్పాటు చేసుకోవడానికి కొంత సమయం, శ్రమ లేదా పెట్టుబడి అవసరమవుతాయి. కానీ ఒక్కసారి సరిగ్గా ప్లానింగ్ చేసుకుంటే ఆ తర్వాత మనం పెద్దగా సమయం కేటాయించకపోయినా ఆర్థికంగా స్థిరమైన ఆదాయాన్ని పొందడానికి ఇవి ఎంతో దోహదపడతాయి.
*రూపశ్రీ.


