TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దసరా స్పెషల్: రోడ్లు బ్లాక్.. హైదరాబాద్ ఖాళీ, పల్లె బాట పట్టిన భాగ్యనగరం.!

Published on: Sat Oct 17, 2026 11:41AM

తెలంగాణలో పెద్ద పండుగ అయిన  దసరా సందర్భంగా భాగ్యనగరం దాదాపుగా ఖాళీ అయిపోయిందా అన్న అనుమానం కలుగుతోంది. భాగ్యనగరం పండుగ జరుపుకునేందుకు పల్లె బాట పట్టినట్లుగా కనిపిస్తోంది.  హైదరాబాద్‌ నగరవాసులు పెద్ద సంఖ్యలో  తమ తమ స్వగ్రామాలకు పయనమయ్యారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి పండుగను ఆనందంగా గడపడానికి బడి పిల్లలకు వచ్చిన సెలవులు మరియు ఉద్యోగుల వరుస సెలవులను సద్వినియోగం చేసుకుంటూ జనం   పల్లెబాట పట్టారు.

దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే భాగ్యనగరం బోసిపోయింది. అయితే నగరం నుంచి ఊళ్లకు వెళ్లే రహదారులు, జాతీయ రహదారులు ట్రాఫిక్ జామ్ లతో దాదాపుగా బ్లాక్ అయ్యాయి. ఊళ్లకు వెడుతున్న జనాలతో నిండిన వాహనాలు పెద్ద సంఖ్యలో రహదారులపైకి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది.  ఒకేసారి లక్షలాది మంది  నగరం వీడి బయలుదేరడంతో ప్రధాన జంక్షన్ల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లు అవుతున్నాయి.   ఎటు చూసినా కార్లు, బైకులు, బస్సులతో నిండిపోయిన రోడ్లే కనిపిస్తున్నాయి.  

మహాత్మా గాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్టేషన్,  సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ   ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, సొంత కార్లు మరియు ద్విచక్ర వాహనాలలో భారీ సంఖ్యలో జనం తరలివెళ్లడంతో జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి.ఒకవైపు నగరంలో ట్రాఫిక్ జామ్‌లతో రోడ్లన్నీ జనసంద్రంగా మారితే, మరోవైపు తెలంగాణ పల్లెసీమలు పండుగ శోభతో కళకళలాడుతున్నాయి.  


[Dussehra Rush, Traffic jam, Home Town Travel, Highway Traffic, Toll Plaza rush, Festival Holidays, Hyderabad Empty, Telugu One]