దృశ్యం మూవీ చూసి తండ్రిని హత్య చేసిన కొడుకు..పోలీసులకు ఎలా చిక్కాడో తెలిస్తే షాకే..?
Published on: Sun Oct 4, 2026 5:43PM

సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది. క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్ఫూర్తితో కన్నతండ్రినే హత్య చేసిన ఓ కొడుకు ఉదంతం బిహార్‌లో కలకలం రేపింది. బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. దర్వా గ్రామానికి చెందిన రఘువీర్ సాహ్ని, ఆయన కుమారుడు శివ్ శంకర్ మధ్య కొంతకాలంగా ఆస్తి, కుటుంబ విషయాలపై వివాదాలు కొనసాగుతున్నాయి. సూరత్‌లో నివసిస్తున్న శివ్ శంకర్.. తండ్రిపై కక్ష పెంచుకుని హత్యకు కుట్ర పన్నాడు.
.webp)
ఈ క్రమంలో సూరత్‌లో ‘దృశ్యం-3’ సినిమా చూసిన శివ్ శంకర్.. సినిమాలో చూపించినట్టుగా పోలీసులకు ఆధారాలు దొరకకుండా హత్య చేయాలని ప్లాన్ చేశాడు. సూరత్ నుంచి బయలుదేరే ముందే తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు. అనంతరం రైలులో సుమారు 2 వేల కిలోమీటర్లు ప్రయాణించి బిహార్‌లోని పటోరి చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆటోలో గ్రామానికి వెళ్లి.. అర్ధరాత్రి సమయంలో ఇంటి వెనుక తలుపు నుంచి లోపలికి ప్రవేశించాడు. గాఢ నిద్రలో ఉన్న తండ్రి రఘువీర్ సాహ్నిపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా అక్కడి నుంచి తిరిగి సూరత్‌కు బయలుదేరాడు.
.webp)
అయితే.. నిందితుడు ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఓ చిన్న తప్పిదం అతడి గుట్టును రట్టు చేసింది. పటోరి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న శివ్ శంకర్.. అప్పటివరకు స్విచ్ ఆఫ్‌లో ఉన్న ఫోన్‌ను ఆన్ చేసి తన భార్యకు కాల్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ ఆఫ్ చేశాడు. ఈ కాల్ పోలీసులకు కీలక ఆధారంగా మారింది. కాల్ డేటా, మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు అతడి కదలికలను ట్రాక్ చేశారు. హత్య జరిగిన సమయంలో పటోరి ప్రాంతంలో అతడి ఫోన్ యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సూరత్‌లో అతడి కదలికలను గుర్తించి అక్కడే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శివ్ శంకర్ తండ్రిని తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సినిమా తరహాలో పోలీసులను మోసం చేయాలని చూసిన నిందితుడు.. చివరకు ఒక్క ఫోన్ కాల్‌తో పోలీసులకు చిక్కాడు.
.webp)
[ Drishyam 3, Bihar Murder, Father Murder, Son Kills Father, Samastipur Crime, Shivsankar, Raghuveer Sahni, Crime Thriller, Movie Inspired Murder, Axe Attack, Property Dispute, Murder Case, Police Investigation, Technical Surveillance, Call Data Record, Mobile Tower Location, Patouri Railway Station, Surat, Bihar Crime, Crime News ]


