TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వర్షాకాలంలో బయట నీరు తాగుతున్నారా..ఈ పొరపాటు మాత్రం చేయకండి..!

Published on: Sat Aug 29, 2026 12:53PM

ఇంట్లో ఇనా బయటకు వెళ్ళినప్పుడు అయినప్పుడు అయినా దాహం వేయగానే మొదట నీరు తాగుతారు. వర్షాకాలంలో అయితే బయటకు వెళ్ళినప్పుడు నీరు తాగడం తక్కువే అయినా ప్రయాణాల్లో, ఏదైనా ఆహారం తిన్నప్పుడో తప్పనిసరిగా కొన్నిసార్లు బయట నీరు తాగాల్సి వస్తుంది. వర్షాకాలంలో దాహం వేసినప్పుడు బయట దొరికే నీటిని తాగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్‌లు నీటి ద్వారా వేగంగా వ్యాపిస్తాయి. అందువల్ల ఈ కాలంలో తాగే నీటి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
వర్షాకాలంలో బయటి నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే..

మురుగు నీరు కలవడం..

వర్షాల వల్ల బయట డ్రైనేజీ వ్యవస్థలు పొంగిపొర్లుతాయి. పైప్‌లైన్లలో లీకేజీల వల్ల తాగునీటిలో మురుగు నీరు కలిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. బయట హోటళ్లు, రోడ్డు పక్కన బండ్ల వద్ద ఇచ్చే నీరు ఇలా కలుషితమైనదే అయి ఉండవచ్చు.

ప్రమాదకర వ్యాధులు..

కలుషిత నీటిని తాగడం వల్ల కలరా, టైఫాయిడ్, కామెర్లుగా పిలుచుకునే  జాండీస్, గ్యాస్ట్రోఎంటరైటిస్, విరేచనాలు వంటి నీటి ద్వారా వ్యాపించే తీవ్రమైన రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది.

ఐస్ క్యూబ్స్ తో జాగ్రత్త..

 చాలామంది బయట పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేయించుకుంటారు. కానీ ఆ ఐస్ తయారీకి ఏ నీటిని వాడారో తెలియదు. తరచుగా పరిశుభ్రంగా లేని నీటితోనే ఐస్ తయారు చేస్తారు కాబట్టి బయట తాగే పానీయాల్లో ఐస్ తీసుకోకపోవడమే మంచిది.

ఫిల్టర్ నీరు అని నమ్మకండి..

బయట బోర్డు మీద ఫిల్టర్ వాటర్ అని రాసి ఉన్నంత మాత్రాన అది పూర్తిగా సురక్షితం కాకపోవచ్చు. నీటిని శుభ్రం చేసే యంత్రాల నిర్వహణ సరిగ్గా లేకపోయినా అందులో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎల్లప్పుడూ ఇంట్లో కాచి చల్లార్చిన నీటిని  బాటిల్ లో వెంట తీసుకెళ్లడం చాలా మంచిది. 

ఒకవేళ బయట నీరు తాగాల్సి వస్తే, నాణ్యమైన సీల్ చేసిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. 10,20 ఖర్చు ఎందుకని ఎక్కడంటే అక్కడ నీరు తాగితే.. ఆ తర్వాత హాస్పిటల్స్ కోసం వందలు, వేలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వాటర్ బాటిల్ వన్ ముందు.. బాటిల్ సీల్ సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోవాలి.

హోటళ్ళు లేదా రెస్టారెంట్లలో నీరు తాగాల్సి వస్తే వేడి నీటిని ఇమ్మని అడగడం మంచిది.

వర్షాకాలంలో ఏ చిన్న నిర్లక్ష్యం కూడా ఆసుపత్రి పాలు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి బయట దొరికే సాధారణ నీటిని తాగే పొరపాటు అస్సలు చేయకూడదు.

                     *రూపశ్రీ.