TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉదయాన్నే మలాసనంలో కూర్చుని నీరు తాగమంటారు ఎందుకు? అసలు నిజాలు ఇవే..!

Published on: Tue Sep 29, 2026 4:57PM

ఉదయాన్నే పరగడుపున నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని మన పెద్దలు, వైద్యులు ఎప్పుడూ చెబుతుంటారు. అయితే సాధారణంగా నిలబడి లేదా కుర్చీలో కూర్చుని నీరు తాగడం కంటే.. మలాసనంలో (స్క్వాట్ పొజిషన్) కూర్చుని నీరు తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ఇలా మలాసనంలో కూర్చుని ఉదయాన్నే నీరు ఎందుకు తాగాలి? దీని వెనుక ఉన్న అసలైన కారణాలు, ఆరోగ్య రహస్యాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే..

మలాసనం అంటే ఏమిటి?

మలాసనం అంటే నేలపై రెండు కాళ్లను ముందుకు చాపి, మోకాళ్లను వంచి, పిరుదులు నేలకు దగ్గరగా ఉండేలా కూర్చునే పద్ధతి. మనం పాతకాలంలో వాడే ఇండియన్ టాయిలెట్ లో కూర్చునే పద్ధతి కూడా ఇదే. ఈ భంగిమ మన శరీరానికి చాలా సహజమైనది.

మలాసనంలో కూర్చుని నీరు తాగడం వల్ల కలిగే లాభాల..

జీర్ణక్రియ వేగవంతం అవుతుంది..

మలాసనంలో కూర్చున్నప్పుడు మన పొట్ట భాగం మీద సహజమైన ఒత్తిడి పడుతుంది. ఈ సమయంలో నీరు తాగినప్పుడు, ఆ నీరు నేరుగా ప్రేగుల్లోకి సులభంగా వెళ్తుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ మేల్కొని, రాత్రి తిన్న ఆహారం బాగా అరిగిపోతుంది.

మలబద్ధకం సమస్య మాయం..

చాలామంది ఉదయాన్నే మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. మలాసనంలో కూర్చుని నీరు తాగడం వల్ల పెద్దప్రేగుపై సరైన ఒత్తిడి కలిగి, ప్రేగుల కదలికలు పెరుగుతాయి. దీంతో పొట్ట త్వరగా శుభ్రపడుతుంది. రోజూ ఇలా చేస్తే మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి.

శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్తాయి..

రాత్రి సమయంలో మన శరీరం అంతర్గతంగా శుభ్రపడే ప్రక్రియ జరుగుతుంది. ఉదయాన్నే మలాసనంలో నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు, వ్యర్థాలు మూత్రం , మలం ద్వారా బయటకు సులభంగా వెళ్ళిపోతాయి.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి..

నిలబడి నీరు తాగడం వల్ల నీరు వేగంగా కిడ్నీల గుండా ప్రవహించి, సరైన వడపోత జరగదు. కానీ మలాసనంలో కూర్చుని నీరు తాగినప్పుడు శరీరం నీటిని సరిగ్గా పీల్చుకుంటుంది. దీనివల్ల కిడ్నీల మీద భారం పడదు, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.

 కీళ్ల నొప్పులు రావు..

నిలబడి నీరు తాగే అలవాటు ఉన్నవారికి భవిష్యత్తులో మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. అదే కూర్చుని, ముఖ్యంగా మలాసనంలో నీరు తాగడం వల్ల శరీరంలోని ద్రవాల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.

ఈ పద్ధతిని ఎలా పాటించాలి?

ఉదయాన్నే లేవగానే నోరు శుభ్రం చేసుకుని లేదా చేసుకోవడానికి ముందే ఒక లీటరు లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని తీసుకోవాలి.

నేలపై శుభ్రమైన చాప లేదా మ్యాట్ వేసుకుని మలాసనంలో కూర్చోవాలి.

నీటిని ఒక్కసారిగా వేగంగా తాగకుండా, ఒక్కో గుటక మెల్లగా ఆస్వాదిస్తూ తాగాలి.

నీరు తాగాక ఒక ఐదు నిమిషాలు అలాగే కూర్చుంటే పొట్టలో కదలికలు మొదలై, మలవిసర్జన సులభంగా జరుగుతుంది.

ఈ సమస్యలు ఉన్నవారు  జాగ్రత్తలు తీసుకోవాలి..

మోకాళ్ల నొప్పులు తీవ్రంగా ఉన్నవారు, ఇటీవలే శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు లేదా నడవడానికి ఇబ్బంది పడేవారు మలాసనంలో కూర్చోవడం కష్టం కావచ్చు. అలాంటి వారు మామూలుగా కుర్చీలో కూర్చుని గోరువెచ్చని నీరు తాగవచ్చు.

ఉదయాన్నే మలాసనంలో కూర్చుని నీరు తాగడం అనేది ఒక సహజమైన , అద్భుతమైన ఆరోగ్య అలవాటు. ఎలాంటి ఖర్చు లేకుండా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ చిన్న మార్పు ఎంతగానో ఉపయోగపడుతుంది.

                                                                                                                                                 *రూపశ్రీ.