డోర్నకల్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం.!
Published on: Thu Sep 17, 2026 2:11PM

డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్ర నాయక్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడగా, ఆయన కారు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్ మహబూబాబాద్ కలెక్టరేట్‌కు కారులో బయలుదేరారు.
మార్గమధ్యంలోని చింతపల్లి సమీపానికి రాగానే, ఆయన ప్రయాణిస్తున్న కారులో పొగలు రావడం గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కారును నిలిపివేయగా, లోపల ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

డ్రైవర్‌కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన జరిగిన అనంతరం ఎమ్మెల్యే వేరే వాహనంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలనుార్పివేశారు.
[Dornakal MLA, Escape, Narrow, Car Fire, Telangana News, Telugu One]


