ఇరాన్ తో చర్చలకు నో: ఒప్పందానికి అవకాశం.. ట్రంప్ ద్వంద్వ వైఖరి.!
Published on: Mon Sep 28, 2026 9:45AM

పశ్చిమాసియాలో ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ ముందుకు తెచ్చిన కొత్త శాంతి ఒప్పంద ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. చర్చల పునఃప్రారంభానికి ఇరాన్ కోరుతున్న రాయితీలుఆమోదయోగ్యం కావనీ అందుకే ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ఐరాసలో అమెరికా ప్రతినిథి మైక్ వాల్ట్జ్ స్పష్టం చేశారు. ఇరాన్ ఓడిపోతోందన్న ఆయన.. అందుకే ఇప్పుడు ఒప్పందం కోసం కాళ్లావేళ్లాపడుతోందన్న ట్రంప్ వ్యాఖ్యను ఆయన పునరుద్ఘాటించారు.
కేవలం చర్చలు ప్రారంభించేందుకే తమ నౌకాశ్రయాలపై అమెరికా నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, అంతర్జాతీయ ఆంక్షలను తొలగించాలని, బిలియన్ల డాలర్ల ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ చేసినది కపట ప్రయత్నం. అందుకే ట్రంప్ ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారని మైక్ వాల్ట్జ్ తెలిపారు. ఇరాన్ హామీలను నిలబెట్టుకుంటుందన్న నమ్మకం లేదని కుండబద్దలు కొట్టారు.
వివరాల్లోకి వెడితే.. గత వారం ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి శాంతి ప్రణాళికను ప్రకటించారు. దీని ప్రకారం.. స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలి, ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలి, ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన హర్మూజ్ జలసంధిపై అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని ముగించాలి.

ఇక అమెరికా తమ ప్రతిపాదనను తిరస్కరించడంపై అరాఘ్చి స్పందించారు. అమెరికా చేస్తున్న ఆరోపణలు చాలా చాలా పాతవని, వాటికి ఆధారాలు లేవని కొట్టిపారేశారు. అమెరికా కొన్ని పనులు చేస్తే జలసంధిని తెరవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఈ డిమాండ్లు కొత్తవి కావు, ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఇవి మా హక్కులు అపి ఆయన పునరుద్ఘాటించారు. అయితే, గత రెండేళ్లుగా ట్రంప్ ప్రభుత్వ ప్రవర్తన చూసిన తర్వాత వారితో మళ్లీ చర్చలు జరపడానికి తమకు ఎలాంటి కారణం కనిపించడం లేదన్నారు.
అయితే ఇరాన్ ప్రతిపాదనను అమెరికా నిర్ద్వంద్వంగా తిరస్కరించినప్పటికీ.. రానున్న రోజుల్లో చర్చలు పునఃప్రారంభమవుతాయని తాను ఆశిస్తున్నట్లు ట్రంప్ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇరాన్ ఒప్పందం కోరుకుంటోంది.. అయితే అది తాను ఆశిస్తున్న ఒప్పందం కాదన్న ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య ప్రారంభమయ్యే అవకాశం ఉందని మాత్రం అంగీకరించారు.
[Donald Trump, US Iran Talks, Iran Peace Proposal, America Reject, Middle East Conflict, Abbas Araghchi]


