TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికా ఎన్నికల సంస్కరణలకు ఇండియాయే ఆదర్శం.. డోనాల్డ్ ట్రంప్.!

Published on: Tue Aug 18, 2026 9:32AM

అమెరికాలో ఎన్నికల ప్రక్రియ,  ఓటింగ్ విధానంలో సంస్కరణలకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు.  దేశంలో ఎన్నికల సమగ్రతను కాపాడటానికి, ఓటింగ్ విధానంలో  మార్పులు అనివార్యమన్న ట్రంప్ సేవ్ అమెరికా చట్టం ఆమోదం కోసం పట్టుబడుతున్నారు.  ఈ చట్టం ప్రాముఖ్యతను అమెరికన్ ప్రజలకు,  ప్రజాప్రతినిధులకు వివరించడానికి ఆయన ఇండియాలో  ఎన్నికల వ్యవస్థను  ఉదాహరణగా చూపుతున్నారు. 

అమెరికా ఫెడరల్ ఎన్నికలలో ఓటు వేసే ప్రతి ఒక్కరికీ ఓటర్ ఐడీ  ఉండి తీరాలని, దాంతో పాటు పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలనూ తప్పని సరి చేయాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు.  తాజాగా తన సోషల్ మీడియా వేదిక  ట్రూత్ సోషల్ లో  ఆయన ఇండియాలో ఎన్నికల వ్యవస్థపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇటీవల భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తో తన సంభాషణను ఆయనా పోస్టులో పేర్కొన్నారు. అసలు కనీస గుర్తింపు కార్డు కూడా లేకుండా అమెరికా వంటి అగ్రరాజ్యంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తనను ప్రశ్నించారని పేర్కొన్న ట్రంప్.. ఇండియన్ డెమొక్రటిక్ సిస్టమ్ లో ఉన్న ట్రాన్స్ పరెన్సీని ప్రస్తుతించారు.

ఇందుకు సంబంధించి ఆయన.. ఇండియాలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలను ప్రస్తావించారు. ఆ ఎన్నికలలో  64.6 కోట్ల మంది పౌరులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా, క్రమశిక్షణతో వినియోగించుకున్నారన్నారు.  అంతే కాకుండా ఇండియాలో ఓటు వేసిన ప్రతి ఒక్కరూ..  తమ ఫొటో గుర్తింపు కార్డు చూపించిన తర్వాతే ఓటు వేశారనీ, అలాగే.. ఇండియాలో  పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారి సంఖ్య మొత్తం ఓటర్లలో 1 శాతం కంటే తక్కువగా మాత్రమే ఉందని చెప్పిన ట్రంప్.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంలోనే.. వంద శాతం ఓటర్ ఐడీ తనిఖీ సాధ్యమైనప్పుడు..  అమెరికాలో ఎందుకు సాధ్యంకాదనీ ప్రశ్నించారు.  

 అమెరికా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి తక్షణమే  సేఫ్‌గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ యాక్ట్ ఆమోదించాలని అమెరికా అధ్యక్షుడు పిలుపునిచ్చారు.   భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఓటర్ గుర్తింపును బయోమెట్రిక్ లేదా ఆధార్ తరహా పక్కా ధ్రువీకరణ వ్యవస్థలతో అనుసంధానించి పారదర్శకతను పెంచాయని,  అమెరికాలో మాత్రం ఇప్పటికీ కేవలం స్వీయ ధ్రువీకరణపైనే ఆధారపడటం ఎమిటని ట్రంప్ ట్రూత్ సోషల్ లో షేర్ చేసిన పోస్టులో నిలదీశారు. 

Donald Trump, SAVEAmericaAct, IndianElectionSystem, VoterID, LawUS, USElectionsReform