డాలర్ ఆయుధం.. గాల్లోనే ఆగిపోతున్న ఇరాన్ విమానయాన రంగం
Published on: Wed Sep 23, 2026 3:47PM

మునిగిపోతున్న వ్యక్తిని కాపాడటానికి ఒక గడ్డిపరకైనా చాలు అనే సామెత మీకు తెలిసే ఉంటుంది. అయితే అమెరికా పుణ్యమా అని ఇరాన్ కు ఆ మాత్రం గడ్డిపరక సాయం కూడా అందకుండా పోతోంది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక వ్యవస్థలో ఇరాన్ కు మిగిలి ఉన్న చివరి అంతర్జాతీయ సంబంధాలను కూడా వాషింగ్టన్ తెంచేస్తోంది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సోమవారం (సెప్టెంబర్ 21) సీఎన్బీసీ చానెల్ లో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ఎయిర్ లైన్స్ ను పూర్తిగా మూసివేస్తాం అని ప్రకటించారు. ఇరాన్ విమానం ఎక్కడైనా దిగితే.. దానికి ఇంధనం పోయకండి, ల్యాండింగ్ సేవలు ఇవ్వకండి, టిక్కెట్లు అమ్మకండి అని ప్రపంచ దేశాలకు హుకుం జారీ చేశారు. అలా చేయని దేశాన్ని డాలర్ వ్యవస్థ నుంచి బయటకు పంపేస్తామని హెచ్చరించారు.
తుపాకీ పేలకుండానే, ఆ తుపాకిని పనికిరాకుండా చేయడం అంటే ఇదే. డాలర్ ఆయుధీకరణ అసలు ఉద్దేశం.. విమానం ఇరాన్ కు చెందినదైనా సరే; దానికి ఇంధనం, విమానాశ్రయ సేవలు, టికెటింగ్, చెల్లింపులు, బీమా.. ఇవన్నీ డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థపైనే ఆధారపడి ఉంటాయి. ఆ వ్యవస్థలోని కీలుబొమ్మలను లాగడమే వాషింగ్టన్ లక్ష్యం.

ఇరాన్ పౌర విమానయాన రంగంపై అమెరికా నిషేధాలు 1979 సంక్షోభం నాటి నుంచే ఉన్నాయి. 2007 నుంచి ఇవి మరింత కఠినమయ్యాయి. దేశంలో సగానికి పైగా విమానాలు విడిభాగాల కొరత వల్ల గాల్లోనే ఆగిపోయాయి. 2011 అక్టోబర్ 12న, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ క్వడ్స్ ఫోర్స్కు ఈ విమానయాన సంస్థ ఆర్థిక, సాంకేతిక సహాయం అందిస్తోందనే ఆరోపణతో అమెరికా ట్రెజరీ ఉగ్రవాద నిరోధక అధికారం కింద మహాన్ ఎయిర్ ను నిషేధించింది.
2015 అణు ఒప్పందం ( తర్వాత కొంత ఉపశమనం కనిపించింది. ఇరాన్ ఎయిర్ బోయింగ్, ఎయిర్బస్ సంస్థల నుంచి 200కు పైగా విమానాలను ఆర్డర్ చేసింది. కానీ 2018 మే 8న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ఒప్పందం నుంచి తప్పుకోవడంతో, ఆ రెండు సంస్థలకు ఇచ్చిన ఎగుమతి లైసెన్స్ లు రద్దయ్యాయి; ఇరాన్ కు చేరినవి కేవలం మూడు ఎయిర్బస్ జెట్లు, పదమూడు ఏటీఆర్ విమానాలు మాత్రమే.
ఈ ఏడాది గత ఆరు నెలలుగా అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష ఘర్షణ నేపథ్యంలో ఈ ఆంక్షలు ముమ్మరమయ్యాయి. 2026 ఆగస్ట్ 24న బెసెంట్ దీన్ని ఎకనామిక్ డీ డే గా ప్రకటించి, ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ పేరుతో విమానయానంతో సహా ఐదు కీలక రంగాలను లక్ష్యంగా చేసుకున్నారు.
జూలై 30న, చైనా, భారత్, రష్యా, ఇరాన్ లోని మహాన్ ఎయిర్ కు జనరల్ సేల్స్ ఏజెంట్లుగా పనిచేస్తున్న ఆరు సంస్థలు, వ్యక్తులపై ఓఎఫ్ఏసీ ఆంక్షలు విధించింది. వాటిలో భారత్ కు చెందిన స్కైజ్ ట్రావెల్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఉంది.
సెప్టెంబర్ 8న ట్రెజరీ విభాగం 36 లక్ష్యాలపై ఆంక్షలు ప్రకటించింది. ఇందులో ఇంతకుముందు నిషేధాలకు గురికాని 27 ఇరాన్ ఎయిర్లైన్స్ (ఎయిర్ షిరాజ్ నుంచి జాగ్రోస్ ఎయిర్లైన్స్ వరకు), టర్కీ,యూఏఈ, మలేషియా, కజకిస్తాన్, బ్రిటన్ లోని మహాన్ ఎయిర్ కు విమానాలు, సామాగ్రి సరఫరా చేసిన సంస్థలు ఉన్నాయి. చమురు ఎగుమతులకు బదులుగా ఇరాన్ అందుకున్న కరెన్సీ అయిన రియల్ విలువ డాలర్కు 22.5 లక్షల రియల్స్ కు రికార్డు స్థాయికి పడిపోయింది.
అదే రోజు జారీ చేసిన వైండ్ డౌన్ లైసెన్స్ గడువు సెప్టెంబర్ 23 తెల్లవారుజాము 12 గంటలకు (అమెరికా ఈస్టర్న్ టైమ్ ప్రకారం) ముగుస్తుంది. బెసెంట్ పెట్టిన సెప్టెంబర్ 23 గడువుకు ఇదే ఆధారం. సెప్టెంబర్ 21న ఆయన సీబీఎన్ తో మాట్లాడుతూ చేసిన ప్రకటన ప్రమారం భారత కాలమానం ప్రకారం బుధవారం (సెప్టెంబర్ 23) రాత్రికల్లా ఈ ముగింపు అమల్లోకి వస్తుంది.
ఇది కేవలం ఇరాన్ విమానాలపై దాడి మాత్రమే కాదు.. ఇరాన్ విమానాలకు సేవలు అందించే మూడో దేశాల సంస్థలకు బెదిరింపు. స్వేచ్ఛగా వ్యాపారం చేయాలా, లేక డాలర్ వ్యవస్థలో ఉండాలా ? ఈ ఎంపిక ప్రపంచ కంపెనీల ముందు ఉంచింది అమెరికా.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ కేంద్ర స్థానంలో ఉండటమే అమెరికాకు అత్యంత శక్తివంతమైన విదేశాంగ ఆయుధం. అంతర్జాతీయ చెల్లింపుల్లో ఎక్కువ భాగం డాలర్లలోనే జరుగుతాయి. ఆ లావాదేవీలు చివరికి అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ గుండానే వెళ్లాలి. అందుకే ఎవరినైనా డాలర్ క్లియరింగ్ నుంచి తొలగిస్తే.. వారిని ప్రపంచ వాణిజ్యం నుంచి పూర్తిగా దూరం చేసినట్లే. సెకండరీ ఆంక్షల ద్వారా ఇరాన్ తో వ్యాపారం చేసే మూడో దేశాల సంస్థలను కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థకు దూరం చేయవచ్చు. ఈ భయమే చాలా దేశాలను వెనక్కి తగ్గేలా చేస్తున్నది.
దీనికి ఉదాహరణ 2022లో కనిపించింది.. ఉక్రెయిన్ పై దండయాత్ర తర్వాత అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, కెనడా, జపాన్ కలిసి రష్యా సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న సుమారు 300 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలను స్తంభింపజేశాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక పెద్ద దేశ సార్వభౌమ ఆస్తులను ఇలా స్తంభింపజేయడం ఇదే తొలిసారి. అంతకు ముందే పలుమార్లు స్విఫ్ట్ నెట్వర్క్ నుంచి ఇరాన్ బ్యాంకులను తొలగించడం, ఆస్తులను నిలిపివేయడం జరిగింది.
చట్టపరంగా ఈ చర్యలన్నీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13224 (ఉగ్రవాద నిరోధం), ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13902 (ఇరాన్ ఆర్థిక రంగాలు) కింద జారీ అయ్యాయి. ఆగస్ట్ 24న విమానయాన రంగాన్ని 13902 పరిధిలోకి తీసుకురావడం వల్ల మిగతా ఎయిర్లైన్లను నిషేధించే తలుపులు తెరుచుకున్నాయి. అమెరికా తన సొంత భూభాగంలోని లేదా అమెరికన్ వ్యవస్థలోని ఆస్తులను మాత్రమే స్తంభింపజేయగలదు. కానీ సెకండరీ ఆంక్షల ద్వారా ఇతర దేశాల సంస్థలపై తన చట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ఈ విధానం ఎక్స్ట్రా టెరిటోరియాలిటీ'పై ఎప్పటినుంచో వివాదం నడుస్తోంది. యూరోపియన్ దేశాలు గతంలో ఇలాంటి సెకండరీ ఆంక్షలను అడ్డుకోవడానికి 'బ్లాకింగ్ స్టాట్యూట్' చట్టాలను కూడా తెచ్చాయి.
ఇక్కడ గమనించాల్సిన వాస్తవం ఏమిటంటే.. అమెరికా ప్రకటన విమానాలను భౌతికంగా నేలకూల్చలేదు. విశ్లేషకులు దీన్ని ఆంక్షలతో కూడిన వాయు దిగ్బంధనంగా అభివర్ణిస్తున్నారు.
మరోవైపు, విమానయాన భద్రతకు సంబంధించిన అనుమతులను ఏఎఫ్ఏసీ కేస్-బై-కేస్ ప్రాతిపదికన పరిశీలిస్తామని చెప్పినప్పటికీ, పౌర విమానాలకు విడిభాగాలు, నిర్వహణ సేవలు నిలిచిపోవడం వల్ల ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకమవుతుందనే విమర్శ గతంలోనే వ్యక్తమైంది.
రాజకీయంగా ఇది ట్రంప్ ప్రభుత్వ గరిష్ట ఒత్తిడి విధానంలో భాగం. యుద్ధం, నావికా దిగ్బంధనం, ఆర్థిక ముట్టడితో ఇరాన్ ను అన్ని విధాలా అణచివేసే ప్రయత్నం. బెసెంట్ ఈ ప్రకటన చేసిన అదే రోజుల్లో చైనా వైస్ ప్రీమియర్ హె లిఫెంగ్తో ఆర్థిక చర్చలు జరిపారు. ఇరాన్ కు చైనా పెద్ద ఆర్థిక భాగస్వామి కావడం ఈ సందర్భంగా గమనార్హం. కీలకం. బ్యాంక్ ఆఫ్ మిస్ర్ దుబాయ్ శాఖ, టర్కీ బ్యాంకు, రష్యా వీటీబీ బ్యాంకులపై నిషేధాల ప్రసక్తి కూడా బెసెంట్ చేసిన ప్రకటనల్లో ఉంది. ఈ వివరం ఇంకా స్వతంత్రంగా పూర్తిగా ధృవీకరించబడలేదు.
సామాజిక ప్రభావం తక్షణమే కనిపిస్తోంది. ఇరాక్ ఇరాన్ విమానాల సేవలను నిలిపివేయడానికి సిద్ధమవుతోంది; అయితే ఇరాన్ ఎయిర్ మాత్రం తెహ్రాన్, మషాద్, ఇస్ఫహాన్ నుంచి నజాప్ కు తన షెడ్యూల్ ప్రకారమే విమానాలు నడుపుతామని ప్రకటించింది. మత యాత్రికులకు ఈ మార్గం జీవనాడి. మహాన్ ఎయిర్ టర్కీ సేవలను నిలిపివేసింది. విదేశాల్లో చిక్కుకున్న ఇరాన్ ప్రవాసులు, వైద్య చికిత్స కోసం విదేశాలు వెళ్లాల్సిన రోగులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం ఉంది.
మీడియాలో ఈ కథనం ప్రధానంగా 'ఆర్థిక యుద్ధం' కోణంలోనే ముద్రపడింది. అరబ్, పాశ్చాత్య, ఇండియన్, టర్కిష్ మీడియా అందరూ బెసెంట్ వ్యాఖ్యలను ప్రధానాంశంగా ప్రచురించారు. ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఈ వార్తపై ఇంకా అధికారిక స్పందన వెల్లడించలేదు.
వాస్తవానికి సూది మొనలా ఉపయోగపడాల్సిన ఆర్థిక సాధనాన్ని గొడ్డలిలా వాడటానికి వాషింగ్టన్ సిద్ధమైంది. 2022 రష్యా ఆస్తుల స్తంభన తర్వాత ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో బంగారం కొనుగోలు చేయడం మొదలుపెట్టాయి. డాలర్ ఆస్తులు స్నేహితులకు మాత్రమే సురక్షితమైనవి అని అందరూ గ్రహించారు కాబట్టి దేశాలు స్థానిక కరెన్సీల్లో స్థిరత్వ వ్యవస్థలను, రష్యా-చైనా వాణిజ్యం దాదాపుగా స్థానిక కరెన్సీల్లోనే, BIS 'mBridge' వంటి డిజిటల్ చెల్లింపు వేదికలను అభివృద్ధి చేస్తున్నాయి.
ఇక్కడే పెద్ద విరోధాభావం దాగి ఉంది.. భారత్ రష్యాతో రూపాయి, రూబుల్ వ్యవస్థలతో చమురు వాణిజ్యాన్ని కొనసాగిస్తోంది; అదే సమయంలో అమెరికాకు అనుకూలమైన భారత సంస్థపై కూడా సెకండరీ ఆంక్షల కత్తి వేలాడుతోంది. స్కైజ్ ట్రావెల్స్ ఉదంతం అదే చెబుతోంది. అయినప్పటికీ, చిన్న కరెన్సీల తక్కువ ద్రవ్యత, హెడ్జింగ్ సదుపాయాల కొరత వల్ల డాలర్ ఆధిపత్యం సమీపకాలంలో పూర్తిగా కుదించిపోయే అవకాశం లేదు. డీ-డాలరైజేషన్ అనేది నెమ్మదైన, కానీ తిరుగులేని దిశగా మాత్రమే కనిపిస్తోంది.
ముఖ్యాంశం.. ఆర్థిక మద్దతుతో నిలబడిన డాలరను రాజకీయ ఆయుధంగా మార్చే ప్రతి అడుగు, ఆ మద్దతును బలహీనపరుస్తుంది. ఇరాన్ నీటిలో మునిగిపోతుండగా, అది పట్టుకునే గడ్డిపరక కూడా కోల్పోతున్నట్లే.
ఈ సంక్షోభంలో ఇరాన్ వాణిజ్య విమానయానం అంతటా అణచివేయబడటం వంటి ప్రాథమిక విషయాల్లో పెద్దగా విభేదించే వారికి కూడా ఒక ప్రశ్న మిగులుతుంది.. ఐరజీసీకి ఆర్థిక, సైనిక మద్దతు అందిస్తున్న నెట్ వర్క్ లను ను నియంత్రించడం ప్రపంచ శాంతికి అవసరమే. కానీ అదే సాధనంగా కోట్లాది మంది సామాన్య ప్రయాణికుల విమాన ప్రయాణాన్ని, రోగుల చికిత్సా మార్గాలను పూర్తిగా మూసివేయడం సామూహిక శిక్షతో సమానమవుతుందా? ఈ ప్రశ్నకు వాషింగ్టన్ దగ్గర సంతృప్తికరమైన సమాధానం లేదు.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
[Dollar dominence, Iran, Aviation, America, Restrictions, De dollarisation, Telugu One]


