TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మెడ నొప్పి తగ్గుతుందా..దీని వెనుక ఉన్న అసలు నిజాలేంటి.!

Published on: Fri Sep 25, 2026 9:42AM

రోజువారీ జీవితంలో గంటల తరబడి ఒకే చోట కూర్చొని పనిచేయడం లేదా కంప్యూటర్, మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల మెడ పట్టుకుపోవడం, మెడ నొప్పి రావడం సాధారణంగా మారిపోయింది. ఈ నొప్పి తీవ్రమైతే కొందరిలో సర్వైకల్ పెయిన్ రూపంలో ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి సమయంలో మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది సొంత వైద్యాలు లేదా చిట్కాలు పాటిస్తుంటారు. అందులో   చాలామంది పాటించే ఉపాయం దిండు లేకుండా నిద్రపోవడం. దిండును పక్కన పెడితే మెడ నొప్పి పూర్తిగా తగ్గిపోతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. అయితే ఇది నిజమేనా లేదా కేవలం ఒక అపోహ మాత్రమేనా అనే విషయాలను వివరంగా తెలుసుకుంటే..

దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మెడ నొప్పి తగ్గిపోతుందా?

మెడ నొప్పి తగ్గాలంటే వెంటనే దిండు వాడటం ఆపేయాలని చాలామంది భావిస్తారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం ఇందులో ఎలాంటి నిజం లేదు. మన వెన్నుపాము నిర్మాణం పూర్తిగా సూటిగా, నేరుగా ఉండదు. మెడ భాగంలో వెన్నుపాము స్వల్పంగా వంపు తిరిగి ఉంటుంది. నిద్రపోతున్న సమయంలో ఈ వంపుకు సరైన సపోర్ట్ లభించడం చాలా అవసరం.

దిండు లేకుండా పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది?

వెల్లకిలా పడుకున్నప్పుడు  దిండు వాడకపోతే తల వెనుకకు వాలిపోతుంది. దీనివల్ల మెడ భాగంలోనూ, పరుపుకు మధ్య ఖాళీ ఏర్పడుతుంది. ఈ ఖాళీ వల్ల మెడ కండరాలు, లిగమెంట్లపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. మెడ  సహజమైన వంపు చదునుగా మారే ప్రమాదం ఉంది. ఫలితంగా ఉదయం లేచేసరికి మెడ నొప్పి తగ్గకపోగా మరింత ఎక్కువవుతుంది.

 ఒక పక్కకు తిరిగి పడుకునే అలవాటు ఉన్నవారికి భుజానికి, మెడకు మధ్య చాలా ఖాళీ ఉంటుంది. దిండు లేకపోతే తల పరుపు వైపు క్రిందికి వంగిపోతుంది. దీనివల్ల మెడ నరాలపై విపరీతమైన ఒత్తిడి పడి నరాలు లాగడం, తీవ్రమైన నొప్పి రావడం జరుగుతుంది. ఇది దీర్ఘకాలిక సర్వైకల్ సమస్యలకు దారితీస్తుంది.

సరైన దిండును ఎలా ఎంచుకోవాలి?

మెడ నొప్పి తగ్గడానికి దిండును పూర్తిగా మానేయడం పరిష్కారం కాదు, సరైన దిండును ఎంచుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

దిండు మందం చాలా ముఖ్యం. అది మరీ ఎత్తుగా లేదా మరీ పలచగా ఉండకూడదు.

నిద్రపోయేటప్పుడు  నొసలు, గడ్డం ఒకే స్థాయిలో సమాంతరంగా ఉండేలా దిండు సహకరించాలి.

దిండు బాగా ఎత్తుగా ఉంటే గడ్డం ఛాతీ వైపు ఒంగిపోతుంది. అలాగే దిండు బాగా పలచగా ఉంటే తల వెనుకకు వాలిపోతుంది. ఇవి రెండూ మెడకు హానికరమే.

పక్కకు తిరిగి పడుకునే అలవాటు ఉన్నవారు తమ భుజం చివర నుండి మెడ వరకు ఉండే దూరానికి సరిపోయేంత మందం ఉన్న దిండును ఎంచుకోవడం మంచిది.

నిద్రపోయే భంగిమతో పాటు సరైన సపోర్ట్ ఇచ్చే దిండును వాడటం ద్వారా మాత్రమే మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. తీవ్రమైన మెడ నొప్పి లేదా నరాల ఒత్తిడి ఉన్నప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోకుండా వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిది.

                                                                                                                                                  *రూపశ్రీ.