Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా? అసలు నిజం ఏంటంటే!
posted on: Jun 18, 2026 3:21PM

భారతీయుల ప్రధాన ఆహారం అన్నం. మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న భోజనంలో అయినా, రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా.. కనీసం అందులో కాసింత అన్నం అయినా లేకపోతే భోజనం తిన్న తృప్తి ఉండదు చాలామందికి. అయితే ఈ మధ్యకాలంలో రాత్రి పూట అన్నానికి బదులుగా చపాతీలు తినమని కొందరు, టిఫిన్ లు తినమని మరికొందరు చెబుతూ ఉంటారు. రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని కూడా చెబుతుంటారు. రాత్రి సమయంలో అన్నం తింటే బరువు పెరుగుతారా? ఇది నిజమా? దీని గురించి వైద్యులు చెబుతున్న నిజాలు ఏంటి? తెలుసుకుంటే..
బరువు పెరగడానికి అసలు కారణం..
డాక్టర్ల ప్రకారం.. బరువు పెరగడం లేదా తగ్గడం అనేది తినే ఏదో ఒక ఆహారంపై ఆధారపడి ఉండదు. అది పూర్తిగా రోజూ తీసుకునే కేలరీలు , శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది. అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే, ఆ కేలరీలు అన్నం నుండి వచ్చినా లేదా ఇతర ఆహారాల నుండి వచ్చినా బరువు పెరుగడం జరుగుతుంది. అందువల్ల, రాత్రిపూట కేవలం అన్నం తింటేనే లావు అవుతామని చెప్పలేమని అంటున్నారు.
అన్నం తినవద్దని ఎందుకు అంటారంటే..
అన్నంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. రాత్రి భోజనం చేసేటప్పుడు, శారీరక శ్రమ గణనీయంగా తగ్గిపోతుంది. అందువల్ల, ఎక్కువగా అన్నం తిని, రోజువారీ కేలరీల పరిమితిని మించిపోతే, అదనపు శక్తి శరీరంలో కొవ్వుగా పేరుకుపోవడం మొదలవుతుంది. అందుకే రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని చెబుతుంటారు.
బియ్యం రకం ముఖ్యం..
అన్ని రకాల బియ్యం ఒకేలా ఉండవని వైద్యులు చెబుతున్నారు. తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్, అంటే తక్కువగా పాలిష్ చేసిన బియ్యంలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించడంలో సహాయపడుతుంది.
అన్నాన్ని పప్పులు, పుష్కలంగా కూరగాయలు , ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తీసుకోవడం వల్ల సమతుల్య ఆహారం లభిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి , అతిగా తినడాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది.
జీర్ణక్రియ, నిద్రపై అన్నం ప్రబావం..
ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ఉంటుంది. కొంతమందికి రాత్రిపూట అన్నం తినడం సులభంగా జీర్ణమై, బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. మరోవైపు, మరికొందరు ఎక్కువగా అన్నం తిన్న తర్వాత కడుపులో భారంగా ఉన్నట్లు ఫీలవుతారు. దీన్ని బట్టి అన్నం యొక్క ప్రభావాలు ప్రతి వ్యక్తి జీర్ణవ్యవస్థ, జీవనశైలి , ఆరోగ్యంపై ఆధారపడి మారుతూ ఉంటాయి.
సమతుల్యం ఉంటేనే..
రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారన్న భావన పూర్తిగా నిజం కాదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, రోజువారీ కేలరీలను గమనిస్తూ, సమతుల్య మోతాదులో అన్నం తింటే, రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరగడం అనేది జరగదు.
బరువును అదుపులో ఉంచుకోవడానికి, రోజులోని సమయం కంటే కూడా తినే ఆహారం పరిమాణం, ఆహార రకం , మొత్తం జీవనశైలికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల, అన్నాన్ని సరైన మోతాదులో , సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిది.
*రూపశ్రీ.





