ఇయర్ బడ్స్ పెట్టుకుని రాత్రిళ్లు నిద్రపోయే అలవాటుందా.. ఈ నిజాలు తెలుసుకోండి..!
Published on: Thu Oct 22, 2026 5:06PM
ఇయర్ బడ్స్ పెట్టుకుని రాత్రిళ్లు నిద్రపోయే అలవాటుందా.. ఈ నిజాలు తెలుసుకోండి..!

ఈరోజుల్లో చాలామందికి రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా నిద్ర పట్టడం కోసం ఇయర్ బడ్స్ పెట్టుకుని పాటలు, భజనలు లేదా పాడ్‌కాస్ట్‌లు వినే అలవాటు ఉంటుంది. ఈ చిన్న అలవాటు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రి అంతా లేదా ఎక్కువ సమయం పాటు ఇయర్ బడ్స్ ధరించి పడుకోవడం వల్ల చెవుల ఆరోగ్యానికి ఎంతో హానికరమని వైద్యులు చెబుతున్నారు. ఈ చిన్న అలవాటు వల్ల భవిష్యత్తులో చెవులకు సంబంధించి పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
రాత్రి సమయంలో ఇయర్ బడ్స్ పెట్టుకుని పడుకోవడం వల్ల మన చెవుల్లో రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా నిద్రలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు లేదా బోర్లా పడుకున్నప్పుడు దిండుకు ఇయర్ బడ్స్‌కు మధ్య పడే ఒత్తిడి కారణంగా చెవి భాగంలో తీవ్రమైన నొప్పి, చికాకు లేదా మంట పుట్టే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రోజూ జరగడం వల్ల చెవి చుట్టూ ఉన్న సున్నితమైన చర్మం దెబ్బతింటుంది , నొప్పి మరింత పెరుగుతుంది.
ఇయర్ బడ్స్ చెవి రంధ్రంలో బిగుతుగా ఉండటం వల్ల చెవి లోపలికి గాలి సరిగ్గా వెళ్లకుండా అడ్డుపడుతుంది. దీనివల్ల చెవిలో తేమ , చెమట పేరుకుపోయి బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది చెవిలో ఇన్‌ఫెక్షన్లు రావడానికి ప్రధాన కారణం అవుతుంది. కొందరు ఇయర్ బడ్స్‌ను శుభ్రం చేయకుండా వాడటం లేదా ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. చెవుల్లో దురద, వాపు లేదా ఒక రకమైన ద్రవం కారడం వంటి లక్షణాలు కనిపిస్తే అది ఇన్‌ఫెక్షన్‌గా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలి.
రాత్రి మొత్తం ఇయర్ బడ్స్ ద్వారా పెద్ద శబ్దాలతో మ్యూజిక్ వినడం వల్ల మన వినికిడి శక్తి క్రమంగా మందగించే ప్రమాదం ఉంది. ఎక్కువ గంటలు చెవులకు శబ్దం తగలడం వల్ల చెవిలోని నరాలు బలహీనపడతాయి. కొందరు తక్కువ సౌండ్ పెట్టుకుని వింటున్నాము కదా అనుకుంటారు, కానీ రోజంతా లేదా రాత్రంతా చెవుల్లో ఆ పరికరాలు ఉంచుకోవడం వల్ల చెవి లోపల ఉండే సున్నితమైన భాగాలకు నష్టం కలుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో వినికిడి సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది.
మ్యూజిక్ వింటే ప్రశాంతంగా నిద్ర పడుతుందని అనుకుంటాం కానీ, రాత్రి అంతా పాటలు లేదా పాడ్‌కాస్ట్‌లు ప్లే అవుతూ ఉంటే మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోలేకపోతుంది. శబ్దాల కారణంగా మధ్యమధ్యలో నిద్రకు డిస్టర్బ్ కలుగుతుంది. దీనివల్ల ఉదయం లేచిన తర్వాత కూడా శరీరం అలసిపోయినట్లుగా , సుస్తీగా అనిపిస్తుంది. నిద్ర నాణ్యత దెబ్బతినడం వల్ల రోజంతా ఉత్సాహం లోపిస్తుంది.
ఈ సమస్యలన్నింటి నుంచి సురక్షితంగా ఉండాలంటే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం...
మీకు ఒకవేళ మ్యూజిక్ వింటూ నిద్రపోయే అలవాటు ఉంటే, పాటలు ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా టైమర్ సెట్ చేసుకోవడం మంచిది. వీలైతే ఇయర్ బడ్స్‌కు బదులుగా తక్కువ సౌండ్‌తో రూమ్‌లో చిన్న స్పీకర్ ఉపయోగించవచ్చు.
ఇయర్ బడ్స్‌ను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి , అంతేకాదు ఎవరితోనూ వాటిని షేర్ చేసుకోకూడదు. చెవుల్లో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది.
*రూపశ్రీ.


