TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎక్కువ తిన్నప్పుడే కడుపు నిండిన ఫీల్ వస్తుందా ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలంటే..!

Published on: Tue Sep 15, 2026 7:22PM

ఎక్కువగా తింటేనే కడుపు నిండినట్లు అనిపించడం అనేది ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. దీనివల్ల బరువు పెరగడం, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మనం ఎంత తింటున్నాం అనే దానికంటే, మన మెదడుకు కడుపు నిండిందనే సంకేతం ఎప్పుడు అందుతోంది అనేది ఇక్కడ చాలా ముఖ్యం. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి ముగింపు పలికి, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ఎలా అలవర్చుకోవాలి. ఎక్కువగా తింటేనే కడుపు నిండింది అని అనుకునే సమస్యకు ఎలా చెక్ పెట్టాలి? వివరంగా తెలుసుకుంటే..

ఎక్కువ తింటేనే కడుపు నిండిన ఫీలింగ్ ఎందుకు వస్తుంది?

మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు కడుపు నిండింది అనే విషయాన్ని మెదడుకు చేరవేసేందుకు కొన్ని రకాల హార్మోన్లు పనిచేస్తాయి. అయితే కొన్ని తప్పుడు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి..

ఆహారాన్ని వేగంగా తినడం..

త్వరత్వరగా ఆహారాన్ని మింగేయడం వల్ల కడుపు నిండిందనే సంకేతం మెదడుకు చేరేలోపే మనం తినాల్సిన దానికంటే ఎక్కువ ఆహారాన్ని తినేస్తాం. సాధారణంగా కడుపు నిండిన భావన మెదడుకు చేరడానికి దాదాపు ఇరవై నిమిషాల సమయం పడుతుంది.

ఆలోచనలు వేరే చోట ఉంచి తినడం..

 టీవీ చూస్తూ, ఫోన్ వాడుతూ లేదా ఏదైనా పనిలో మునిగిపోయి తిన్నప్పుడు ఎంత తింటున్నామో గమనించలేం. దీనివల్ల సాధారణ పరిమాణంలో తిన్నా కడుపు నిండిన తృప్తి లభించదు.

తక్కువ పీచు, ఎక్కువ ప్రాసెస్డ్ ఆహారం..

 మనం తినే ఆహారంలో పీచు పదార్థాలు తక్కువగా ఉండి, మైదా, షుగర్ వంటి ప్రాసెస్డ్ పదార్థాలు ఎక్కువగా ఉంటే అవి త్వరగా అరిగిపోతాయి. దీనివల్ల కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉండదు.

మానసిక ఒత్తిడి, నిద్రలేమి..

తీవ్రమైన ఒత్తిడి లేదా సరిపడా నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఆకలిని పెంచే హార్మోన్లు ఎక్కువై, కడుపు నిండినా ఇంకా తినాలనే భావన కలుగుతుంది.

ఈ సమస్యకు చెక్ పెట్టడానికి పాటించాల్సిన మార్గాలు..

ఆహారాన్ని నమిలి నెమ్మదిగా తినడం..

ప్రతి ముద్దను బాగా నమిలి మింగడం అలవాటు చేసుకోవాలి. ఆహారాన్ని నెమ్మదిగా తినడం వల్ల మెదడుకు కడుపు నిండుతున్న సంకేతాలు సమయానికి అందుతాయి. దీనివల్ల తక్కువ ఆహారంతోనే పూర్తి తృప్తి లభిస్తుంది.

మైండ్‌ఫుల్ ఈటింగ్ అలవాటు చేసుకోవడం..

 తినే సమయంలో ఫోన్లు, టీవీలు, పుస్తకాలు పక్కన పెట్టాలి. ఆహారం రంగు, రుచి, సువాసనను ఆస్వాదిస్తూ ద్యాస అంతా తిండిపైనే ఉంచి తినాలి. ఇది అతిగా తినడాన్ని సమర్థవంతంగా అడ్డుకుంటుంది.

పీచు, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం..

భోజనంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు , ప్రోటీన్ సమృద్ధిగా ఉండే పప్పుధాన్యాలు, గుడ్లు, పనీర్ వంటివి చేర్చుకోవాలి. ఇవి పొట్టను ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి.

భోజనానికి ముందు నీళ్లు తాగడం..

 భోజనం చేయడానికి ఒక అరగంట ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సిద్ధమవ్వడమే కాకుండా, అతిగా తినే అలవాటు తగ్గుతుంది. అయితే తింటున్న సమయంలో లేదా తిన్న వెంటనే ఎక్కువ నీళ్లు తాగడం మంచిది కాదు.

చిన్న ప్లేట్లు వాడడం.. 

పెద్ద ప్లేట్లలో ఆహారం తింటే తక్కువగా ఉన్నా ఖాళీగా కనిపిస్తుంది. అదే చిన్న ప్లేట్ వాడితే తక్కువ ఆహారమే ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది మానసికంగా త్వరగా తృప్తిని కలిగిస్తుంది.

ఆకలికి, దాహానికి తేడా గుర్తించడం..

చాలాసార్లు శరీరానికి దాహం వేసినప్పుడు కూడా ఆకలి వేస్తున్నట్లే అనిపిస్తుంది. కాబట్టి ఆకలిగా అనిపించినప్పుడు ముందుగా ఒక గ్లాసు నీళ్లు తాగి కొన్ని నిమిషాలు వేచి చూడడం మంచిది.

సరిపడా నిద్ర, ఒత్తిడి నిర్వహణ..

 ప్రతిరోజూ ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. అలాగే యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటే ఆకలిని నియంత్రించే హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.

చివరగా తెలుసుకోవాల్సింది..

ఎక్కువ తింటేనే కడుపు నిండుతుంది అనుకోవడం ఒక తప్పుడు జీవనశైలి అలవాటు మాత్రమే. కొద్దిరోజుల పాటు పైన పేర్కొన్న నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తే, తక్కువగా,  సరైన పరిమాణంలో ఆహారం తీసుకుంటూనే కడుపు నిండిన అనుభూతిని పొందవచ్చు. ఇది కేవలం బరువును అదుపులో ఉంచడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరిచి రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది.


                         *రూపశ్రీ.