కరెంట్ కట్... రైతులకు ఇకపై 9 గంటలు కరెంట్ ఇవ్వమని కేంద్రం ఆదేశం

వ్యవసాయ రంగానికి ఆరు నుంచి ఎనిమిది గంటలు మాత్రమే విద్యుత్ ఇవ్వాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ర్టాలకు స్పష్టం చేసింది. భూగర్భ జలాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం అమలు చెయ్యాలని పేర్కొంది. తెలంగాణలో 24 గంటల పాటు నిరంతరాయంగా వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్ ను అందిస్తూ ఉండగా.. పలు రాష్ట్రాల్లో తొమ్మిది గంటల్లోపు ఇస్తున్నారు. భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉండాలని.. వాటిని పరిరక్షించాలని ఎనిమిది గంటలకు మించి కరెంటు ఇవ్వరాదని కేంద్రం తరచుగా చెప్తూ వస్తుంది. 

ఇటీవల గుజరాత్ లో నిర్వహించిన విద్యుత్ మంత్రుల సదస్సులో ఇదే అంశాన్ని చెప్పింది. తెలంగాణలో 2017 జనవరి 1వ తేదీ నుంచి వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల కరెంటును అందిస్తున్నారు. వాస్తవానికి రోజంతా కరెంటు కావాలని ఏ రైతు కూడా ప్రభుత్వాన్ని కోరలేదు. అందుకు కొందరు మంత్రులు కూడా వ్యతిరేకించారు. పలు జిల్లా పరిషత్ లో 24 గంటల కరెంటుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. వీటిని పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం ఒక దశలో చెప్పినా ఆచరణలోకి మాత్రం రాలేదు. వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు కరెంటు ఇచ్చేటప్పుడు 143.20 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండగా.. 24 గంటల సరఫరా మొదలు పెట్టిన ఆరు రోజుల్లోనే అది 154.711 మిలియన్ యూనిట్లకు చేరింది. అదనంగా 15 గంటల కరెంటు ఇస్తున్నందున ప్రతి రోజూ దాదాపు 21 మిలియన్ యూనిట్ల వరకు అదనంగా వ్యవసాయరంగం ఖాతాలో చేరుతోందని డిస్కామ్ ల లెక్కలు చెప్తున్నాయి. అయితే నిర్దిష్టంగా ఎంత వ్యవసాయ వినియోగం ఉంటుందో డిస్కాంల వద్ద లెక్కలు లేవు. మీటర్ రీడింగ్ నమోదు కాని కరెంట్ అంతా సాగు ఖాతాలోనే చేరుతుందని పలువురు అంటున్నారు. దాంతో డిస్కాంలు ఇచ్చే ప్రతి యూనిట్ ను లెక్కించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.

తెలంగాణ లో అధికారిగా 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండగా అనధికారికంగా మరో నాలుగు లక్షల వరకు ఉన్నాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటరలు తొలగించారు. ఆ తరవాత మీటర్లు పెట్టాలనే ఆలోచన చేసిన అమలుకాలేదు. ఇప్పుడు కేంద్రం సూచనలతో మీటర్లు ఏర్పాటు చేయడం అనివార్యంగా మారింది. మూడేళ్ళలో వ్యవసాయ పంపుసెట్లను సోలార్ పంపుసెట్లుగా మార్చాలని కూడా కేంద్రం నిర్దేశించింది. రైతులకు పీఎం కుసుమ్ పథకంలో పంపుసెట్లు మంజూరు చేస్తే వినియోగం తగ్గటంతో పాటుగా రైతులు ఉత్పత్తి చేసే సోలార్ కరెంట్ కు ఆదాయం వారికే చేరుతుందని కేంద్రం చెబుతోంది.