దిశా సాలియన్ మృతి కేసులో ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాక్రేపై అభియోగాలు.!
Published on: Tue Sep 15, 2026 1:29PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా సాలియన్ మృతి కేసు దర్యాప్తులో బయటపడిన అంశాలు పెను సంచలనంగా మారాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్‌గా వ్యవహరించిన దిశా సాలియన్ అనుసామాస్పద మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. బాంబే హైకోర్టు స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ దర్యాప్తులో భాగంగా వెల్లడైన అంశాలతో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. దిశా సాలియన్ మృతి కేసులో మహా మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య థాక్రే గత కొన్ని సంవత్సరాలుగా అనేక రాజకీయ చర్చలకు, విమర్శలకు కేంద్ర బిందువుగా మారిన ఈ ఉదంతంలో తాజాగా నమోదైన ప్రాథమిక సమాచార నివేదిక దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఈ ఎఫ్‌ఐఆర్‌లో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే సహా పలువురు రాజకరీయ, సినీ ప్రముఖులపై అభియోగాలు దాఖలయ్యాయి. అలాగే నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, నటులు డినో మోరియా, సూరజ్ పాంచోలీ, ఆదిత్య ఠాక్రే భద్రతా సిబ్బంది పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ముంబై పోలీసు శాఖకు చెందిన కొందరు మాజీ అధికారులు, పోలీసు కమిషనర్లు, క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ దిశా సాలియన్ మృతి చెందిన సమయంలో ఆమె నివాసంలో జరిగిన పరిణామాలు, ఆ తదుపరి జరిగిన పరిణామాలపై ఆధారాలు సేకరిస్తోంది. దిశ తండ్రి సతీష్ సాలియన్ ఇటీవల సీబీఐ అధికారుల ఎదుట హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తన కుమార్తె మృతి వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అధికారిక యంత్రంగా దుర్వినియోగం జరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రికార్డుల ఫోర్జరీ, సాక్ష్యాల ధ్వంసం, కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలపై సీబీఐ దృష్టిపెట్టింది.

ఈ పరిణామాలకు ప్రధాన కారణం బాంబే హైకోర్టు ముంబై పోలీసుల దర్యాప్తు తీరుపై వ్యక్తం చేసిన తీవ్ర అసంతృప్తి. గతంలో రాష్ట్ర పోలీసులు ఈ ఘటనను కేవలం ప్రమాదవశాత్తు జరిగిందనో లేదా ఆత్మహత్యగానో తేల్చివేయడాన్నిహైకోర్టు తప్పుపట్టింది. ఆరు సంవత్సరాలు గడిచినా సరైన దిశలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబై పోలీసుల విచారణ తీరు అనుమానాలకు తావిస్తోందని, నిష్పక్షపాతంగా, లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేస్తూ కేసును సీబీఐకి బదిలీ చేసింది.
ఇక కేసు వివరాల్లోకి వెడితే.. దిశా సాలియన్ 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలోగల ఒక బహుళ అంతస్తుల భవనం పై నుంచి కింద పడి మరణించారు. ఆ ఘటన జరిగిన ఆరు రోజుల వ్యవధిలో.. జూన్ 14న నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన బాంద్రా నివాసంలో శవమై కనిపించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఎందుకంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వద్ద దిశా సాలియన్ మేనేజన్ గా ఉండేవారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ‘ధోనీ’బయోపిక్ లో నటించి ప్రశంసలు అందుకున్న నటుడు. అదలా ఉంచితే.. ఈ రెండు వరుస మరణాల మధ్య సంబంధం ఉందన్న అనుమానాలు అప్పట్లో బలంగా వ్యక్తమయ్యాయి. సుశాంత్ మృతి కేసుకు సంబంధించి ఇప్పటికే సీబీఐ విచారణ జరిగి నివేదిక సమర్పించబడినప్పటికీ, దిశా సాలియన్ మృతి విషయంలో తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం ఈ రెండు కేసుల మధ్య సంబంధం కోణాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది.
రాష్ట్ర రాజకీయాలలో ఈ పరిణామం పెను కలకలం రేపుతోంది. సత్యం బయటకు రావాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తుండగా, మరోవైపు ఈ పరిణామాలు రాజకీయ కక్షసాధింపు చర్యలని కొందరు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, చట్టపరమైన ప్రక్రియలో భాగంగా నిందితులు లేదా అనుమానితులపై తగిన ఆధారాలు లభించే వరకు తుది నిర్ధారణకు రాలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీబీఐ దర్యాప్తు ముగిసిన తర్వాతే ఈ ఉదంతంలో నిజానిజాలేమిటన్నది ఏమిటనేది వెల్లడి కానుంది.
రాబోయే రోజుల్లో ఈ కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకునే అవకాశం ఉంది. సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ప్రతి ఒక్కరినీ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు, వైద్యులు, పోస్ట్ మార్టం నిర్వహించిన సిబ్బంది, ఆ సమయంలో విధులు నిర్వర్తించిన పోలీసులు అందరినీ ప్రశ్నించడం ద్వారా మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది. బాంబే హైకోర్టు పర్యవేక్షణలో సాగుతున్న ఈ దర్యాప్తు తుది నివేదికను ఏ విధంగా కోర్టు ముందుంచుతారు, న్యాయస్థానం ఏ రకమైన ఆదేశాలు జారీ చేస్తుందనేదానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
[Disha Salian case, CBI FIR, Uddhav Thackeray, Aaditya Thackeray, Sushant Singh Rajput, Telugu One]


