కూటమిలో విభేదాలు నిజమే.. బీజేపీ నేత సంచలనం.!
Published on: Sun Sep 6, 2026 9:07AM
.webp)
ఆంధ్రప్రదేశ్‌లో అధికారిక కూటమి రాజకీయాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రణాళికలపై బీజేపీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు, పార్టీ విధానాలు, అలాగే ఇతర పార్టీలతో ఉన్న సంబంధాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సమష్టి కృషితో ముందుకు సాగుతోందని చెబుతూనే.. క్షేత్రస్థాయిలో విభేదాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు.
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో సీట్ల కేటాయింపు, సర్దుబాటు అంశాలపై మూడు పార్టీల అగ్రనేతల మధ్య చర్చలు జరుగుతున్నాయన్న విష్ణు వర్ధన్ రెడ్డి.. భాగస్వామ్య పార్టీలన్నీ సమన్వయ కమిటీల ద్వారా సమష్టి నిర్ణయాలు తీసుకుంటాయని వెల్లడించారు. కూటమి ధర్మం ముందు వ్యక్తిగత అభిప్రాయాలకు అవకాశమే లేదన్న ఆయన మిత్రధర్మాన్ని కూటమి పార్టీలన్నీ పాటిస్తాయన్నారు.

ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
గతంలో పార్లమెంటరీ వేదికలపై అంశాలవారీగా కొన్ని సందర్భాల్లో వైసీపీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపితే తెలిపి ఉండొచ్చు కానీ అంత మాత్రానికే ఆ పార్టీని బీజేపీ బీటీమ్ అనడం సరికాదని చెప్పారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు సమన్వయంతో పోటీ చేసి విజయం సాధించాలని మూడు పార్టీల శ్రేణులు పట్టుదలతో ఉన్నాయన్న విష్ణువర్ధన్ రెడ్డి.. క్షేత్రస్థాయిలో ఉన్న స్వల్ప విభేదాలను పరిష్కరించుకుని ముందుకు సాగుతామని పునరుద్ఘాటించారు.
[Differences in Allience Dact, Vishnuvardhan Reddy, BJP AP Alliance, TDP Janasena BJP, AP Local Body Elections, Andhra Pradesh Politics]


