TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇండియా కూటమిలో జాతీయ గేయం చిచ్చు.. కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ మధ్య విభేదాలు భగ్గు.!

Published on: Wed Sep 9, 2026 11:16AM

దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన జాతీయ గేయం వందేమాతరం పూర్తిగా పాడటం అన్న అంశంపై ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు పెచ్చరిల్లాయి.   కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి భిన్నంగా, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేతలు ఫరూఖ్ అబ్దుల్లా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జాతీయ గేయం వందేమాతరంను పూర్తిగా పాడటం ఇండియా కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మధ్య విభేదాలను బట్టబయలు చేసింది.  శ్రీనగర్‌లో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జాతీయ గీతానికి ముందు ప్రసారమైన జాతీయ గేయం వందేమాతరం ఆలపించే సమయంలో కేంద్ర మంత్రిత్వ శాఖ జారీ చేసిన  కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా, ఈ కార్యక్రమంలో వందేమాతరం గేయాన్ని పూర్తిగా పాడారు.  

ఈ వేడుకలో భాగంగా ప్రసారమైన వందేమాతరం పూర్తి పాట   3 నిముషాల 10 సెకన్ల పాటు సాగింది. ఈ  సమయంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా గేయం మొదటి నుంచి చివరి వరకు మొత్తం 6  చరణాలు పూర్తయ్యే వరకు గౌరవసూచకంగా నిలబడ్డారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో కలిసి అధికారికంగా భాగస్వామిగా ఉన్నప్పటికీ, జాతీయ గేయానికి గౌరవ విషయంలో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అయ్యింది.  నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేతలు కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా వ్యవహరించడం  జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది.  

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో    వందేమాతరం ఆలపిస్తున్నప్పుడు, మొదటి రెండు చరణాలు దాటి పాట ముందుకు వెళ్లడాన్ని సీనియర్ నేత సోనియా గాంధీ  వ్యతిరేకించారు. పాట మూడు లేదా అంతకంటే ఎక్కువ చరణాలకు వెడుతున్నట్లు గుర్తించిన వెంటనే సోనియా గాంధీ   అసంతృప్తిని వ్యక్తం చేస్తూ..   నిలిపివేయాలని సైగ ద్వారా ఆదేశాలు జారీ చేయడం  వివాదానికి దారితీసింది.  

కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ 1937 నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. దేశంలో మత సామరస్యాన్ని కాపాడే ఉద్దేశంతోనే నాటి అగ్రనేతలు వందేమాతరం గీతంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే అధికారిక కార్యక్రమాలలో ఆలపించాలని నిర్ణయించారని, ఇప్పటికీ తాము అదే విధానాన్ని పాటిస్తున్నామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 

అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా మార్గదర్శకాల ప్రకారమే అందరూ నడుచుకోవాలని బీజేపీ  డిమాండ్ చేస్తుండగా, కాంగ్రెస్ మాత్రం తన పాత 1937 నాటి తీర్మానానికే కట్టుబడి ఉండటం రాజకీయంగా దుమారం రేపింది. ఇలాంటి సున్నితమైన,  వివాదాస్పద వాతావరణంలో జమ్మూ కాశ్మీర్ లోయ నుండి వచ్చిన ఈ పరిణామం  ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ వేదికగా వందేమాతరం ఎన్ని చరణాలు పాడాలనే దానిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా, కాశ్మీర్ లో మాత్రం కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వందేమాతర గేయాన్నిపూర్తిగా ఆలకించి గౌరవించడం ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాల మధ్య విభేదాలకు అద్దంపట్టింది. 


[Differences Between India Allience Parties, Vande Mataram row, Omar Abdullah, Farooq Abdullah, Sonia Gandhi, Congress 1937 resolution, India bloc allies, Telugu One]