డీజిల్ విక్రయాలపై మళ్ళీ ఆంక్షలు: రోజుకు ఎన్ని లీటర్లంటే.!
Published on: Wed Sep 30, 2026 10:33AM

దేశీయ ఇంధన మార్కెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో, దేశీయంగా రిటైల్, బల్క్ డీజిల్ విక్రయాల ధరల మధ్య 40 వరకూ వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల వ్యత్యాసం కారణంగా ప్రైవేట్ ఇంధన దిగ్గజాలైన రిలయన్స్-బీపీ, నయారా ఎనర్జీ సంస్థలు దేశవ్యాప్తంగా తమ పెట్రోల్ బంకుల్లో డీజిల్ విక్రయాలపై ఆంక్షలు మరియు పరిమితులను విధించాయి. సామాన్య వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రైవేట్ బంకుల్లో భారీ మొత్తంలో ఇంధనం కొనుగోలు చేసే వాణిజ్య వాహనదారులు, ఫ్యాక్టరీలు మరియు బల్క్ కస్టమర్లపై ఈ నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. గరిష్ఠంగా రోజుకు 50 లీటర్లు అని నియంత్రణ విధించాయి.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల భారాన్ని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రిటైల్ ధరలను స్థిరంగా ఉంచినప్పటికీ, ప్రైవేట్ సంస్థలకు మాత్రం బల్క్, రిటైల్ మార్కెట్ల మధ్య ధరల తేడా వ్యాపార పరంగా తీవ్ర నష్టాలను తెచ్చిపెడుతోంది. ఈ పరిస్థితుల నడుమ జియోబీపీ, నయారా ఎనర్జీ బంకుల ద్వారా ఒక్కో వాహనానికి లేదా వినియోగదారుడికి రోజువారీ విక్రయాలపై 50 లీటర్ల పరిమితి విధించాయి సాధారణంగా రోజువారీ అవసరాలకు మించి భారీ క్యాన్లు లేదా ట్యాంకర్లలో ఇంధనం తీసుకునేవారికి తనిఖీలు తప్పట్లేదు. చాలా బంకుల్లో సాధారణ కార్లు, బైకులకు మాత్రమే కాకుండా వాణిజ్య వాహనాలకు కూడా ఈ పరిమితి వర్తిస్తుంది.

ఈ పరిణామం రవాణా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. మరోవైపు ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ , భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం బంకుల్లో మాత్రం సాధారణ విక్రయాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే ప్రైవేట్ మార్కెట్‌లో ఏర్పడిన ఈ డీజిల్ కొరత భయం, పరిమితుల కారణంగా రాబోయే రోజుల్లో ఇంధన సరఫరా గొలుసుపై మరింత ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ధరల వ్యత్యాసం పూర్తిగా సర్దుమణిగే వరకు లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి తదుపరి మార్గదర్శకాలు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
[Diesel Shortage, Jio Bp Diesel Limit, Nayara Energy , Bulk Retail Diesel Price Gap, Telugu One]


