మీకు తెలుసా ..ఈ విటమిన్లు లోపిస్తే లివర్ దెబ్బతింటుంది..!
Published on: Fri Oct 30, 2026 8:55AM

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి అవయవం తన బాధ్యతను తాను సరిగ్గా నిర్వర్తించడం ఎంత ముఖ్యమో, అలాగే మనం తీసుకునే ఆహారంలో పోషకాలు సరిపడా ఉండటం కూడా అంతే అవసరం. మనం రోజూ తినే తిండి మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. అయితే చాలామంది విటమిన్లు లేదా పోషకాలు తక్కువైతే నీరసం రావడం, రక్తం పడిపోవడం లేదా చర్మం , కళ్ళు బలహీనపడటం మాత్రమే జరుగుతుందని అనుకుంటారు. కానీ మన శరీరంలో అత్యంత కీలకమైన భాగమైన లివర్.. దీన్నే కాలేయం అని అంటారు. కాలేయం ఆరోగ్యం కూడా కొన్ని విటమిన్ల ఆధారంగా ఉంటుంది. అసలు కాలేయం చేసే పని ఏమిటి? ఏ విటమిన్లు లోపిస్తే కాలేయం దెబ్బతింటుంది? వివరంగా తెలుసుకుంటే..
శరీరంలో లివర్ పాత్ర..
మన శరీరంలో లివర్ చేసే పనులు అన్నీ ఇన్నీ కావు. మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో, శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను , హానికారక పదార్థాలను బయటకు పంపడంలో, శరీరానికి కావలసిన శక్తిని నిల్వ చేయడంలో లివర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే ఎన్నో రకాల ముఖ్యమైన ప్రొటీన్లను కూడా ఇదే తయారు చేస్తుంది. అయితే శరీరంలో కొన్ని రకాల విటమిన్ల లోపం ఏర్పడినప్పుడు అది నేరుగా లివర్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మరోవైపు లివర్‌కు సంబంధించిన సమస్యలు ఏవైనా వస్తే, అప్పుడు శరీరం విటమిన్లను సరిగ్గా గ్రహించలేకపోతుంది. దీనివల్ల సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంటుంది. ఆ విటమిన్లు ఏమిటో తెలుసుకుంటే..
విటమిన్-ఎ..
శరీరంలో విటమిన్ ఎ లోపం ఏర్పడితే అది కంటి చూపు తగ్గడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలకే పరిమితం కాకుండా లివర్ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. మన శరీరంలో ఉండే మొత్తం విటమిన్ ఎ నిల్వల్లో దాదాపు ఎనబై నుంచి తొంభై శాతం వరకు లివర్లోనే ప్రత్యేక కణాలలో నిల్వ ఉంటుంది. కాబట్టి లివర్ పనితీరు మందగిస్తే విటమిన్ ఎ నిల్వలు కూడా దెబ్బతింటాయి. అలాగే ఎముకలు , కండరాల బలానికి ఎంతగానో ఉపయోగపడే విటమిన్ డి లోపం కూడా లివర్ సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. శరీరంలో విటమిన్ డి తక్కువైతే అది లివర్‌లో వాపు రావడానికి , కణజాలం దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది.
విటమిన్-ఇ..
శరీరంలో కణాలను ఆక్సీడేటివ్ నష్టం నుంచి రక్షించడంలో విటమిన్ ఇ ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో కొవ్వు సరిగ్గా శోషణం కాకపోవడం లేదా కొన్ని రకాల దీర్ఘకాలిక లివర్ సమస్యలు ఉన్నప్పుడు విటమిన్ ఇ లోపం ఏర్పడే అవకాశం ఉంది. ఈ విటమిన్ తగినంత ఉంటే లివర్‌లో వచ్చే వాపును , కణాలకు జరిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించడానికి వీలవుతుంది.
విటమిన్-కె..
రక్తం గడ్డకట్టడానికి సహాయపడే ప్రొటీన్ల తయారీలో విటమిన్ కే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒకవేళ ఈ విటమిన్ లోపిస్తే చిన్న గాయాలైనప్పటికీ రక్తం త్వరగా గడ్డకట్టదు. శరీరంలో పిత్తరసం సక్రమంగా ప్రవహించకపోయినా లేదా కొవ్వు పదార్థాలు సరిగ్గా ఒంటబట్టకపోయినా విటమిన్ కే లోపం తలెత్తుతుంది.
మొత్తంగా చెప్పాలంటే లివర్ ఆరోగ్యంగా ఉండాలన్నా, లేదా లివర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నా శరీరానికి అవసరమైన విటమిన్లు సరైన పాళ్ళలో అందడం చాలా ముఖ్యం. ఏ చిన్న ఆరోగ్య సమస్య కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం , అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.
*రూపశ్రీ.


