వెలగపండు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..తప్పక తెలుసుకోండి!
Published on: Wed Sep 23, 2026 9:57AM
వినాయక చవితి పూజలో వెలగపండు ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో ప్రత్యేకంగా కనిపించే వెలగపండును కేవలం నైవేద్యానికే పరిమితం చేస్తుంటారు. చాలా ఇళ్లలో వెలగపండు నైవేధ్యంగా పెట్టాక వాటిని వినాయకుడితో పాటు నిమజ్జనం చేయడం లేదా పడేయడం లేదా వాటిని అలాగే వదిలేయడం చేస్తుంటారు. కానీ ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో వెలగ పండుకు చాలా ప్రాధాన్యత ఉంది. పైకి గట్టి పెంకుతో సాధారణంగా కనిపించినప్పటికీ, లోపల ఉన్న గుజ్జు అమృతంతో సమానమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ పండు కలిగించే ప్రయోజనాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అవేంటో తెలుసుకుంటే..
జీర్ణవ్యవస్థ..
వెలగపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది, అలాగే అందులో ఉండే టానిన్లు జీర్ణక్రియను వేగవంతం చేయడమే కాకుండా గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా మలబద్ధకం లేదా విరేచనాలతో బాధపడేవారికి ఈ పండు సహజమైన ఔషధంగా తోడ్పడుతుంది. కడుపులో ఉన్న చెడు బ్యాక్టీరియాను నశింపజేసి ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
రోగనిరోధక శక్తి
విటమిన్ సీ, విటమిన్ ఏ , వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు వెలగపండులో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చేరే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, కణాల నాశనాన్ని అడ్డుకుంటాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా వెలగపండు పాత్ర ప్రశంసనీయం. క్రమంతప్పకుండా పరిమితంగా తీసుకోవడం వల్ల రక్తంలోని మలినాలు తొలగిపోతాయి.
కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం..
కాలేయం, మూత్రపిండాల రక్షణకు వెలగపండు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో కాలేయానికి సహాయపడి, దాని పనితీరును సమర్థవంతంగా ఉంచుతుంది. అలాగే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడి మూత్రసంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది.
డయాబెటిస్ ..
డయాబెటిస్ లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలనుకునేవారికి వెలగపండు మంచి ఆహారం. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడంలో సాయపడుతుంది. శరీరం శక్తి కోల్పోకుండా, తక్షణ శక్తిని అందించడంలో దీనిలోని పోషకాలు తోడ్పడతాయి.
మహిళల ఆరోగ్యానికి..
మహిళల ఆరోగ్యానికి కూడా వెలగపండు చాలా మేలు చేస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో, అలాగే పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తి పెరగడంలో వెలగపండు గుజ్జు సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచడానికి ఇందులోని యాంటీఆక్సిడెంట్లు దోహదపడతాయి.
వెలగపండును గుజ్జు రూపంలో నేరుగా లేదా కొద్దిగా బెల్లం లేదా తేనె కలిపి తీసుకోవచ్చు.
వెలగపండు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఏ ఆహారమైనా పరిమితికి మించి తీసుకుంటే సమస్యలు రావచ్చు. అతిగా తింటే కడుపునొప్పి లేదా జీర్ణసమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, సరైన పరిమాణంలో తింటూ వెలగపండు నుంచి ఆరోగ్య లాభాలను పొందడం మంచిది.
*రూపశ్రీ.


.webp)
