TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డీసీపీ భుజాలెక్కి.. దేవినేని అవినాష్ హద్దులు దాటేశారు.!

Published on: Tue Sep 22, 2026 10:42AM

ఆంధ్రప్రదేశ్‌లో 2025 డీఎస్సీ నియామకాలకు సంబంధించి వైసీపీ చేపట్టిన నిరసన విజయవాడలో ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ కోటా ద్వారా జరిగిన ఉపాధ్యాయుల నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నేతలు ఆందోళన చేపట్టగా.. శాప్ కార్యాలయం వద్ద పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా నిరసన, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దేవినేని అవినాష్ గీత దాటారని, అన్ని హద్దులూ అతిక్రమించేశారనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ ద్వారా జరిగిన ఉపాధ్యాయ నియామకాలపై వైసీపీ కొంతకాలంగా ఆరోపణలు చేస్తోంది. ఫేక్ సర్టిఫికెట్లతో కొందరు ఉద్యోగాలు పొందారంటూ ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం, నియామకాలు పొందిన ఉపాధ్యాయులు ఖండిస్తున్నారు. తాము రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నామని, తమ వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలనూ బయటపెట్టారు. అయితే వైసీపీ మాత్రం తన ఆరోపణల పర్వాన్ని ఆపలేదు. ఈ నేపథ్యంలోనే విజయవాడలో ఆ పార్టీ పిలుపు మేరకు సోమవారం జరిగిన ఆందోళనకు దేవినేని అవినాష్ నాయకత్వం వహించారు.  కాగా వైసీపీ ఆందోళన నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. శాప్ కార్యాలయంలోకి నిరసనకారులు చొచ్చుకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.  

ఈ నేపథ్యంలోనే  నిరసనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తొపులాట చోటు చేసుకున్నాయి. అది పక్కన పెడితే..  ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందని అంటున్నారు. నిరసనల మధ్య దేవినేని అవినాష్ శాప్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ఓ డీసీపీ భుజాలపైకి ఎక్కి.. బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన తీరు పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అవినాష్ డీసీపీ భుజంపై నుంచి దూకి బారికేడ్లను దాటి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలన్నీ సీసీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి.  విధుల్లో ఉన్న అధికారి పట్ల అవినాష్ వ్యవహరించిన తీరు సరికాదని పరిశీకులు అంటున్నారు. 

కాగా ఈ నిరసనలో పాల్గొన్న  మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహా పలువురు వైసీపీ నేతలు  పోలీసులను అడ్డుకునే ప్రయత్నంలో కొందరు నేతలు పోలీసుల వద్ద ఉన్న లాఠీలను లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని పలువురు పోలీసు అధికారులే చెప్పారు.  

అదలా ఉంటే.. శాప్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న పరిణామాలను పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుంది.  విధుల్లో ఉన్న పోలీసు అధికారులతో  ఘర్షణ, బారికేడ్లు దాటేందుకు జరిగిన ప్రయత్నాలు, లాఠీలు లాక్కునే ప్రయత్నాలకు సంబంధించిన వీడియో ఫుటేజీలు  పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నట్లు సమచారం.   

[Devineni Avinash, Vijayawada YCP Protest, DSC , SAAP Office, YCP Agitation, Clash Police, AP politics, Telugu One]