TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డెస్క్ జాబ్ లు బైక్ జర్నీలు..వీటి వల్ల కలిగే వెన్ను నొప్పికి ఇలా చెక్ పెట్టండి..!

Published on: Wed Sep 9, 2026 3:05PM

నేటి ఆధునిక జీవనశైలిలో వెన్నునొప్పి అనేది చాలామందిని వేధించే ప్రధాన సమస్యగా మారింది. గంటల తరబడి డెస్క్ ముందు కూర్చుని పనిచేసే ఐటీ ఉద్యోగులు, ఆఫీస్ సిబ్బంది ఒకవైపు అయితే, ప్రతిరోజూ ట్రాఫిక్‌లో కిలోమీటర్ల కొద్దీ బైక్ ప్రయాణాలు చేసేవారు మరొకవైపు. ఈ రెండు రకాల పనుల వల్ల వెన్నెముకపై చాలా ఒత్తిడి పడి, చిన్న వయస్సులోనే తీవ్రమైన వెన్నునొప్పి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది భవిష్యత్తులో డిస్క్ సమస్యలు, నరాల బలహీనతకు దారితీసే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. అవేంటో తెలుసుకుంటే..

కూర్చునే పద్ధతిపై దృష్టి పెట్టాలి..

కుర్చీలో కూర్చున్నప్పుడు వీపు కుర్చీకి సరిగ్గా ఆనుకుని ఉండేలా చూసుకోవాలి. నడుము వెనుక భాగంలో ఖాళీ లేకుండా చిన్న కుషన్ లేదా పిల్లో పెట్టుకోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. కంప్యూటర్ లేదా లాప్‌టాప్ స్క్రీన్  కళ్ళ ఎత్తులోనే ఉండాలి. స్క్రీన్ కిందకు ఉన్నప్పుడు మెడ, వెన్ను భాగం ముందుకు వంగి నొప్పికి కారణమవుతాయి. 

ప్రతి నలభై ఐదు నిమిషాలకు ఒకసారి సీటు నుంచి లేచి కనీసం రెండు నిమిషాలు అటు ఇటూ నడవడం లేదా శరీరాన్ని స్ట్రెచ్ చేయడం అలవాటు చేసుకోవాలి.

బైక్ జర్నీలు చేసేవారికి జాగ్రత్తలు..

రైడింగ్ చేసేటప్పుడు వీపును పక్కకు లేదా ముందుకు ఎక్కువగా వంచకుండా నిటారుగా కూర్చోవాలి. బైక్ షాక్ అబ్జార్బర్లను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం. రోడ్డుపై ఉండే గోతులు, స్పీడ్ బ్రేకర్ల వల్ల వచ్చే షాక్స్ నేరుగా వెన్నెముకపై పడతాయి. అందుకే ప్రయాణంలో హెల్మెట్‌తో పాటు నడుముకు సపోర్ట్ ఇచ్చే లుంబార్ బెల్ట్ వాడటం మంచిది. దూర ప్రాంతాలకు బైక్‌పై వెళ్లేవారు మధ్యమధ్యలో ఆగి కాసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల కండరాల ఒత్తిడి తగ్గుతుంది.

వెన్నునొప్పికి ప్రధాన కారణం నడుము , పొత్తికడుపు భాగంలోని కండరాలు బలహీనపడటమే. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కనీసం ఇరవై నిమిషాలు వ్యాయామం చేయడానికి కేటాయించాలి. భుజాలు, నడుము, మెడ భాగాలను సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాలు, యోగాలోని భుజంగాసనం, మార్జాలాసనం వంటివి వెన్నెముకను బలంగా, దృఢంగా మారుస్తాయి. ఈ వ్యాయామాలు కండరాలకు రక్తప్రసరణను పెంచి నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి.

నీరు..

శరీరంలో నీటి శాతం తగ్గితే వెన్నెముక డిస్కులు తమ శోషణ శక్తిని కోల్పోయి త్వరగా అరిగిపోతాయి. అందుకే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి. ఆహారంలో క్యాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి12 ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాలు, ఆకుకూరలు, గుడ్లు, బాదం , నువ్వులు రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవాలి. శరీర బరువు పెరగకుండా చూసుకోవడం కూడా వెన్నునొప్పి నివారణలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

నిద్ర..

రాత్రి వేళల్లో సరైన నిద్ర లేకపోవడం లేదా సరిగ్గా లేని మెత్తటి పరుపులపై పడుకోవడం వల్ల కూడా వెన్నునొప్పి పెరుగుతుంది. మరీ మెత్తగా ఉన్న పరుపుల కంటే వెన్నెముకకు సరైన ఆధారాన్ని ఇచ్చే ఆర్థోపెడిక్ పరుపులను ఉపయోగించడం మంచిది.

చిన్న చిట్కా..

 పడుకునేటప్పుడు కాళ్ళ మధ్యలో చిన్న దిండు పెట్టుకోవడం వల్ల నడుముపై పడే భారం తగ్గుతుంది.
ఈ చిన్నపాటి మార్పులను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా డెస్క్ జాబ్‌లు, బైక్ ప్రయాణాల వల్ల వచ్చే వెన్నునొప్పికి సులభంగా చెక్ పెట్టవచ్చు. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉండి, కాళ్ళలోకి పాకుతున్నట్లు అనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆర్థోపెడిక్ లేదా ఫిజియోథెరపీ వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం.


                    *రూపశ్రీ.