చంద్రబాబు, విజయ్ భేటీ: డీలిమిటేషన్ పై చర్చ.. తమిళనాడు సీఎం విజయ్ ఏపీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి.!
Published on: Sun Oct 11, 2026 9:51AM

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత విజయ్ తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు తమిళనాడు సీఎం విజయ్ మంగళవారం (అక్టోబర్ 13) రాష్ట్రపర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా విజయ్ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. దీంతో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయవాడలో జరగే శరన్నవరాత్రి, విజయవాడ ఉత్సవ్ తిలకించేందుకు విజయ్ రాష్ట్ర పర్యటనకు వస్తున్నప్పటికీ, రాజకీయంగా ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
చంద్రబాబుతో సమావేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కూడా విజయ్ భేటీ కానున్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రజాదరణతో ఎదిగిన ఈ ఇద్దరు నేతల సమావేశంపై కూడా అటు సినీవర్గాలలోనూ, ఇటు రాజకీయవర్గాలలోనూ ఆసక్తి వ్యక్తమౌతోంది. అది పక్కన పెడితే.. చంద్రబాబు, విజయ్ భేటీలో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను ప్రభావితం చేసే డీలిమిటేషన్ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అలాగే.. చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణా జలాలను తమిళనాడుకు తరలించే తెలుగు గంగ ప్రాజెక్టుపై కూడా వీరిరువురి మధ్యా చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఒప్పందం ప్రకారం అందాల్సిన నీటి పరిమాణంపై తమిళనాడులో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీరి భేటీపై ఉభయ రాష్ట్రాలలోనూ ఉత్కంఠ నెలకొంది.
అయితే అన్నిటి కంటే ప్రధానంగా జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలను పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలలో ఆందోళన నెలకొన్న తరుణంలో డీలిమిటేషన్ పై జరిగే చర్చపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది, డీలిమిటేషన్ కారణంగా జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యంపై ప్రభావం పడుతుందనే ఆందోళనల నేపథ్యంలో సీట్ల సంఖ్య పెంపు, రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య సమతుల్యత వంటి అంశాలపై చంద్రబాబు, విజయ్ మధ్య చర్చ జరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో పార్టీ కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ఈ విషయంలో విజయ్ ను ఏ విధంగా ఒప్పిస్తుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. చంద్రబాబు, విజయ్ భేటీలో డీలిమిటేషన్ అంశం ఎజెండాలో ఉందా లేదా అన్నవిషయంలో ఇప్పటి వరకూ క్లారిటీ లేకపోయినా, కచ్చితంగా వీరి భేటీలో ఈ అంశం చర్చకు వస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.
[Delimitation discussion Betweem Chandrababu Naidu And Vijay, Tamil Nadu CM Vijay, AP CM Vijay, Delimitation Bill, Southern States, Telugu Ganga, Krishna waters, Pawan Kalyan, Amaravati Visit, Telugu One]


