ఈ నెలాఖరులో డీలిమిటేషన్ బిల్లు: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. పావులు కదుపుతున్న కేంద్రం.!
Published on: Tue Oct 20, 2026 10:37AM

దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఏదైనా ఉందంటే.. అది నియోజకవర్గాల పునర్విభజన బిల్లు మాత్రమే. అటువంటి కీలక బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి కేంద్రం ముహూర్తం నిర్ణయించేసింది. ఈ నెలాఖరులోనే పార్లమెంటులో ఆ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకోవాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందు కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది
గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి. దేశ అత్యున్నత చట్టసభల రూపురేఖలను సమూలంగా మార్చేయగల ఈ అంశంపైనే ఇప్పుడు రాజకీయవర్గాలలో ఎడతెగని చర్చ జరుగుతోంది.
ఇందు కోసం కేంద్రం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జనాభా ప్రాతిపదికన స్థానాల కేటాయింపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్రం వ్యూహాలకు పదును పెడుతున్నది. పార్లమెంట్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి 850కి పెంచే దిశగా ప్రతిపాదనలు దాదాపు సిద్ధమయ్యాయని చెబుతున్నారు. అలాగే దశాబ్దాల తరబడి వాయిదా పడుతూ వస్తున్న 33 శాతం మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని కూడా ఈ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో జత చేయాలని కేంద్రం నిర్ణయించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికే మహిళలకు చట్టసభల్లో మూడో వంతు స్థానాలు దక్కేలా చేయాలని కేంద్రం భావిస్తోంది.
అయితే.. లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైతే ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా విపరీతంగా పెరిగినందున అక్కడి సీట్లు భారీగా పెరుగుతాయని, ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళన వ్యక్తమౌతున్నది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ఫార్ములా రూపొందించినట్లు తెలుస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ వంటి ఐదు ప్రధాన దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 129 నుండి 195కు పెంచి, దేశంలోని మొత్తం లోక్‌సభ స్థానాల్లో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్య శాతాన్ని తగ్గకుండా కాపాడేలా హోంశాఖ కసరత్తు చేస్తున్నది. ప్రాంతీయ అసమతుల్యతలకు తావులేకుండా అన్ని ప్రాంతాల ప్రయోజనాలకూ సమ ప్రాతినిథ్యం వచ్చేలా బిల్లును రూపొందిస్తున్నట్లు చెబుున్నారు.
ఇక పోతే.. ఈ రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదింపజేసుకోవడం కేంద్రానికి సవాలే. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. దీంతో కేంద్రానికి అందుకు సరిపడా సంఖ్యా బలం పార్లమెంటులో లేకపోవడంతో బిల్లు ఆమోదం సులభ సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం చాకచక్యంగా వ్యవహరిస్తూ, ఇండియా కూటమిలోని కొన్ని కీలక భాగస్వామ్య పక్షాలు, ప్రాంతీయ పార్టీలతో తెరవెనుక లోపాయికారీ సంప్రదింపులు జరుపుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారమౌతోంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో విభేదిస్తున్న కొన్ని ప్రాంతీయ పార్టీలు, అలాగే డీఎంకే వంటి దక్షిణాది ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టడం ద్వారా ఈ ప్రతిష్టాత్మక బిల్లును గట్టెక్కించాలని కేంద్రం పావులు కదుపుతోంది.

ఈ పునర్విభజన ప్రక్రియకు సంబంధించి కేవలం కేంద్ర స్థాయిలోనే కాకుండా, ప్రాంతీయ స్థాయిలో కూడా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గతంలోనే డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది రాష్ట్రాల్లో వస్తున్న అపోహలను తొలగించడానికి, అలాగే అన్ని వర్గాలను విశ్వాసంలోకి తీసుకోవడానికి కేంద్ర పెద్దలు ప్రత్యేక రాయబారాలు నడిపినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు, దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీలలో కూడా ఈ అంశంపై చర్చలు జరిగి, కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక తీర్మానాలు కూడా వెలువడిన నేపథ్యం ఉంది. ఇలాంటి సున్నితమైన రాజకీయ వాతావరణం నెలకొన్న తరుణంలో, కేంద్రం ఈ నెలాఖరున నేరుగా పార్లమెంట్ వేదికగా ఈ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించడం భారతీయ సమాఖ్య వ్యవస్థలో సరికొత్త చర్చకు తెరతీసింది. దక్షిణాది రాష్ట్రాల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా చూస్తామన్న కేంద్రం హామీలు ఎంతవరకు ఆచరణలో నిలుస్తాయనేది వేచి చూడాలి.
[Delimitation Bill before Parliament, Increase Lok Sabha Seats, Womens Reservation Bill, Special Session Parliament, Telugu One]


