హస్తినలో జంతర్ మంతర్ వద్ద నిరసనలకు నో: ఢిల్లీ పోలీసుల కీలక నిర్ణయం.!
Published on: Mon Oct 12, 2026 3:02PM
దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు, ధర్నాలకు కేరాఫ్ అడ్రస్ అయిన జంతర్ మంతర్ వద్ద ఇక నిరసనలకు అవకాశం లేదు. జంతర్ మంతర్ ను అధికారికంగా నిర్దేశించిన నిరసన స్థలాల జాబితా నుంచి తొలగిస్తూ ఢిల్లీ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. జంతర్ మంతర్‌ను అధికారికంగా నిర్దేశించిన నిరసన స్థలాల జాబితాలో ఉంచడం లేదని ప్రకటించారు. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు, వివిధ అంశాలపై ఆందోళనలు నిర్వహించేందుకు జంతర్ మంతర్ కు ప్రత్యామ్నాయంగా మూడు ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్తగా నిరసన వేదికలుగా ప్రకటించిన ప్రాంతాల్లో రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్ ఉన్నాయి. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలో ప్రజా నిరసనలకు అనువైన ప్రత్యామ్నాయ ప్రాంతాలను గుర్తించాలన్న ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు సమాచారం. గతంలో 2022 ఏప్రిల్ 28న జారీ చేసిన ఆదేశాల్లో మార్పులు చేస్తూ జంతర్ మంతర్‌ను నిర్దేశిత నిరసన స్థలాల జాబితా నుంచి తొలగించారు. కొత్తగా ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను తరువాత విడుదల చేయనున్నారు.
ఈ మార్పుతో నిరసనల నిర్వహణకు సంబంధించి అనుమతులు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొత్త ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించాలంటే ఏ అనుమతులు తీసుకోవాలి, ఎన్ని రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి, ఎంతమంది పాల్గొనవచ్చు వంటి పూర్తి వివరాలు సంబంధిత మార్గదర్శకాల్లో స్పష్టం చేసే అవకాశాలున్నాయి.
.webp)
భారత ఎన్నికల సంఘం పనితీరుపై ప్రతిపక్షాలు భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్న సమయంలో పోలీసులు జంతర్ మంతర్ ను నిరసన స్థలాల జాబితా నుంచి తొలగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరిన నేపథ్యంలో పోలీసులు తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
అంతకుముందు అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిర్వహించాలనుకున్న నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందస్తుగా దరఖాస్తు చేసుకోకపోవడం, గతంలో నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించలేదన్న కారణాలతోపాటు శాంతిభద్రతలు, ప్రజల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ అంశాలను అధికారులు ప్రస్తావించారు. ఆ తర్వాత నిరసన వేదికల జాబితాలోనే మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేశారు.
[Delhi Police No To Protests At Jantar Mantar, Delhi Protest Venues, Alternative, Ramlila Maidan, Burari Maidan, CBD Ground, CJP, INDIA, Telugu One]


