ఢిల్లీ మాజీ సీఎస్ ఆత్మహత్య.!
Published on: Wed Sep 9, 2026 1:25PM

ఢిల్లీ మాజీ సీఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాకేశ్ మెహతా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. సీనియర్ ఐఏఎస్ అధికారి బలవన్మరణానికి పాల్పడిన ఘటన అధికారవర్గాలలో సంచలనం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 82 పరిధిలో ఉన్న కేంద్రీయ విహార్ 2 సొసైటీలోని తన ఫ్లాట్‌లో ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
1975 బ్యాచ్‌కు చెందిన రాకేష్ మెహతా గత ఐదేళ్లుగా ఈ ఫ్లాట్‌లో ఒంటరిగా జీవిస్తున్నారు. ఆయన భార్య సైతం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి కాగా.. ఆమె ప్రస్తుతం డెహ్రాడూన్‌లో నివసిస్తున్నారు. అలాగే వారి కుమార్తె లండన్‌లో స్థిరపడ్డారు. కుటుంబ సభ్యులు ఎంత ఫోన్ చేసినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారికి అనుమానం వచ్చి అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బంది వెళ్లి చూడగా లోపల రాకేశ్ మెహతా విగతజీవుడిగా వేలాడుతూ కనిపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు.
ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ ఆధారంగా ఆరోగ్య సమస్యలు, మానసిక ఆందోళన కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో ఆయన సీఎస్ గా పని చేశారు. 2007 నుంచి దాదాపు మూడేళ్లకు పైగా ఆయన ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా కూడా సేవలందించారు. 2010లో ఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ రవాణా రంగం, విద్యుత్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలోనూ, పాలనా పరమైన సంస్కరణలను అమలు చేయడంలోనూ ఆయన ప్రతిభ చాటారు. నిత్యం ఎంతో బిజీగా, సమర్థవంతమైన అధికారితో గుర్తింపు తెచ్చుకున్న ఒక సీనియర్ రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడటం పట్ల సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తం అవుతోంది.
[Delhi Former CS Sucide, Rakesh Mehta suicide, Delhi Former Chief Secretary, IAS officer Rakesh Mehta, Telugu One]


