ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన ఛార్జ్‌షీట్..!
Published on: Wed Sep 9, 2026 9:27PM

దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో జరిగిన భయంకరమైన కారు పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన సంచలన ఛార్జ్‌షీట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. గతేడాది 2025 నవంబర్ 10వ తేదీన సాయంత్రం సరిగ్గా 6:50 గంటల సమయంలో అత్యంత రద్దీగా ఉండే ఎర్రకోట ప్రాంతంలో ఈ విషాదకరమైన పేలుడు సంభవించింది. ఈ భయానక ఘటనలో 11 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరొక 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు దాటికి చుట్టుపక్కల ఉన్న భవనాలు, వాహనాలు కూడా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడి కేవలం అప్పటికప్పుడు అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని, దీని వెనుక ఏళ్ల తరబడి సాగిన అతిపెద్ద ఉగ్ర కుట్ర దాగి ఉందంటూ ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ద్వారా దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
.webp)
ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేసిన వైద్యుడు ఉమర్ ఉన్ నబీ అని ఎన్ఐఏ స్పష్టం చేసింది. నిద్రాణంగా ఉన్న అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (AGuH) అనే ఉగ్రవాద మాడ్యూల్‌ను తిరిగి క్రియాశీలం చేసేందుకు నబీ 2022 ప్రారంభం నుంచే నెట్‌వర్క్ నిర్మించడం ప్రారంభించాడు. ఈ మాడ్యూల్‌కు "ఆపరేషనల్ ఇన్‌చార్జ్"గా వ్యవహరిస్తూ, తీవ్రవాద ఆలోచనలు ఉన్న వ్యక్తులను రాడికలైజ్ చేసి, సాయుధ పోరాటమే మతపరమైన బాధ్యత అని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే నబీ తన సహ నిందితుడు జాసిర్ బిలాల్ వానీతో కలిసి ఒక పాత సెకండ్ హ్యాండ్ హ్యుందాయ్ i20 కారును కొనుగోలు చేశాడు. ఈ వాహనాన్ని ఒక ప్రమాదకరమైన 'వెహికల్-బోర్న్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్' (VBIED)గా, అంటే సంచరించే బాంబుగా మార్చారు. పేలుడు జరిగిన సమయంలో ఉమర్ ఉన్ నబీ స్వయంగా ఆ కారులోనే ఉన్నాడని, దాడి స్థలంలో దొరికిన శరీర భాగాలపై నిర్వహించిన డిఎన్ఏ (DNA) పరీక్షల ద్వారా అతడి గుర్తింపును శాస్త్రీయంగా నిర్ధారించారు.
దర్యాప్తులో లభించిన ఫోరెన్సిక్ ఆధారాల ప్రకారం, పేలుడు ప్రదేశంలో టిఎటిపి (TATP) అమ్మోనియం నైట్రేట్ సహా తీవ్ర తీవ్రత కలిగిన పేలుడు పదార్థాల అవశేషాలు లభించాయి. వాహనం లోపల నుంచే కమాండ్ మెకానిజం ద్వారా ఈ బాంబును ప్రేరేపించినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. అంతకంటే సంచలన విషయం ఏమిటంటే, ఈ ఉగ్ర నెట్‌వర్క్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా దాడుల కోసం దుర్వినియోగం చేసింది. సహ నిందితుడు జాసిర్ బిలాల్ వానీ రాకెట్లను తయారు చేసే విధానాల కోసం యూట్యూబ్ చాట్‌జిపిటి (ChatGPT) వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను విస్తృతంగా శోధించినట్లు ఛార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ పేర్కొంది. అలాగే, ఉమర్ ఉన్ నబీ నిందితుడికి రెండు డ్రోన్లను కూడా అందించినట్లు తేలింది.
ఈ ఉగ్ర సభ్యులు జమ్మూ కశ్మీర్ ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ శిక్షణ పొందారు. ఇంటెలిజెన్స్ సంస్థల కంట పడకుండా ఉండేందుకు సిగ్నల్ (Signal) వంటి ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా సంప్రదింపులు జరిపారు. నకలీ పేర్లు, తీవ్రవాద సాహిత్యం పంపిణీ ఆర్థిక మూలాల సమీకరణతో దేశంలో పెద్దయెత్తున విధ్వంసానికి ప్లాన్ చేశారు. అయితే, కారు పేలుడులోనే ప్రధాన కుట్రదారు ఉమర్ ఉన్ నబీ మరణించడంతో అతడిపై న్యాయపరమైన చర్యలు ముగిసినప్పటికీ, ఈ సమగ్ర ఛార్జ్‌షీట్ ద్వారా ఎన్ఐఏ దేశద్రోహుల కుట్రలన్నింటినీ కోర్టు ముందు పూసగుచ్చినట్లు ఉంచింది.
(Delhi car blast, NIA chargesheet, Red Fort blast case, Umer Un Nabi, AGuH terror module, VBIED attack, Telugu news, Telugu One)


