అనర్హత వేట్లు కాదు: ఎన్నికల వ్యవస్థలో మార్పు రావాలి.!
Published on: Fri Sep 25, 2026 4:22PM
.webp)
ప్రస్తుత రాజకీయాలలో పార్టీ ఫిరాయింపులు అన్నది రివాజుగా మారిపోయింది. ఉదయం ఒక పార్టీ, సాయంత్రానికి మరో పార్టీ.. తెల్లారేసరికి మరో పరా్టీ అన్నట్లుగా రంగులు మార్చేయడం సర్వసాధారణమైపోయింది. ఇందులోంచే ఆయారం, గయారాం అన్న నానుడి పుట్టిందని చెప్పవచ్చు. ఒక పార్టీ తరఫున చట్ట సభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, తమను ఎన్నుకున్న ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా, నైతికత గురించి ఇసుమంతైనా సంకోచించకుండా రాత్రికి రాత్రి మరో పార్టీలోకి జంప్ జిలానీ అన్నట్లుగా దూకేస్తున్నారు. దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి. ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష, రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
తాజాగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పడిన అనర్హత వేటు.. మరో సారి రాజకీయాలలో పార్టీ ఫిరాయింపులు, నైతిక విలువలపై మరో సారి చర్చకు తెరలేపింది. ఒక పార్టీ గుర్తుపై శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తూ, మరో పార్టీ తరఫున పోటీ చేయడంతో దానంపై అనర్హత వేటు పడింది. ఇది దేశ వ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడే నేతలకు హెచ్చరిక అనడంలో సందేహంలేదు.
అయితే.. ఈ సందర్భంగా కేవలం ఫిరాయింపులపైనే కాకుండా ఎన్నికల వ్యవస్థలోని గూడుకట్టుకుని పోయిన లోపాలు, లొసుగుల గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. ప్రస్తుత ఎన్నికల తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా ఉందన్న అభిప్రాయం ప్రజాస్వామ్య వాదులు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలు ఖరీదైన వ్యవహారంగా మారిపోయి.. సామాన్యుడికి భాగస్వామ్యం లేని తంతుగా తయారయ్యాయి. ఎన్నికలలో పోటీ చేయాలంటే.. ఎన్నివందల కోట్లు ఖర్చు పెట్టగలరు? అన్న ప్రశ్న ఎదుర్కోవలసి వస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. ఎలాంటి ప్రలోభాలు లేకుండా నిష్పక్షపాతంగా ఓటు వేయాల్సిన ఓటర్లు సైతం డబ్బులు, వస్తువుల పంపిణీని ఆశించే స్థాయికి దిగజారేలా, కాదు కాదు దిగజార్చేలా ఎన్నికల తీరు మారిపోయింది. నిజాయితీగా పేద ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నవారు ఎన్నికల వ్యయాన్ని తట్టుకోలేక ఈ ప్రక్రియకు దూరం అవుతున్నారు.
మరోవైపు.. సాంకేతికత ఎన్నికల ప్రచార శైలిని పూర్తిగా మార్చేసింది. కార్పొరేట్ సంస్థలు, పెద్ద వ్యాపారవేత్తలు, ప్రొఫెషనల్ వ్యూహకర్తలు రాజకీయాలను శాసించే పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై అసత్య ప్రచారాలు చేయడం, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి చొప్పించడం మొత్తంగా వాతావరణాన్ని కలుషితం చేస్తోంది. ఏఐ వంటి సాంకేతికతో నిజం, అబద్ధం మద్య గీత చెరిగిపోయినట్లైంది.
నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు చట్టసభల్లోకి ప్రవేశిస్తున్నారనే విషయాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలు ఎప్పకటికప్పుడు నివేదికల ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నా.. వాకిరి నిరోధించే యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్రకే పరిమితమైపోయిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి మారకుండా, చట్టసభల్లో అనర్హత వేటుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎన్నికల వ్యవస్థలో సమూల ప్రక్షాళన జరగాల్సి ఉంది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ఖర్చు కట్టడి, ప్రలోభాలకు తెరదించడం లాంటి చర్యల ద్వారానే ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లుతుంది.
[Defection, Danam Nagender Disqualification, Party Jump Leaders, AAyaram GayaRam, Election Expenses, Telugu One]


