TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రవాణా రంగంలో మైలురాయి.. అందుబాటులోకి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నెట్‌వర్క్.!

Published on: Sat Sep 12, 2026 6:04PM

దేశ పారిశ్రామిక మరియు సరుకు రవాణా రంగ రూపురేఖలను పూర్తిగా మార్చివేసే లక్ష్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్సీ) నెట్‌వర్క్ ఎట్టకేలకు వాస్తవ రూపం దాల్చింది. దశాబ్దాల నిరీక్షణ, వేల కోట్ల రూపాయల వ్యయం, పరిపాలనాపరమైన అడ్డంకులను అధిగమిస్తూ ఈ బృహత్తర ప్రాజెక్ట్ రూపుదాల్చింది. ఇందులో భాగంగా పశ్చిమ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌కు సంబంధించి మిగిలి ఉన్న చివరి మూడు కీలక విభాగాలను దేశానికి అంకితం చేయడంతో, మొత్తం 2 వేల 843 కిలోమీటర్ల నెట్‌వర్క్ ఇప్పుడు అధికారికంగా పూర్తి స్థాయిలో కార్యకలాపాలను ప్రారంభించింది. తూర్పు కారిడార్‌తో పాటు పశ్చిమ కారిడార్ కూడా పూర్తి కావడంతో దేశ లాజిస్టిక్స్,  ఎగుమతి, దిగుమతి  రంగాలకు మార్గం సుగమమైంది.  ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా తాజాగా ప్రారంభించిన మూడు కొత్త విభాగాలు రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నాయి. న్యూ సనంద్ ఉత్తరం నుంచి న్యూ మకర్‌పురా, న్యూ ఉంబర్‌గావ్ నుంచి న్యూ సఫాలె, అలాగే న్యూ సఫాలె నుంచి న్యూ జేఎన్‌పీటీ వరకు విస్తరించి ఉన్న ఈ మార్గాలు  326 కిలోమీటర్ల మేర ఉన్నాయి. ఇందుకు రమారమి  20 వేల700 కోట్ల రూపాయల వ్యయం అయ్యింది. 

ముంబై సమీపంలోని ప్రధాన ఓడరేవైన జేఎన్‌పీటీ పోర్టుకు నేరుగా రైలు మార్గం అనుసంధానం లభించడం వల్ల సరుకు రవాణా వేగం అనూహ్యంగా పుంజుకుంది. సాధారణ ప్రయాణికుల రైళ్ల రద్దీతో సంబంధం లేకుండా కేవలం సరుకు రవాణా కోసం మాత్రమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ మార్గాలు దేశ ఆర్థిక ప్రగతికి బలమైన ఊతమిస్తున్నాయి.  చారిత్రకంగా ఇండియన్ రైల్వే ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్రయాణికుల రైళ్లు,  సరుకు రవాణా బండ్లను ఒకే ట్రాక్‌పై నడపాల్సి రావడమే. దేశం మొత్తం సరుకు రవాణాలో సింహభాగం మోసే  ప్రధాన ట్రంక్ రూట్లలో రైళ్ల సామర్థ్యం పూర్తిగా సంతృప్త స్థాయికి చేరుకుంది. దీనివల్ల ఒకప్పుడు సరుకు రవాణా రైళ్లు గంటకు  20 నుంచి పాతిక కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాల్సి వచ్చేది.  అలాగే వెనుక వస్తున్న ప్రయాణికుల రైళ్లకు మార్గం ఇవ్వడం కోసం సరుకు రవాణా రైళ్లను గంటల తరబడి మార్గమధ్యంలోని సైడింగుల్లో నిలిపివేయాల్సిన దుస్థితి ఉండేది. ఈ ప్రతిబంధకాలను తొలగించే ఉద్దేశంతోనే పదేళ్ల ప్రణాళికా కాలంలో ప్రత్యేక కారిడార్ల నిర్మాణం తెరపైకి వచ్చింది.  ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలు రెండు దశాబ్దాల క్రితం పదవ పంచవర్ష ప్రణాళికా కాలంలో అంకురార్పణ చుట్టుకున్నాయి. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ మార్గాల వెంబడి ప్రత్యేక ఫ్రైట్ కారిడార్లు నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చిన తర్వాత, నిపుణుల కమిటీలు,  రైట్స్  సంస్థ సంయుక్తంగా సాధ్యాసాధ్యాలపై విస్తృత అధ్యయనాలు జరిపాయి. 

జపాన్  సహకారం,  ప్రపంచ బ్యాంకు,  జైకా సంస్థల ఆర్థిక సహాయం ఈ ప్రాజెక్ట్‌కు ప్రారంభ దశలో కీలకంగా నిలిచాయి. స్పెషల్ యుటిలిటీ వెహికిల్ గా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్  సంస్థను ఏర్పాటు చేసి నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. మొదట్లో తూర్పు ప్రాంతంలో లూథియానా నుంచి డాంకుని వరకు, పశ్చిమ ప్రాంతంలో ముంబై నుంచి దాద్రి వరకు ఈ నెట్‌వర్క్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  అయితే ప్రారంభ దశలో ఆశించిన వేగం కొరవడటంతో ప్రాజెక్ట్ పనులు బాగా జాప్యం అయ్యాయి. తొలుత కేవలం   28 వేల 181 కోట్ల అంచనా వ్యయంతో ఐదేళ్లలో పూర్తి కావాల్సిన ఈ నిర్మాణం, అనేక  పాలనాపరమైన జాప్యాల కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది.  అలైన్‌మెంట్ల ఖరారులో మీనమేషాలు లెక్కించడం, భూసేకరణలో తలెత్తిన చట్టపరమైన చిక్కులు, కాంట్రాక్టర్ల మార్పులు,  వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం వంటి అంశాలు వ్యయం విపరీతంగా పెరిగేందుకు దారితీశాయి. 

ప్రభుత్వ నివేదికల ప్రకారం 2014 నాటికి క్షేత్రస్థాయిలో ఆచరణాత్మకంగా ఒక్క కిలోమీటర్ మేర కూడా ట్రాక్ అందుబాటులోకి రాలేదనే వాదనలు వినిపించాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి పనులను వేగవంతం చేయడంతో క్రమంగా ఒక్కో విభాగం పూర్తయ్యింది.  ఈ ప్రాజెక్ట్ అమలు తీరుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్  సంస్థ జరిపిన ఆడిట్లు పలు కీలక అంశాలను వెలుగులోకి తెచ్చాయి. 

  ఆర్థిక ప్రణాళిక లోపం,  కన్సెషన్ ఒప్పందాలను ఖరారు చేయకుండానే అప్పట్లో ప్రాజెక్ట్‌కు తుది ఆమోదాలు కోరడం వల్లనే వ్యయం విపరీతంగా పెరిగిందని ఆడిట్ నివేదికలు స్పష్టం చేశాయి. ప్రారంభంలో   21 వేల కోట్ల రూపాయలుగా ఉన్న అంచనాలు క్రమంగా  81 వేల కోట్ల రూపాయలకు,  ఆ తర్వాత తాజా లెక్కల ప్రకారం  1.24 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. భూసేకరణలో తప్పులు, పరిహారాల చెల్లింపుల్లో ఆలస్యం,   సాంకేతిక కారణాల వల్ల వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రభుత్వాలు భరించాల్సి వచ్చిందని నివేదికలు ఎత్తిచూపాయి. అయినప్పటికీ అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ తూర్పు కారిడార్‌ను పూర్తి చేసిన యంత్రాంగం, తాజాగా పశ్చిమ కారిడార్‌ను కూడా   పూర్తి చేసింది.  రాజకీయంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడానికి పట్టిన సమయంపై  విమర్శలు, ప్రతివిమర్శలు చెలరేగాయి. 

గత ప్రభుత్వాల హయాంలో ఫైళ్లు ఒక బల్ల నుంచి మరో బల్లకు మారుతూ కాలయాపన చేశాయని ప్రస్తుత పాలకులు విమర్శిస్తుండగా..  క్షేత్రస్థాయిలో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఉండే సహజమైన జాప్యాలే ఇందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ప్రస్తుత నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సరుకు రవాణా రంగంలో వస్తున్న మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రోజువారీగా వందలాది ఫ్రైట్ రైళ్లు ఈ మార్గాల్లో రాకపోకలు సాగిస్తూ గమ్యస్థానాలను అత్యంత వేగంగా చేరుకుంటున్నాయి.

సాంప్రదాయ మార్గాలతో పోలిస్తే సరుకు రవాణా సమయం దాదాపు సగానికి సగం తగ్గిపోవడం పారిశ్రామిక వర్గాలకు ఎంతో ఊరటనిస్తోంది.  ఈ కారిడార్ల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ మార్గాలు. . ముఖ్యంగా పశ్చిమ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా డబుల్, స్టాక్ కంటైనర్ల రాకపోకలకు అనుకూలంగా ప్రత్యేకమైన ఎత్తైన ఓవర్‌హెడ్ వైర్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఒకే రైలులో రెండు కంటైనర్లను ఒకదానిపై ఒకటి అమర్చి రవాణా చేయడం సాధ్యమవుతోంది. ఇది ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ఒకేసారి భారీ మొత్తంలో సరును తరలించే సామర్థ్యాన్ని పెంచింది. అంతేకాకుండా.. రవాణా రంగంలో కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది.  దేశంలో లాజిస్టిక్స్ వ్యయాన్ని స్థూల దేశీయోత్పత్తిలో  గణనీయంగా తగ్గించడంలో ఈ కారిడార్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

రోడ్డు మార్గాల ద్వారా సరుకు రవాణా చేసే వ్యయంతో పోలిస్తే రైలు మార్గాల ద్వారా జరిగే రవాణా ఎంతో పొదుపుతో కూడుకున్నది కావడంతో తయారీ రంగం మరింత పోటీతత్వాన్ని సంతరించుకుంటోంది. అయితే, పూర్తి స్థాయిలో సామర్థ్యాన్ని వినియోగించుకోవాలంటే ప్రధాన కారిడార్లతో పాటు అనుసంధానంగా ఉండే ఫీడర్ రూట్లను కూడా   అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే టెర్మినల్స్‌ వద్ద మౌలిక వసతులు,  రోలింగ్ స్టాక్ నిర్వహణ  మెరుగుపరచడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నారు. 

 భవిష్యత్ విస్తరణలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని డాంకుని నుంచి గుజరాత్‌లోని సూరత్ వరకు మరో కొత్త కారిడార్ ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. గత రెండు దశాబ్దాల కాలంలో ఎదురైన అనుభవాలు, పాఠాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే ప్రాజెక్టులను మరింత వేగంగా మరియు కచ్చితమైన ప్రణాళికతో పూర్తి చేయాలని యంత్రాగం భావిస్తోంది. రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నెట్‌వర్క్ భారతీయ రవాణా రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చడంలో ప్రధాన భూమిక పోషిస్తుందడంలో ఎలాంటి సందేహం లేదు. 

-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.     

[Dedicated Freight Corridor, WDFC EDFC, Indian Railways,Telugu One]