సాంబారులో చచ్చిన బల్లి: 40 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు.!
Published on: Fri Sep 25, 2026 1:15PM

పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మరియు అల్పాహార పథకాల నిర్వహణలో పెరుగుతున్న నిర్లక్ష్యం మరోసారి పిల్లల ప్రాణాల మీదకు తెచ్చింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకున్న ఘటన కలకలం రేపింది.
ఉదయం వేళ పాఠశాల ప్రారంభమైన సమయంలో ఎప్పటిలాగే అల్పాహారాన్ని అందించేందుకు పాఠశాల సిబ్బంది ఏర్పాట్లు చేశారు. వంటగదిలో సిద్ధం చేసిన అల్పాహారంతో పాటు సాంబారును విద్యార్థులకు వడ్డించారు. అయితే సాంబారులో చచ్చిన బల్లి పడి ఉండటాన్ని గుర్తించిన విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆహారం తిన్న 40 మందికి పైగా విద్యార్థులు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. ఆ తరువాత కొద్దిసేపటికే తీవ్రమైన కళ్లు తిరగడం, తలతిరగడం, కడుపునొప్పి వంటి సమస్యలతో విలవిల్లాడి పోయారు. కొందరు స్పృహతప్పి పడిపోయారు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులను హుటాహుటిన సమీపంలోని తిరువళ్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
.webp)
ఈ వార్త తెలిసిన వెంటనే బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న జిల్లా విద్యా, రెవెన్యూ శాఖల అధికారులు ఘటన జరిగిన పాఠశాలను సందర్శించి, వంటగదిలోని పరిస్థితులను, సాంబారును పరిశీలించారు. ఈ దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
[Dead Lizard Sambar, Tamil Nadu school Food Poison, Students Ill, School Breakfast, Telugu One]


